తీవ్రవాదులుగా మారాలి అన్నందుకే...
న్యూఢిల్లీ: జకీర్ నాయక్ స్థాపించిన ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్(ఐఆర్ఎఫ్)పై నిషేధం ఎందుకు విధించాల్సి వచ్చిందో కేంద్ర హోంశాఖ వివరణయిచ్చింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసినందుకు ఆయన సంస్థపై నిషేధం విధించినట్టు వెల్లడించింది. ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ ను స్తుతించడం, ప్రతి ముస్లిం తీవ్రవాదిగా మారాలని జకీర్ నాయక్ తన ప్రసంగాల ద్వారా రెచ్చగొట్టారని తెలిపింది. మతం పేరుతో విద్వేషాలు సృష్టించాలని తన అనుయాయులు, మద్దతుదారులను ఉసిగొల్పారని హోంశాఖ ప్రకటించింది.
వివిధ మతాలు, వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా ప్రసంగాలు చేశారని ఆరోపించింది. మత సామరస్యాన్ని దెబ్బతీశారని...ఆత్మహుతి దాడులను సమర్థించారని, హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని గురువారం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో హోంశాఖ పేర్కొంది. ఐఆర్ఎఫ్ ను చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించింది. జకీర్ నాయక్ అత్యంత విద్వేషపూరిత వ్యక్తిగా పేర్కొంది. ఐదేళ్ల పాటు ఐఆర్ఎఫ్ పై నిషేధం విధిస్తూ కేంద్రం ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.