యోగి ఆదిత్యనాథ్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రణాళికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. భారతదేశంలోనే జానాభా విషయంలో అత్యంత పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు కాపాడేందుకు లక్షకు పైగా పోలీసు పోస్టులను భర్తీ చేయాలన్న యోగి ఆలోచనలకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది. దాదాపు నెల రోజుల క్రితం ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన యోగి ఆదిత్యనాథ్.. ప్రతియేటా సుమారు 33 వేల మంది కానిస్టేబుళ్లను నియమించడం ద్వారా 2021 నాటికి రాష్ట్రంలో ఉన్నమొత్తం పోలీసు ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని తలపెట్టారు. దీనికి సుప్రీంకోర్టు సరేనంది.
నియామకాలు ఆలస్యమైతే.. రాష్ట్ర హోం మంత్రిత్వశాఖ ముఖ్య కార్యదర్శి లేదా అత్యంత సీనియర్ అధికారినే తప్పుబట్టాల్సి వస్తుందని కూడా సుప్రీంకోర్టు తెలిపింది. వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న సుమారు 5.52 లక్షల పోలీసు పోస్టులను అత్యవసరంగా భర్తీ చేయాలని సుప్రీంకోర్టు గతవారం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో అన్నింటికంటే ఎక్కువగా 1.5 లక్షల పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అక్కడ మొత్తం 3.5 లక్షల మంది కానిస్టేబుళ్లు, ఇతర పోలీసు అధికారుల పోస్టులు మంజూరై ఉన్నాయి. దేశంలో పోలీసు విభాగంలో ఖాళీలను భర్తీ చేయించాలంటూ 2013లో ఒక ప్రజాహిత వ్యాజ్యం నమోదైంది. దాని విచారణ సందర్భంగానే యోగి ఆదిత్యనాథ్ ప్రణాళికలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.