
ఆక్లాండ్: న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్( టాంజ్) ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. మహిళలు తమ ఇళ్లలో బతుకమ్మలు పేర్చుకొని రావడమే కాకుండా అందరూ కలిసి ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా టాంజ్ బతుకమ్మను పేర్చారు. ఆడవారంతా బతుకమ్మల ఆడుతూంటే మగవారు చుట్టూ చేరి దాండియా ఆడారు. చిన్నారులు బతుకమ్మ పాటలతో ఆక్లాండ్ నగరం మార్మోగింది. చిన్నారి అతిర ఎర్రబెల్లి పాడిన ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ’. పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహాకులు పాటలు పాడిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారందరూ తెలంగాణ వంటకాలతో భోజనాలు చేశారు.
ఈ సందర్భంగా టాంజ్ అధ్యక్షుడు శ్రీ కళ్యాణ్ కాసుగంటి మాట్లాడుతూ.. మన రాష్ట్ర పండగైన బంగారు బతుకమ్మను తెలంగాణ బిడ్డలందరం కలిసి న్యూజిలాండ్ లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. టాంజ్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి ఉమా సల్వాజి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నమైన మన బతుకమ్మఆట శారీరక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడటమే కాక, బతుకమ్మ పాటలు చారిత్రక, సాంఘిక మరియు మానసిక ఆధ్యాత్మిక వికాసలతోపాటు విలువలను పెంపొందిస్తాయని తెలిపారు. బతుకమ్మ ఉత్సవాలకు సహకరించిన దాతలకు, బతుకమ్మలు పేర్చుకొచ్చిన మహిళలకు ఆమె, ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టాంజ్ వైస్‌ప్రెసిడెంట్ శ్రీ రాం మోహన్ దంతాల, జనరల్ సెక్రటరీ శ్రీ సురేందర్ అడవల్లి లతోపాటు ఇతర టాంజ్ సభ్యులు,న్యూజిలాండ్ లోని తెలంగాణ వారే కాకుండా ఇతర ప్రాంతాలవారు, న్యూజిలాండ్ ఇండియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ బీకు బానా, జనరల్ సెక్రెటరి శ్రీ ప్రకాశ్ బిరాదర్, న్యూజిలాండ్ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి అరుణజ్యోతి, ముద్దం,టి.ఆర్.ఎస్ న్యూజిలాండ్ అధ్యక్షుడు శ్రీ విజయ్ కోస్న, న్యూజిలాండ్ తెరాస మరియు జాగృతి సభ్యులు పాల్గొన్నారు.





