లక్నో: అత్యంత ప్రతిష్టాత్మకమైన అయోధ్య రామమందిరం సమీపంలోని భూములను కొంటూ బీజేపీ నేతలు, ఉన్నతాధికారులు భూకుంభకో ణానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అక్రమ కొనుగోళ్లు జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సర్కార్ హెచ్చరించింది. రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదం కేసులో 2019లో చరిత్రాత్మక తీర్పు వెలువడిన మరు క్షణమే అయోధ్య, పరిసర ప్రాంతాల్లో భూముల బలవంతపు కొనుగోళ్ల పర్వం ఊపందుకుందని మీడియాలో వార్తలొచ్చాయి.
బీజేపీ నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, కమిషన్ బంధువులు, సబ్ డివిజన్ మేజిస్ట్రేట్, డీఐజీ తదితరులు అయోధ్య సమీప స్థలాలను కొనుగోలు చేశారన్న వార్త రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. దీంతో ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ రెవెన్యూ శాఖను ఆదేశించారని యూపీ అదనపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(సమాచార) నవనీత్ సెహగల్ చెప్పారు. మతం ముసుగులో హిందుత్వ వాదులు స్థలాలను దోచుకుంటున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి: ప్రియాంక
కుంభకోణంపై యూపీ సర్కార్ దర్యాప్తునకు ఆదేశించడాన్ని కంటి తుడుపు చర్యగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అభివర్ణించారు. ఆలయం కోసం అధిక ధరలకు భూములు కొంటూ ఆలయ ట్రస్ట్ సభ్యులు, అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రియాంక ఆరోపించారు. సుప్రీంకోర్టు సూమోటోగా కలగజేసుకుని న్యాయం చేయాలన్నారు. ఆలయం కోసం వేల కోట్ల విరాళాలిచ్చిన రామభక్తుల నమ్మకాన్ని వమ్ముచేస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని బీఎస్‌పీ చీఫ్ మాయవతి సైతం డిమాండ్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment