మోదీపై సీతారాం ఏచూరి సంచలన వ్యాఖ్య
న్యూఢిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రధాని నరేంద్రమోదీని తీవ్రంగా విమర్శించారు. మోదీ ఓ తుగ్లక్ అని, ఆదేశాలు జారీ చేసి కనిపించకుండా పోయారని వ్యాఖ్యానించాడు. పెద్ద నోట్ల రద్దు విషయంలో అంతకుముందు రోజు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన ఆయన శుక్రవారం కూడా అంతే స్థాయిలో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
'మెట్రో నగరాల్లో ఇప్పటికే 20 నుంచి 25శాతం డబ్బుకు డిమాండ్ పెరిగింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. కానీ తుగ్లక్(ప్రధాని మోదీ) మాత్రం ఆదేశాలు ఇచ్చి కనిపించకుండా పోయారు' అంటూ ఆయన ట్వీట్ చేశారు. రూ.500 నోట్లు భిన్నవిధాలుగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గురించి ఆయనను ప్రశ్నించగా అందుకు కూడా ప్రధానిని విమర్శించారు. దొంగ నోట్లను అరికట్టేందుకు ప్రధాని అనుసరిస్తున్న మోదీ విధానం ఇలాగే ఉంటుందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.