
సాక్షి, బెంగళూరు: ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ యువతి మాజీ ఐఏఎస్(26) అధికారిని బెదిరిస్తోంది. తనను పెళ్లి చేసుకోకుంటే అంతు చూస్తానంటోంది. దీంతో దిక్కుతోచని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాలివి.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన డాక్టర్ రోమన్ సైని ఎంబీబీఎస్ చేసి, 2013లో 22 ఏళ్ల వయసులో యూపీఎస్‌సీ పరీక్షలు రాసి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఏడాది పాటు ఐఏఎస్ అధికారిగా పనిచేసి తరువాత ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ప్రస్తుతం బెంగళూరు ఇందిరానగర్‌లోని ఈశ్వర్ లేఔట్‌లో నివసిస్తున్నారు. ఇక్కడే కోరమంగళలో యూఎస్ అకాడమీ పేరుతో సివిల్స్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నారు. ఈయనకు గతేడాది అక్టోబర్ 24న ఫేస్‌బుక్‌లో చిత్ర గీతా అనే యువతి పరిచయమైంది. కొద్దిరోజుల పాటు స్నేహం కొనసాగింది. ఇటీవల ఆమె ‘నువ్వంటే నాకు ఇష్టం, నన్ను పెళ్లి చేసుకో’ అంటూ మెసేజ్ పంపింది. దీంతో ఇంకెప్పుడు తనకు అలాంటి మెసేజ్‌లు పంపవద్దని రోమన్ సైని జవాబిచ్చారు.
దీనిపై స్పందించిన చిత్ర గీతా అసభ్య పదజాలంతో మెసేజ్‌లు పంపింది. రోమన్ కలిసేందుకు కోరమంగళ్‌లోని కార్యాలయానికి వెళ్లగా, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. కోపంలో ఆ యువతి మీ ప్రాణాలు తీస్తానంటూ హెచ్చరించింది. తనను పెళ్లి చేసుకోవాలని, లేకుంటే నెలకు రూ.1.60 లక్షలు ఇవ్వాలని ఆ యువతి డిమాండ్ చేసింది. అలా కానీ పక్షంలో పెట్రోల్ పోసి చంపేస్తానని బెదిరిస్తోంది.
గత కొద్ది రోజులుగా ఈ వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో రోమన్ సైని మూడురోజుల కింద ఇందిరానగర్ పోలీస్ స్టేషన్‌లో చిత్రగీతాపై ఫిర్యాదు చేశారు. డీసీపీ అజయ్ హిలోరి మాట్లాడుతూ కేసు నమోదు చేసి సదరు యువతికి నోటీసులు కూడా పంపామని తెలిపారు.