
హూస్టన్: హరికేన్ హార్వీ బాధితుల సహాయార్థం ఓ భారతీయ అమెరికన్ జంట రూ. 1.6 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. హరికేన్ హార్వీ రిలీఫ్ పేరిట ఆదివారం హూస్టన్‌లో జరిగిన కార్యక్రమంలో గ్రేటర్ హూస్టన్ కమ్యూనిటీ ఫౌండేషన్ తరఫున అమిత్ భండారీ, అర్పితా భండారీలు విరాళాన్ని హూస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా టర్నర్ మాట్లాడుతూ హార్వీ తుపాను బాధితులను ఆదుకోవటానికి భారతీయ అమెరికన్‌లు ముందుకు రావటం ఆనందంగా ఉందన్నారు. హూస్టన్ నగరాభివృద్ధికి భారతీయులు ఎంతో కృషి చేశారని తెలిపారు. భవిష్యత్తులో వచ్చే తుపానులను మరింత సమర్ధవంతగా ఎదుర్కొనేలా నగరాన్ని తిరిగి పునర్‌నిర్మిస్తామని వెల్లడించారు.
గ్రేటర్ హూస్టన్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా 700 మందిని రక్షించామని అమిత్ భండారీ తెలిపారు. హార్వీ బాధితులకు సహాయం అందించే వివిధ చారిటీలకు ఫౌండేషన్ ద్వారా సుమారు రూ.9.7కోట్లు సమకూర్చామన్నారు. బయోఉర్జా గ్రూప్‌కు అమిత్ వ్యవస్థాపకుడిగా, సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఈనెల ప్రారంభంలో అమెరికాను వణికించిన హార్వీ ధాటికి 70 మంది మరణించగా, 30 వేలమంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే