
ఫ్లోరిడా : అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలతో దూసుకువెళ్తున్నఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్).. తాజాగా టెంపాలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించింది. స్థానికంగా ఉండే తెలుగువారు ఈ సదస్సుకు హాజరై విలువైన అంశాలు తెలుసుకున్నారు. ఆరోగ్యంగా పదికాలాల పాటు ఎలా ఉండాలనే దానిపై స్థానిక ప్రముఖ వైద్యులు ఎన్నో విలువైన సూచనలు చేశారు. గుండె వైద్య నిపుణులు డాక్టర్ నరేంద్ర శాస్త్రి గుండెను పదిలంగా ఉంచుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో సూచించారు.
తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ లాంటి వ్యాధులను ఆదిలోనే గుర్తించవచ్చని డాక్టర్ అనిత కొల్లి తెలిపారు. ముఖ్యంగా మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన పెంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డాక్టర్ నవీన వింధ్య చిన్న పిల్లల ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. నాట్స్ టెంపా బే చాప్టర్ కో ఆర్డినేటర్ రాజేష్ కుండ్రు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ ఆరోగ్య అవగాహన సదస్సును నాట్స్ వాలంటీర్లు సహాయ సహాకారాలు అందించి విజయవంతం చేశారు. నాట్స్ బోర్డు సభ్యులు ప్రశాంత్ పిన్నమ్మనేని, బోర్డు చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. నాట్స్ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ సదస్సు నిర్వహణకు కీలక పాత్ర పోషించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment