రాష్ట్రాన్ని వదిలిపోతే మీకే మంచిది: సీఎం వార్నింగ్
గోరఖ్‌పూర్: యూపీలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారు, నేరస్థులు, మాఫియా గ్యాంగ్‌లు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. అలా చేస్తే వారికే మంచిదని లేనిపక్షంలో కఠిన శిక్షలు అనుభవించాల్సి వస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్‌ను ఉత్తమ్‌ప్రదేశ్‌ను తీర్చి దిద్దడమే తన కర్తవ్యమని పేర్కొన్న యోగి ప్రస్తుతం అదే బాటలో నడుస్తున్నారనడానికి తాజా హెచ్చరికలే నిదర్శనం. ఇప్పటివరకూ యూపీ అంధకారంలో మగ్గిపోయిందని, రాష్ట్రానికి ఎంతో చెడ్డపేరు ఉందని.. వీటి నుంచి క్లీన్ స్టేట్ చేయాడానికి ప్రజలు సహకారం అందించాలన్నారు.
శాంతి భద్రతలను కాపాడటం, మహిళలపై దాడులను అరికడుతూ వారిలో అభద్రతా భావాన్ని తొలగించడమే తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మార్పు కోరుకునేవాళ్లు రోజుకు 18-20 గంటలు పనిచేయాల్సి ఉంటుందని, ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఇది తగిన సమయం కాదన్నారు. మంత్రులు ప్రజలకు తమ ఇల్లు, కార్యాలయాలలో అందుబాటులో ఉండాలని సహచర మంత్రులకు సూచించారు. మార్పు కోసం పనిచేసే వారిని ఎప్పుడూ స్వాగతిస్తామని, వారికి ప్రభుత్వ మద్ధతు ఉంటుందని హామీ ఇచ్చారు.
'మా ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో రెండునెలల్లో మీకే తెలుస్తుంది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటాం. రాష్ట్రంలో ఉన్న చెత్తను ఏరిపారేస్తాం. గుండా, రౌడీ అనే పదాలు ఇక వినిపించవు. క్రిమినల్స్ రాష్ట్రాన్ని వదిలిపెట్టడం మంచిది. మారితే వారికే మంచిది. లేనిపక్షంలో జైళ్లలో జీవితం గడపాల్సి ఉంటుంది' అని యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.