ఊహాత్మక చిత్రం
లక్నో : అయోధ్యను పర్యాటకంగా, మరింత ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామజన్మ భూమిలో అత్యంత ఎత్తైన రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం సాయంత్రం యూపీ కేబినెట్ సమావేశం అనంతరం సీఎం యోగి ఆదిత్యనాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. అయోధ్యను అన్ని విధాల అభివృద్ది చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కంటే ఎత్తైన రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అయోధ్యలోని సరయూ నది తీరాన వంద ఎకరాల భూమిలో 251 మీటర్ల అతి పెద్ద రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అతిత్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు.
ఈ విగ్రహ ఏర్పాటుకు గుజరాత్ నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటామన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సర్వే కోసం ఐఐటీ కాన్పూర్, నాగ్‌పూర్ బేస్డ్ నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సహకారం తీసుకుంటామన్నారు. అయోధ్యలో విగ్రహంతో పాటు డిజిటల్ మ్యూజియం, లైబ్రెరీ, ఫుడ్‌ఫ్లాజాలు, మైదానం, గోశాలలు నిర్మించాలని సమావేశంలో తీర్మానించినట్లు సీఎం తెలిపారు. ఇక ఈ ఏడాది ఆరంభంలోనే అయోధ్య రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో కొయ్యతో తయారు చేసిన ఏడడుగుల రాముడి విగ్రహాన్ని అవిష్కరించారు. గతేడాది గుజరాత్‌లో ఐక్యతా విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) పేరిట 183 మీటర్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment