న్యూఢిల్లీ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో చొరవ తీసుకోవాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బృందం కోరింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఏపీ సర్కారు ఖూనీ చేస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు న్యూఢిల్లీలో చేపడుతున్న 'సేవ్ డెమొక్రసీ' కార్యక్రమంలో భాగంగా జైట్లీని బుధవారం మధ్యాహ్నం వైఎస్ జగన్ బృందం కలిసింది.
ఈ సందర్భంగా 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' పేరిట చంద్రబాబు అవినీతి మీద ప్రచురించిన పుస్తకాన్ని జగన్ స్వయంగా అరుణ్ జైట్లీకి అందించారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారాన్ని, బాబు అవినీతిని జైట్లీకి వివరించి, రాష్ట్రంలో సాగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించేలా చూడాలన్నారు.
అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో చొరవ తీసుకోవాలని, అలాగే రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్ట్ను వెంటనే పూర్తి చేయాలని కూడా అరుణ్ జైట్లీని జగన్ బృందం కోరింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నందున.. కేంద్రమే ముందడుగు వేయాలని ఆయన కోరారు.