
హోదాపై నా ప్రైవేటు బిల్లు వచ్చేలా చూడండి
స్పీకర్‌కు వైవీ సుబ్బారెడ్డి లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న తన ప్రైవేటు మెంబరు బిల్లు ఈ సెషన్‌లోనే వచ్చేలా చూడాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు మంగళవారం విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఒక లేఖ అందజేశారు. ‘చాలా బాధ, అసంతృప్తితో నేను ఈ విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2016 శీర్షికతో ఉన్న నా ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టేందుకు గతేడాది జూలై నుంచి ప్రయత్నిస్తున్నాను. ఈ బిల్లు గత ఏడాది జూలై 27, నవంబర్ 18, డిసెంబర్ 16, ఈ ఏడాది ఫిబ్రవరి 3 తేదీల్లో లోక్‌సభ బిజినెస్ జాబితాలో చోటు చేసుకున్న ప్పటికీ.. ప్రతీ సందర్భంలో అటు కాంగ్రెస్ గానీ, ఇటు అధికార పక్షం గానీ గందరగోళం సృష్టిస్తుండడం తో సభ వాయిదా పడుతూ వచ్చింది.
నా బిల్లు లిస్టయిన సందర్భం లోనే ఇలా జరుగుతూ వచ్చింది. ఇందులో ఏదో మతలబు ఉందని నాకు అర్థమైంది. ఈ నేపథ్యంలో మీరు మీ అధికారాన్ని ఉపయోగించి ఈ సమావేశాల్లోనే ప్రైవేటు మెంబర్ బిజినెస్ లేని రోజైనా సరే ఈ బిల్లును నేను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఇవ్వగలరు. అంతేకాకుండా 64వ నిబంధన ద్వారా ఈ బిల్లును గెజిట్‌లో ప్రచురించేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు.