ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ అర్ధ కుంభమేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మకర సంక్రాంతి నుంచి మహా శివరాత్రి వరకు సాగే ఈ కుంభమేళాకు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. జనవరి 15 నుంచి మార్చి 4 వరకు జరిగే ఈ అర్ధ కుంభమేళాలో సాధారణ భక్తులతోపాటు వీఐపీలు, వీవీఐపీలు, ఎన్నారైల కోసం వేర్వేరుగా ఏర్పాట్లు చేసినట్లు ఉత్తరప్రదేశ్ సర్కారు ప్రకటించింది. అలహాబాద్‌ను పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చిన తర్వాత జరిగే తొలి అర్ధ కుంభమేళా ఇదే. దీంతో యోగి ఆదిత్యనాథ్ సర్కారు కూడా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది.
ఈ వేడుకలకు పూర్తిగా కార్పొరేట్ కళను అద్దింది. గంగ, యమున నది ఒడ్డున 100 హెక్టార్ల స్థలంలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో ‘టెంట్ సిటీ’ని నిర్మించింది. 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, 22 తాత్కాలిక వంతెనలు, 40 వేల ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసింది. ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్లు వెలిశాయి. కుంభమేళా భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా 1.25 లక్షల టాయిలెట్స్‌ను నిర్మించారు. కుంభమేళా జరిగే ప్రాంతం పరిశుభ్రంగా ఉండటం కోసం 20వేల చెత్తడబ్బాలను ఏర్పాటు చేశారు. ఈ పండుగను అపురూపమైన సాంస్కృతిక వారసత్వ ప్రతీకగా ఇప్పటికే యునెస్కో గుర్తించింది.
దేశవ్యాప్తంగా 6 లక్షల గ్రామాలున్నాయని.. ఈ గ్రామాల నుంచి కనీసం ఒక్కొక్కరైనా ఈసారి అర్ధ కుంభమేళాకు హాజరవ్వాలని యోగి సర్కార్ పిలుపునిచ్చింది. మొత్తంగా 71 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు ఇప్పటికే త్రివేణి సంగమాన్ని సందర్శించి గంగానదీ తీరంలో తమ దేశాల జెండాలను ఎగురవేశారు. పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తులే కాకుండా, పర్యాటకుల్ని కూడా ఆకర్షించేలా ఫైవ్‌స్టార్ హోటల్స్ ఉండే సదుపాయాలతో 2 వేల గుడారాలను ఏర్పాటు చేశారు. ఎన్నారైలు బస చేయడానికి విల్లాలు, మధ్యతరగతి వారికి కాటేజీలు, సామాన్య భక్తుల కోసం డార్మెటరీలు ఇలా అన్ని తరగతుల వారు బస చేసేలా టెంట్ సిటీని రూపొందించారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్
కుంభమేళా అంటే!
ప్రతీ పన్నెండేళ్లకు ఒకసారి భక్తులంతా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించే పుణ్య కార్యక్రమమిది. కుంభరాశిలో ఈ ఉత్సవం జరుగుతుంది. అందుకే దీనిని కుంభమేళా అని పిలుస్తారు. ప్రతీమూడేళ్లకి ఒకసారి హరిద్వార్, ప్రయాగరాజ్, ఉజ్జయిని, నాసిక్‌లలో కుంభమేళా జరుగుతుంది. అంటే పన్నెండేళ్లకి ఒకసారి ఒక్కో పట్టణంలో నిర్వహించడానికి అవకాశం వస్తుంది. ఆరేళ్లకోసారి జరిగే వేడుకని అర్ధ కుంభమేళా అని, పన్నెండేళ్లకు ఒకసారి జరిగే ఉత్సవాన్ని పూర్ణ కుంభమేళా అని, 144 ఏళ్లకు ఒకసారి జరిగే వేడుకల్ని మహా కుంభమేళా అని పిలుస్తారు. సూర్యుడు, బృహస్పతుల గతుల ఆధారంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు.
మేషరాశిలో బృహస్పతి, మాఘమాసంలో మకరరాశిలోకి సూర్యుడు, చంద్రుడు ప్రవేశించినప్పుడు ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతుంది. ఇప్పుడు నిర్వహిస్తున్నది ఆరేళ్లకి ఒకసారి జరిగే అర్ధకుంభమేళా. కుంభమేళా జరిగే సమయంలో మకర సంక్రాంతి, మాఘ పుష్య పౌర్ణమి, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో గంగ, యమున, సరస్వతి సంగమించే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని, పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. సంక్రాంతి, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి వంటి కొన్ని ప్రత్యేకమైన దినాల్లోనే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు.
ఒక రాత్రి బసకే రూ. 40 వేలు
కుంభమేళా కోసం వచ్చే భక్తులు బస చేయడం కోసం ఇంద్రప్రస్థం, కల్పవృక్ష, కుంభ కాన్వాస్, వేదిక్ టెంట్‌సిటీ పేరుతో గుడారాలు నిర్మించారు. ఇంద్రప్రస్థం విల్లాలో ఒక రాత్రి బసకే రూ.40 వేలు వసూలు చేయనున్నారు. రెండు బెడ్‌రూమ్‌లు, ఒక లివింగ్ రూమ్, అటాచ్డ్ బాత్‌రూం సౌకర్యం ఉండే ఈ విల్లాల నుంచి గంగానది అందాలను వీక్షించవచ్చు. ఈ టెంట్ సిటీలో 200 లగ్జరీ టెంట్స్, 250 డీలక్స్ టెంట్స్ కూడా ఉన్నాయి. లగ్జరీ టెంట్స్‌లో ఒక రాత్రి బసకి రూ.16వేలు, డీలక్స్ టెంట్స్ రూ.12 వేలు వసూలు చేస్తారు. ఇక డార్మెటరీల్లో 650 రూపాయల నుంచి ఉన్నాయి.
అడుగడుగునా భద్రత
ప్రతీరోజూ లక్షల్లో భక్తులు వస్తారు కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 1,150 సీసీకెమెరాలు, 40 పోలీసు స్టేషన్లు, 62 పోలీసు పోస్టులు ఏర్పాటు చేశారు. 22,000– 24,000 మంది పారామిలటరీ జవాన్లు పహారా కాస్తారు.
11 తాత్కాలిక ఆసుపత్రులు
భక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా.. ఇబ్బందులు ఎదురుకాకుండా 11 తాత్కాలిక ఆసుపత్రులు నిర్మించారు. 100 పడకల ఆసుపత్రి, 30 పడకల ఆసుపత్రులు ఇందులో ఉన్నాయి. 170 మంది వైద్యులు, 100మంది నర్సులు సేవలందిస్తారు. 100 అంబులెన్స్‌లు, 4 ఎయిర్ అంబులెన్స్‌లు 24 గంటలు అందుబాటులో ఉంటాయి.
లాహిరి లాహిరిలో..
పర్యాటకరంగాన్ని ప్రోత్సహించేందుకు యోగి సర్కార్ ఈసారి కుంభమేళాలో ప్రత్యేకంగా పడవ ప్రయాణాన్ని ఏర్పాటు చేసింది. కాశీ నుంచి త్రివేణీ సంగమానికి భక్తులు పడవల్లోనే చేరుకోవచ్చు. గంగానదీ అందాలను ఆస్వాదిస్తూ 60 కిలోమీటర్ల దూరాన్ని గంటలోపే చేరుకోవచ్చు. ఇందుకోసం గంటకి 80 కిలోమీటర్ల వేగంతో నడిచే ఎయిర్‌బోట్లను ఏర్పాటు చేసింది. ఈ పడవల కోసం కాశీలో కాళీఘాట్, సరస్వతి ఘాట్, నైని బ్రిడ్జ్, సుజావన్ ఘాట్‌లను సిద్ధం చేసింది. సీఎల్ కస్తూర్బా, ఎస్‌ఎల్ కమ్లా అనే పెద్ద పడవలతో పాటు భక్తు ల రద్దీని బట్టి పలు చిన్న పడవలు రెండు పుణ్యక్షేత్రాల మధ్య తిరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment