► మరొకరి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: హార్వీ తుఫాన్‌లో చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ విద్యార్థి నిఖిల్ భాటియా బుధవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే అమెరికా టెక్సాస్‌లోని ఏ అండ్ ఎం విశ్వ విద్యాలయంలో చదువుతున్న నిఖిల్ భాటియా, షాలిని సింగ్‌లు గత శనివారం ఈత కొట్టేందుకు బ్య్రాన్ సరస్సుకు వెళ్లారు. అయితే హార్వీ హారికేన్ ముంచెత్తడంతో ఇద్దరూ మునిగిపోయి దాదాపు ప్రాణాపాయ స్థితిలో ఉండగా సహాయక సిబ్బంది కాపాడి ఆసుపత్రికి తరలించారు.
గత నాలుగు రోజులుగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పరిస్థతి విషమించి నిఖిల్ భాటియా బుధవారం మృతి చెందగా, షాలినీ ఆరోగ్య పరిస్థతి విషమంగానే కొనసాగుతోంది. కాన్సులేట్ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు వారి కుటుంబ సభ్యులకు చేరవేస్తున్నారు. నిఖిల్ భాటియా స్వస్థలం రాజస్థాన్‌లోని జైపూర్. షాలిని సింగ్ ఢిల్లీ నివాసి వీరిద్దరూ ఏ అండ్ ఎం యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేస్తున్నారు.
మరోవైపు హూస్టన్ చుట్టుపక్కల నివసిస్తున్న దాదాపు లక్ష మంది భారతీయ అమెరికన్లపై కూడా తుపాను ప్రభావం భారీగా ఉంది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించా రు. 200 మందికిపైగా భారతీయ విద్యార్థులు ఇళ్లలో చిక్కుకుపోగా వారికి భారత కాన్సులేట్ సహాయం అందిస్తోంది. భారతీయుల సహాయార్థం ఓ హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా హూస్టన్‌లోని భారత కాన్సుల్ జనరల్ అనుపమ్ రే ట్వీటర్‌లో పోస్ట్ చేశారు.