
అబుదాబి : అబుదాబిలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ పాటలు, పిల్లల కోలాటం, డప్పుల చప్పుళ్లతో అబుదాబి ఇండియా సోషల్ సెంటర్ శుక్రవారం భక్తి భావంతో పులకించిపోయింది. తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ ఆటా పాటలతో హోరెత్తించారు. గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న ప్రజలంతా ఒక్కచోట బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.
అబుదాబి తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో ప్రముఖ కళాకారులు కోకిల నాగరాజు, గాయని వరంలు తమ ఆటా, పాటలతో ఉర్రూతలూగించారు. ఉత్తమ బతుకమ్మలు పదింటికి ఈ సందర్భంగా బహుమతులతో సత్కరించారు. చక్కటి నృత్య ప్రదర్శనలతో మహిళలు, పిల్లలు ఆకట్టుకున్నారు. దుబాయి, అబుదాబి వివిధ క్యాంప్‌ల నుండి అధిక సంఖ్యలో తెలంగాణ, తెలుగు వారు వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శన చేసిన దంపతులకు, పిల్లలకు, మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు రాజశ్రీనివాస రావు, పృథ్వీరాజ్, గోపాల్, వంశీ, గంగన్న, రాజశేఖర్, మహిళ కమిటీ సభ్యులు పావని, సౌజన్య, లక్ష్మీ, రోజా, అర్చన, పద్మజలు పాల్గొని విజయవంతం చేశారు.

