Chief Minister Yogi Adityanath
-
మోదీ రూట్లో యూపీ సీఎం కూడా...
సాక్షి, లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ రాముడి విగ్రహాన్ని నెలకొల్పేందుకు సన్నాహాలు చేయబోతున్నారు. సరయు నది ఒడ్డున ‘నవ్య అయోధ్య’లో భాగంగా విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు సన్నాహాలు ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు గవర్నర్ రామ్ నాయక్‌కు పర్యాటక శాఖ ఓ ప్రతిపాదన పంపగా.. టూరిజం ప్రిన్సిపల్ సెక్రెటరీ అవానిశ్ కుమార్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారంట. సుమారు 100 మీటర్లు ఎత్తైన విగ్రహాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నప్పటికీ.. ఎత్తు విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, అది ఇంకా ఎక్కువే ఉండొచ్చని ఓ అధికారి తెలిపారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అనుమతులు పొందాక సరయుఘాట్ లో రాముడి విగ్రహ నిర్మాణ పనులు మొదలవుతాయని చెబుతున్నారు. అధికారికంగా ఎంత ఖర్చవుతుందో వెల్లడించలేదు. ఇదే సమావేశంలో దీపావళి పండగ సందర్భంగా నిర్వహించబోయే వేడుకల గురించి కూడా చర్చించినట్లు అధికారులు తెలిపారు. లక్ష దీపోత్సవంతోపాటు అయోధ్య వరకు శోభ యాత్ర నిర్వహించేందుకు ఆదిత్యానాథ్ సర్కార్ సిద్ధమౌతోంది. దేశ ఐక్యతకు చిహ్నంగా మోదీ పేర్కొంటూ ఉక్కు మనిషి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అతిపెద్ద విగ్రహాన్ని నర్మదా నదీ తీరంలో నెలకొల్పబోతున్న విషయం తెలిసిందే. 182 మీటర్ల(597 అడుగులు) ఎత్తుతో 19వేల చదరపు కిలోమీటర్ల వ్యాసార్ధంలో 2500 కోట్ల భారీ ఖర్చుతో పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహానికి రెండింతలు పెద్దదన్న మాట. ఈ విగ్రహం నిర్మాణానికి మూడు నుంచి మూడున్నర సంవత్సరాల సమయం పడుతుందని అంచనా. -
రాష్ట్రాన్ని వదిలిపోతే మీకే మంచిది: సీఎం వార్నింగ్
గోరఖ్‌పూర్: యూపీలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారు, నేరస్థులు, మాఫియా గ్యాంగ్‌లు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. అలా చేస్తే వారికే మంచిదని లేనిపక్షంలో కఠిన శిక్షలు అనుభవించాల్సి వస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్‌ను ఉత్తమ్ప్రదేశ్ను తీర్చి దిద్దడమే తన కర్తవ్యమని పేర్కొన్న యోగి ప్రస్తుతం అదే బాటలో నడుస్తున్నారనడానికి తాజా హెచ్చరికలే నిదర్శనం. ఇప్పటివరకూ యూపీ అంధకారంలో మగ్గిపోయిందని, రాష్ట్రానికి ఎంతో చెడ్డపేరు ఉందని.. వీటి నుంచి క్లీన్ స్టేట్ చేయాడానికి ప్రజలు సహకారం అందించాలన్నారు. శాంతి భద్రతలను కాపాడటం, మహిళలపై దాడులను అరికడుతూ వారిలో అభద్రతా భావాన్ని తొలగించడమే తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మార్పు కోరుకునేవాళ్లు రోజుకు 18-20 గంటలు పనిచేయాల్సి ఉంటుందని, ఎంటర్టైన్మెంట్కు ఇది తగిన సమయం కాదన్నారు. మంత్రులు ప్రజలకు తమ ఇల్లు, కార్యాలయాలలో అందుబాటులో ఉండాలని సహచర మంత్రులకు సూచించారు. మార్పు కోసం పనిచేసే వారిని ఎప్పుడూ స్వాగతిస్తామని, వారికి ప్రభుత్వ మద్ధతు ఉంటుందని హామీ ఇచ్చారు. 'మా ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో రెండునెలల్లో మీకే తెలుస్తుంది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటాం. రాష్ట్రంలో ఉన్న చెత్తను ఏరిపారేస్తాం. గుండా, రౌడీ అనే పదాలు ఇక వినిపించవు. క్రిమినల్స్ రాష్ట్రాన్ని వదిలిపెట్టడం మంచిది. మారితే వారికే మంచిది. లేనిపక్షంలో జైళ్లలో జీవితం గడపాల్సి ఉంటుంది' అని యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు.