వై.ఎస్.రాజశేఖరరెడ్డి వేర్పాటువాది కాదు: కేవీపీ రామచంద్రరావు
వై.ఎస్.రాజశేఖరరెడ్డి వేర్పాటువాది కాదు: కేవీపీ రామచంద్రరావు
Published Tue, Aug 13 2013 4:28 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
రాష్ట్ర విభ జనకు బీజం వేసింది దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డేనంటూ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ అగ్రనేతలు చేస్తున్న ఆరోపణలను సోమవారం రాజ్యసభలో అదే పార్టీకి చెందిన సీనియర్ నేత డాక్టర్ కె.వి.పి. రామచంద్రరావు తిప్పికొట్టారు. తెలంగాణ అంశంపై రాజ్యసభలో దాదాపు మూడు గంటలకు పైగా, పూర్తిస్థాయిలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. వైఎస్ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించారనే విమర్శను తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. చర్చలో పాల్గొన్న వివిధ పక్షాలకు చెందిన సభ్యుల వాదనలు అర్ధసత్యాలు, వక్రీకరణలతో కూడుకొని ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తెలుగు దేశం సభ్యులు చేసిన వ్యాఖ్యలు అనవసరమైనవే కాక అభ్యంతరకరమైనవని అంటూ కేవీపీ ఖండించారు. తెలంగాణ అంశానికి సంబంధించి తాను వెల్లడించబోయే వివరాలు తప్పని ఏ కమిటీ అయినా రుజువు చేస్తే.. సభ విధించే ఎలాంటి శిక్షకైనా తాను బద్ధుడనై ఉంటానంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఇంతకుముందు ఎన్నడూ, ఎక్కడా ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. 2001లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానంలో తెలంగాణపై రెండవ ఎస్సార్సీని నియమించాలని మాత్రమే పేర్కొన్నదని, 2004 ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఎన్నికల ప్రణాళిలో కూడా రెండవ ఎస్సార్సీని ఏర్పాటు చేస్తామనే హామీ ఇచ్చామని, ఎన్నికల పొత్తు సమయంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య కుదిరిన ఒప్పందంలో కూడా ఎస్సార్సీ ప్రస్తావనే ఉందని స్పష్టంచేశారు. 2009 ఎన్నికలకు ముందు రాష్ట్ర శాసనసభలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి తెలంగాణ డిమాండ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేకపోయినా సంబంధిత భాగస్వాములందరి అనుమానాలను, ఎదురయ్యే సమస్యలను పరిశీలించి తగిన పరిష్కారాలు కనుగొనాల్సి ఉందంటూ అప్పటి ఆర్థిక మంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య అధ్యక్షతన ఒక కమిటీని నియమించారని ఆయన వివరించారు.
ఆ తీర్మానం ఎప్పుడు జరిగిందో చెప్పండి..: రోశయ్య కమిటీ నియామకాన్ని ప్రకటించిన ప్రభుత్వ ఉత్తర్వును, ఆ తర్వాత విడుదలైన మరో జీవోలో పేర్కొన్న రోశయ్య కమిటీ పరిశీలనాంశాలను కేవీపీ సభలో చదివి వినిపించారు. వైఎస్ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించారనడం అర్ధ సత్యమని, ఇదంతా వక్రీకరణేనని అన్నారు. తెలంగాణపై రాష్ట్ర శాసనసభ ఇప్పటికే తీర్మానం చేసిందన్న కేంద్ర హోం మంత్రి ప్రకటనను కూడా తీవ్రంగా ఖండించిన కేవీపీ, ఆ తీర్మానం ఎప్పుడు జరిగిందో, అప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఎవరో, ముఖ్యమంత్రి ఎవరో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి కారణాలేమిటని కూడా ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పార్లమెంటుకు సమర్పించి దానిపై సమగ్ర చర్చను అనుమతించాలని కోరారు. దేశంలో మొత్తం చిన్న రాష్ట్రాల డిమాండ్లు ఎన్నున్నాయని ప్రశ్నించిన ఆయన వాటన్నింటి పరిశీలనకు రెండో ఎస్సార్సీ వేస్తారా అని అడిగారు. దేశ చరిత్రలో రాజధాని నగరంతో కూడిన ప్రాంతం ఎప్పుడైనా వేరు పడిందా? అసలు చరిత్రలో ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం అస్థిత్వంలో ఉండేదా అన్న విషయాలను కూడా వెల్లడించాలని ఆయన చిదంబరాన్ని డిమాండ్ చేశారు.
Advertisement