సాక్షి, చెన్నై: లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. దీంతో చాలామంది వంటిట్లో దూరి కొత్తకొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నారు. చికెన్, మటన్, రొయ్యలు, చేపలు, నాన్‌వెజ్ బిర్యానీల పేర్లు ఇన్నాళ్లు విన్నాం. అయితే, కొందరు యువకులు ఏకంగా ఉడము బిర్యానీ తయారు చేసి అదరగొట్టారు. అంతే కాదు, టిక్ టాక్‌లో తమ కొత్త ప్రయత్నాన్ని వీడియో రూపంలో ఎక్కించి అడ్డంగా బుక్కయ్యారు. ప్రస్తుతం ఆ యువకులు తిరుచ్చి కేంద్ర కారాగారంలో ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి. తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలోని సోలయాం పట్టి గ్రామానిక చెందిన యువకులు లాక్‌డౌన్ పుణ్యమా ఏకం అయ్యారు.
ఎక్కడెక్కడ పనులు చేసుకుంటూ వచ్చిన మిత్రులు ఒక చోట చేరడంతో సందడి మొదలైంది. తమ గ్రామానికి కూత వేటు దూరంలో అడవులు ఉండడంతో ఈ మిత్ర బృందం బుధవారం బ్లాక్ మార్కెట్లో లభించిన మద్యం బాటిళ్లను తీసుకుని పరుగులు తీశారు. అడవుల్లోకి వెళ్తూ వంటా వార్పునకు కావాల్సిన వస్తువుల్ని పట్టుకెళ్లారు. మద్యానికి చిత్తైన ఈ బృందం తమకు కనిపించిన ఉడమును పట్టేశారు. దాన్ని కోసి పడేసి, శుభ్రం చేసి, బిర్యానీ తయారు చేసి ఆరగించారు. మద్యానికి చిత్తై మిత్రులు వేసిన చిందు, హంగామా అంతా ఇంతా కాదు.
ఇంత వరకు బాగానే వీరి పార్టీ సాగినా, ఉడుమ బిర్యానీ ప్రయోగాన్ని వీడియో చిత్రీకరించిన మిత్ర బృందంలోని ఒకరు ఇంటికి రాగానే టిక్‌టాక్‌లోకి అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారి చివరకు తిరుచ్చి అటవీ శాఖ అధికారుల కంట పడింది. ఇంకే ముంది పదుల సంఖ్యలో ఆ గ్రామంలోకి గురువారం వచ్చిన అటవీ అధికారులు ఆ మిత్ర బృందాన్ని తమ వలలో వేసుకున్నారు. ఏడుగురు తమ చేతికి చిక్కడంతో వారిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచి, తిరుచ్చి కేంద్ర కారాగారంలో ఊచలు లెక్కించేందుకు పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment