
సాక్షి,న్యూఢిల్లీ: యోగాకు మతంతో సంబంధం లేదని, ప్రాచీన శాస్త్రమైన యోగకు మత కోణాన్నిజొప్పించడం సమాజానికి హాని కలిగిస్తుందని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. యోగపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరగాలని, ఇతర వైద్య విధానాల మాదిరిగానే యోగ కూడా మానవాళికి మేలు చేకూర్చే ప్ర్రక్రియేనని చెప్పారు. మంగళవారం అంతర్జాయ యోగ సదస్సును వెంకయ్య నాయుడు ప్రారంభించారు. శారీరక పటుత్వం, మానసిక ప్రశాంతత, ఆథ్యాత్మిక ప్రశాంతతలు అందించే యోగ అన్ని వ్యాయామాలకూ తల్లి వంటిదని అభివర్ణించారు. యోగతో వైద్య బిల్లుల భారం తప్పుతుందన్నారు.
ప్రాచీన శాస్త్రమైన యోగను ప్రజల సుఖ సంతోషాలకూ, ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగించేలా ఈ సదస్సు దిశానిర్ధేశం చేయాలని ఆకాంక్షించారు. యోగను ఇంటింటికీ తీసుకువెళ్లడంలో బాబా రాందావ్ చొరవ చూపారని ప్రశంసించారు.మన పూర్వీకుల నుంచి మనం అందుకున్న యోగ విజ్ఞానాన్ని పదిలంగా ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఆధునిక సమాజంలో తలెత్తే ఆరోగ్య, మానసిక సమస్యలను దీటుగా ఎదుర్కొనేందుకు యోగను దినచర్యలో భాగం చేసుకోవాలని సచించారు.యోగ కేవలం శారీరక ఫిట్‌నెస్‌కే ఉపకరిస్తుందనే అపోహ నెలకొందన్నారు.యోగ ద్వారా మనస్సు, శరీరం ఉత్తేజితమవుతాయని, ధ్యాన, శ్వాస ప్రక్రియల ద్వారా వ్యక్తి అన్ని విధాలా ధృడంగా ఉండేందుకు ఇది ఉపకరిస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment