సాక్షిప్రతినిధి,నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి నియామకంపై ఆ పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగేసింది. డీసీసీ అధ్యక్షునిగా తాహెర్‌బిన్ హందాన్‌నే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది జిల్లాల అధ్యక్షులను ప్రకటించిన ఆ పార్టీ అధిష్టానం నిజామాబాద్ జిల్లా పార్టీ పగ్గాలను తాహెర్‌కే అప్పగించింది. ఈ పదవి విషయంలో జిల్లాలోని పార్టీ అగ్రనేతల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో దాదాపు ఏడాది కాలంగా తర్జనభర్జన కొనసాగింది. మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులుగా తాహెర్‌ను కొనసాగించాలని పట్టుబట్టగా., శాసన మండలి పక్ష నేత షబ్బీర్ అలీ కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కైలాస్ శ్రీనివాస్‌ను తెరపైకి తెచ్చారు. జిల్లా విభజన నేపథ్యంలో ఈ పదవిని కామారెడ్డి జిల్లాకు కేటాయించాలని అధిష్టానాన్ని కోరారు.
మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి మార చంద్రమోహన్ పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. గతంలో డీసీసీ అధ్యక్షునిగా దశాబ్ద కాలం పాటు పనిచేసిన గడుగు గంగాధర్ కూడా తన పేరును పరిశీలించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. మరోవైపు మాజీ ఎంపీ, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కిగౌడ్ ద్వారా నరాల రత్నాకర్ ఈ పదవి కోసం ప్రయత్నాలు చేశారు. తాహెర్ స్థానంలో మరొకరిని నియమిస్తే మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన తనకు అవకాశం ఇవ్వాలని బోధన్‌కు చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాషా కోరినట్లు తెలిసింది. బాల్కొండ నియోజకవర్గం నుంచి మానాల మోహన్‌రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. మరోవైపు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌధాగర్ గంగారాం, మాచారెడ్డికి చెందిన నర్సింగ్‌రావు కూడా ఈ పదవిని ఆశించారు. ఇలా ఈ పదవి కోసం పార్టీలో తీవ్ర పోటీ ఏర్పడగా ఎవరికి వారే ఈ పదవి కోసం ప్రయత్నాలు చేసుకున్నారు.
గ్రూపుల నేపథ్యంలో..
ఆధిపత్యపోరు, గ్రూపు తగాదాలకు నిలయంగా మారిన జిల్లా కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవి విషయంలో ఏడాది కాలంగా ఏకాభిప్రాయం కుదరలేదని పార్టీ వర్గాలు చెప్పుకున్నాయి. ఎన్నికల సంవత్సరం కావడంతో ఎంతో కీలకమైన ఈ పదవిలో తన అనుచరుణ్ణి నియమించుకునేందుకు పార్టీ జిల్లా అగ్రనేతలు ఎవరికి వారే పావులు కదిపారు. ఈ మేరకు టీపీసీసీ ముఖ్యనాయకత్వంపై ఒత్తిడి పెంచారు. ఈ పరిస్థితుల్లో తాహెర్‌ను మార్చి.. కొత్త వారికి అవకాశం ఇస్తే అనవసరమైన తలనొప్పులు వస్తాయనే ఉద్దేశంతో అధిష్టానం తాహెర్‌ను కొనసాగించిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. దీనికి తోడు మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన తాహెర్ స్థానంలో మరో మైనారిటీ నేతను నియమించాల్సి ఉంటుంది. ఈ సమీకరణలు కుదరకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. దీనికి తోడు ఎన్నికల సంవత్సరం కావడంతో అధ్యక్ష స్థానాన్ని మార్చడం అంత మంచిది కాదని భావించిన అధిష్టానం అధిష్టానం తాహెర్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఉమ్మడి జిల్లాగానే..
జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉమ్మడి జిల్లాగానే జిల్లా కాంగ్రెస్ కమిటీ నియామకం చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం కొత్త జిల్లాల వారీగా కాకుండా, ఉమ్మడి జిల్లాగానే డీసీసీని ఏర్పాటు చేసింది. డీసీసీ అధ్యక్షుల జాబితాను ఎన్నికల కమిషన్‌కు సమర్పించాల్సి ఉండటంతో ఉన్నఫలంగా ఈ జాబితాను ప్రకటించిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీ కూడా కొత్త జిల్లాలకు అధ్యక్షులను ఇంకా నియమించలేదు.
Comments
Please login to add a commentAdd a comment