
హ్యూస్టన్ : అమెరికన్ తెలంగాణ అసోషియేషన్ (ఆటా) నిర్వహిస్తున్న ప్రపంచ తెలంగాణ ద్వితీయ మహాసభలు హ్యూస్టన్ లోని జార్జ్ బ్రౌన్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ప్రారంభమయ్యాయి. వేడుకలను తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. దీపారాధన, గణపతి ప్రార్థన, తెలంగాణ పాటలు, కూచిపూడి భరత నాట్యం లాంటి భారతీయ నృత్యాలతో వేడుకలు శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. సామాజిక పలకరింపులు, అలాయి బలాయిలు జరిగాయి. సంస్థ అధ్యక్షులు సత్యనారాయణ కందిమళ్ల, నిర్వహణ కార్యదర్శి బంగారు రెడ్డి, ఛైర్మన్ కరుణాకర్ మాధవరం, ప్రెసిడెంట్ ఎలెక్ట్ వినోద్ కుకునూర్, సహాయ సమన్వయ కర్త జగపతి వీరేటి, వివిధ కమిటీల ప్రతినిధులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
తెలంగాణ నుంచి ప్రత్యేక విశిష్ట అతిథులుగా ఎంపీ జితేందర్ రెడ్డి, సాంస్కృతిక రాయబారి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, టీటీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, బీజేపీ రాష్ట్ర నాయకులు కృష్ణప్రసాద్‌లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా18 దేశాల నుంచి అనుబంధ సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వాణిజ్య వ్యాపార వేత్తలు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, గాయకులూ, కళాకారులూ, మీడియా ప్రతినిధులు కార్యక్రమానికి విచ్చేశారు.
పలు రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రముఖులను వేడుకల్లో అవార్డులతో సత్కరించారు. కమ్యూనిటీ సర్వీస్‌లో శ్రీధర్ కాంచనచర్ల, రామచంద్రారెడ్డి, జీవిత సాఫల్య అవార్డు డాక్టర్ పద్మజారెడ్డి, డాక్టర్ రత్నకుమారి, చేనేత రంగంలో గజం అంజయ్య అందుకున్నారు. తెలంగాణ ఆర్టిస్టులతో రూపొందించిన చార్మినార్, దాని చుట్టూ పాతబస్తీని తలపించేలా వాణిజ్య అంగళ్లు, హైదరాబాదీ వంటకాలతో తొలి రోజు సంబరంగా జరిగింది. తెలంగాణ, తెలుగు కళలు ఉట్టిపడేలా సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు.
Comments
Please login to add a commentAdd a comment