న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ విజయవంతమైందని ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలనే అమలు చేయాలని అడుగుతున్నామన్నారు. హోదాపై స్పష్టత వచ్చేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ లోపల ఒకమాట, బయట మరోమాట మాట్లాడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
వాగ్దానం చేశాక ఇంకా చర్చలెందుకు
లోక్ సభ స్పీకర్ అన్ని పార్టీలతో మాట్లాడారని, బీఏసీలో మాట్లాడాక ప్రత్యేక హోదాపై చర్చను పరిశీలిస్తామన్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. వాగ్దానం చేశాక ఇంకా చర్చలెందుకని తాము అడిగామన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి, మళ్లీ చర్చలంటున్నారని మేకపాటి ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని మేకపాటి సూచించారు.
రెండేళ్లు వేచి చూశాం..
ప్రత్యేక హోదా కోసం రెండేళ్లు వేచి చూశామని వైఎస్ఆర్ సీపీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. ఇక వేచి చూసే ప్రసక్తే లేదని, ఏపీకి ద్రోహం చేస్తే ఊరుకునేది లేదని ఆయన అన్నారు. ఐదేళ్లలో రెండేళ్లు గడిచిపోయాయని, హామీలను ఎప్పుడు అమలు చేస్తారని వరప్రసాద్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చేవరకూ వైఎస్ఆర్ సీపీ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.
ప్రధాని హామీకి విలువ లేకపోతే ఎలా?
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని వైఎస్ఆర్ సీపీ ఎంపీ బుట్టా రేణుక డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీ కాదని, హోదానే కావాలన్నారు. ప్రధాని హామీకి విలువ లేకపోతే ఎలా అని ఆమె ప్రశ్నించారు.
'మేమేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదు'
Published Tue, Aug 2 2016 3:24 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement