చిత్రంలో న్యాయవాది రచనారెడ్డి, ప్రవాసీ కార్మిక సంఘాల ప్రతినిధులు, విద్యావేత్తలు
హైదరాబాద్: విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రిటైర్డ్ అంబాసిడర్ డాక్టర్ బి.ఎం. వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎమిగ్రేషన్ (విదేశీ వలసల) ముసాయిదా బిల్లు – 2019 పై ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరిన నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. విదేశీ వలసలకు సంబందించి నూతన చట్టం తీసుకువచ్చే ప్రయత్నం హర్షణీయమన్నారు. 35 ఏళ్ల క్రితం భారతదేశం నుంచి కార్మికులు పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న సందర్భంలో ఎమిగ్రేషన్ యాక్ట్ – 1983 విదేశీ వలసల చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చారని, సమకాలీన వలసల పోకడల సమస్యలను పరిష్కరించేందుకు ఈ చట్టానికి కొన్ని అంతర్గత పరిమితులను చేర్చారని అన్నారు. అప్పటికాలానికి అనుగుణంగా పరిమిత వనరుల ప్రకారం ఎమిగ్రేషన్ యాక్ట్ 1983 పనిచేసిందని అన్నారు.
వలస కార్మికుల రక్షణ, సంక్షేమ కార్యక్రమాలు ఆశించిన మేరకు అమలు చేయకపోవటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. నేటి పరిస్థితులకు అనుగుణంగా, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని నూతన ముసాయిదా బిల్లును తీసుకురావలనుకోవటం మంచి పరిణామమని ఆయన చెప్పారు. గల్ఫ్ దేశాల్లో రాయబార కార్యాలయాల్లో తెలుగు తెలిసిన అధికారులను నియమించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విదేశీ రాయబార కార్యాలయాల్లో సరైన సిబ్బంది, నిధులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని సమకూర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ఎంబసీలను పటిష్టం చేçసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, కార్మికుల సంక్షేమానికి బడ్జెట్ పెంచాలని కోరారు.
కార్మికుల రక్షణ, సంక్షేమం ప్రభుత్వ బాధ్యత
హైకోర్టు న్యాయవాది రచనారెడ్డి మాట్లాడుతూ.. విదేశాలకు వలస వెళ్తున్న కార్మికుల రక్షణ, సంక్షేమాన్ని భారత ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని నియామకాలు ఎమిగ్రేషన్ మేనేజ్‌మెంట్ అథారిటీ ద్వారానే జరగాలని, లైసెన్స్‌లేని ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. నేపాల్, శ్రీలంక తరహాలో కార్మికుల్లో నైపుణ్యత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, కార్మికుల నైపుణ్యతకు తగినట్లుగా నియామకాలు జరగాలన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి మాట్లాడుతూ.. నూతనంగా తీసుకువచ్చే ముసాయిదా బిల్లులో వలస కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకునేందుకు పటిష్టమైన నిబంధనలు రూపొందించాలని కోరారు. కొత్త బిల్లు గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టిని పెట్టాల్సిన అవసరముందన్నారు. మైగ్రంట్స్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు నరసింహనాయుడు మాట్లాడుతూ..
విదేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులతో పాటు ఉద్యోగం కోసం వెళ్లే భారతీయులందరు తమ వివరాలను ఎంబసీలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలన్నారు. రిక్రూటింగ్ ఏజెన్సీలు, ఎడ్యుకేషన్ కాన్సల్టెన్సీలు తప్ప నిసరిగా లైసెన్స్‌లు తీసుకోవాలన్నారు. ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సురేంద్రనాథ్ మాట్లాడుతూ.. మానవ అక్రమ రవాణా, చట్టవిరుద్ధమైన రిక్రూట్‌మెంట్, మత్తు మందుల రవాణా, నేరస్తులకు అశ్రయం ఇవ్వటం, మహిళలు, పిల్లలను ఇబ్బందులు పెట్టడం లాంటి విషయాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆస్ట్రేలియా ఎన్నారై ఆదిరెడ్డి యార మాట్లాడుతూ విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల పట్ల భారత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఆస్ట్రేలియాకు కొత్తగా వచ్చిన భారతీయ విద్యార్థులకు తమ సంఘాలు సహాయకారిగా ఉంటున్నాయని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో కార్మిక శాఖ రిటైర్డ్ అధికారి మహ్మద్ ఇబ్రహీంఖాన్, సిస్టర్ లిస్సీజోసెఫ్, మురళిధర్ దేశ్‌పాండే, ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, స్వదేశ్ పరికిపండ్ల, చాంద్‌పాషా, గొడ్డేటి గంగయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment