సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజాచైతన్య బస్సుయాత్ర జిల్లాలో ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. తొలిరోజు బోధన్, నిజామాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలకు మంచి స్పందన లభించింది. ఈ సభలను విజయవంతం చేసేందుకు ఆయా నియోజకవర్గాల నాయకులు జనాలను తరలించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర, జిల్లా ముఖ్య నేతలు మధ్యాహ్నం మూడు గంటలకు నేరుగా బోధన్‌కు వెళ్లారు. అక్కడ బహిరంగ సభను ముగించుకున్న అనంతరం సాయంత్రం నిజామాబాద్ నగరంలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు.
ఈ రెండు సభల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఇతర నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. మరోవైపు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. బోధన్ నిజాం చక్కెర కర్మాగారం పునఃప్రారంభం వంటి స్థానిక అంశాలను కూడా ప్రస్తావించారు. బహిరంగ సభలు నిర్వహించిన బోధన్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లో ముస్లింలు ఎక్కువగా ఉండటంతో మైనారిటీల సంక్షేమం అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు, మైనారిటీ సంక్షేమం కోసం బడ్జెట్ కేటాయింపులు వంటి అంశాలను ప్రస్తావించారు. ఈ రెండు చోట్ల ఉర్దూలో ప్రసంగించే ప్రయత్నం చేశారు. నిజామాబాద్ సీఎస్‌ఐ గ్రౌండ్‌లో నిర్వహించిన సభకు అర్బన్‌తో పాటు, రూరల్ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయగా, బోధన్ సభకు ఆ ప్రాంతం నుంచి రైతులు, పార్టీ శ్రేణులను తరలించారు.
బైక్‌లపై సభకు..
బోధన్ సభను ముగించుకుని వస్తుండగా నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో రాష్ట్ర నాయకులు బస్సు దిగి ద్విచక్ర వాహనాలపై నిజామాబాద్ సభా స్థలానికి చేరుకున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రసంగం ముగిసిన వెంటనే సన్మానాల కోసం నాయకులు పోటీ పడటంతో వేదికపై గందరగోళం, స్వల్ప తోపులాట జరిగింది. దీంతో మాజీ ఎంపీలు వీహెచ్, మధుయాష్కి గౌడ్, మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి మధ్యలోనే సభాస్థలి నుంచి వెళ్లి పోయారు. డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బీన్ హందాన్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి, నేతలు మహేశ్‌కుమార్ గౌడ్, గడుగు గంగాధర్, అరుణతార, కాసుల బాల్‌రాజ్, అరికెల నర్సారెడ్డి, నరాల రత్నాకర్, కె.నగేశ్‌రెడ్డి, ముప్ప గంగారెడ్డి, సౌదాగర్ గంగారాం, రాజారాం యాదవ్, కేశ వేణు తదితరులు పాల్గొన్నారు.
పంట రుణాలు, మద్దతు ధరపై ప్రకటన..
రెండో రోజు సోమవారం ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్మూర్, నందిపేట్, మాక్లూర్ మండలాల నుంచి పార్టీ శ్రేణులు, రైతులను తరలిస్తున్నారు. ఈ సభలో రైతుల ఉత్పత్తులకు మద్దతు ధర నిర్ణయం, రైతులకు పంట రుణాలకు సంబంధించి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వంటి అంశాలపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక ప్రకటన చేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నందిపేట్ బహిరంగ సభ అనంతరం బస్సుయాత్ర బాల్కొండ నియోజకవర్గంలో ప్రవేశించనుంది. భీమ్‌గల్‌లో బహిరంగ సభ ముగిసిన తర్వాత ఎస్సారెస్పీ అతిథి గృహంలో పీసీసీ నేతలు బస చేయనున్నారు. అనంతరం ఈ బస్సుయాత్ర మంగళవారం నిర్మల్ జిల్లాలో ప్రవేశించనుంది.
విజయం ఖాయం: ఎమ్మెల్సీ లలిత
నిజామాబాద్ సిటీ(నిజామాబాద్‌అర్బన్): అన్ని వర్గాల సంక్షేమం పని చేసేది కాంగ్రెస్ పార్టీయేనని, వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యమని ఎమ్మెల్సీ ఆకుల లలిత పేర్కొన్నారు. తమ హయాంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం పథకాలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని, వడ్డీ రద్దు చేసిన చరిత్ర కాంగ్రెస్‌దేనని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 9 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తామన్నారు.
కుటుంబ పాలనపై ముందే చెప్పాం: దానం
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. సమాఖ్య రాష్ట్రంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి చూసి, అమరుల త్యాగాలతో చలించి పోయిన సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడానికి సిద్ధపడితే తాను, మధుయాష్కీ ఇవ్వ వద్దని చెప్పామన్నారు. తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబ పాలన వస్తుందని చెప్పామని, ఇప్పుడదే జరుగుతోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment