టెక్సాస్ : పుల్వామా ఘటనలో 40 మంది జవాన్లు వీర మరణం పొందడం దేశాన్ని కుదిపేసింది. అమరులైన జవాన్లకు జాతి మొత్తం నివాళులు అర్పించింది. డల్లాస్‌లోని ఎన్నారైలు చనిపోయిన సైనికులకు శ్రద్దాంజలిని ఘటించారు. మహాత్మా గాంధీ మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇర్వింగ్ లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద శనివారం ఫిబ్రవరి 16న ఏర్పాటు చేసిన ‘అమరవీరుల శ్రద్ధాంజలి’ కార్యక్రమం లో వందలాది మంది ప్రవాస భారతీయులు వీర జవాన్లకు పుష్పాంజలి ఘటించారు.
మహాత్మా గాంధీ మెమోరియల్ ఛైర్మన్ డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఫిబ్రవరి 14 భారత దేశ చరిత్రలో ఒక చీకటి రోజని భారత దేశ రక్షణ కోసం తమ జీవితాలని అంకితం చేసిన వీర జవాన్ల పై దొంగచాటుగా దాడి చేసి వారి ప్రాణాలను బలిగొనడం ఒక అనాగరిక పిరికిపంద చర్య అని తీవ్రంగా ఖండించారు. దాడిలో మరణించిన కుటుంబాలకు తమ ప్రగాడ సంతాపాన్ని తెలియజేస్తూ, గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దాడి జరిగిన వెంటనే అమెరికాలో ఉన్న భారత సంతతికి చెందిన అమెరికా రాజకీయ నాయకులకు మరియు స్థానిక కాంగ్రెస్ మెంబెర్స్ కు, సెనెటర్స్ కు దాడి వివరాలను ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ సలహామండలి సభ్యుడు అరుణ్ అగర్వాల్ మరియు ప్రసాద్ తోటకూర తెలియజేయగా దాదాపుగా 50 మంది అమెరికా రాజకీయ నాయకులు ఈ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించి తమ సంతాపం తెలియజేస్తూ, ఈ ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పని చేసి అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ దాడిలో మరణించిన అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిముషాలు మౌనం పాటించి, కొవ్వత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంజిఎంఎన్ టి బోర్డు సభ్యులు రావు కల్వల, బి.ఎన్ రావు, జాన్ హమొండ్, అక్రం సయ్యద్, కమల్ కౌషల్, కమ్యూనిటీ లీడర్స్ జాక్ గద్వాని, షబ్నం మొద్గిల్, స్వాతి షా, ముజ్బర్ రెహమాన్, తన్వీర్ అర్ఫీ, బెనజీర్, హరి పాత్రో, అరుణ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment