ఒమాన్‌ ప్రభుత్వం షాక్‌.. ఉద్యోగాలకు కోత | Oman Government Shock to Migrant Workers | Sakshi
Sakshi News home page

బల్దియాలో ఉద్యోగాలకు కోత

Published Fri, Feb 14 2020 12:58 PM | Last Updated on Fri, Feb 14 2020 12:58 PM

Oman Government Shock to Migrant Workers - Sakshi

ఎన్‌.చంద్రశేఖర్,మోర్తాడ్‌(నిజామాబాద్‌ జిల్లా): బల్దియా(మున్సిపాలిటీ)ల్లో పనిచేస్తున్న విదేశీ కార్మికులకు ఒమాన్‌ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. నేరుగా నియమించుకున్న కార్మికులను క్రమంగా తొలగిస్తోంది. వేలాది మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. తెలంగాణకు చెందిన అనేక మంది కార్మికులు ఇప్పటికే ఇళ్లకు చేరుకోగా.. దశల వారీగా ఈ ఏడాది చివరి వరకు మరికొందరు ఇంటిముఖం పట్టనున్నారు. బల్దియా ఆధ్వర్యంలో చేపట్టే పనులను కాంట్రాక్టు కంపెనీలకు అప్పగించాలని ఒమాన్‌ ప్రభుత్వం మూడేళ్ల కిందనే నిర్ణయించింది. ఇటీవల ఒమాన్‌ రాజు ఖబూస్‌ బిన్‌ అల్‌ సయీద్‌ అనారోగ్యంతో మరణించడంతో ఆయన స్థానంలో హైతమ్‌ బిన్‌ తారిఖ్‌ అల్‌ సయీద్‌ బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం బల్దియా ప్రైవేటీకరణకు అడుగులు వేగంగా పడుతున్నాయి. బల్దియా పనులను కాంట్రాక్టు ఏజెన్సీలకు ప్రభుత్వం అప్పగించగా.. ఆ ఏజెన్సీలు తక్కువ వేతనంపై పనిచేసేవారిని నియమించుకుంటున్నాయి.

బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక తదితర దేశాలకు చెందిన కార్మికులు తక్కువ వేతనానికి పని చేసేందుకు ముందుకు రావడంతో వారినే పనుల్లోకి తీసుకుంటున్నారు. బల్దియాలో ఇది వరకు పనిచేసిన మన కార్మికులు కాంట్రాక్టు ఏజెన్సీలను ఆశ్రయిస్తే.. తాము ఇచ్చే వేతనానికి అంగీకరిస్తేనే పనిలో చేర్చుకుంటామని చెబుతున్నారు. కాంట్రాక్టు ఏజెన్సీల కింద పనిచేస్తే శ్రమ దోపిడీకి గురికావాల్సి వస్తుందని కార్మికులు వాపోతున్నారు. ఒమాన్‌ దేశంలోని వివిధ మున్సిపాలిటీల్లో పని చేసే విదేశీ కార్మికుల్లో 60 శాతం మంది కార్మికులు తెలంగాణ జిల్లాలకు చెందిన వారు ఉండటం విశేషం. బల్దియాల ప్రైవేటీకరణతో తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులకే ఎక్కువగా నష్టం వాటిల్లుతుంది. ఒమాన్‌లో ఉపాధి పొందుతున్న తెలంగాణ వలస కార్మికుల సంఖ్య దాదాపు లక్షకు మించి ఉంటుందని అంచనా. ఇందులో బల్దియాల్లో పని చేసే కార్మికులు వేలల్లో ఉన్నారు. ఇప్పుడు వారి ఉద్యోగాలకు ముప్పు ఏర్పడింది. ఒమాన్‌ బల్దియాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటం.. వేతనం కూడా ఆశించిన విధంగా ఉండటంతో మన రాష్ట్రానికి చెందిన ఎంతో మంది ఈ ఉద్యోగాలను దక్కించుకోవడానికి పోటీపడ్డారు. సుమారు 40 ఏళ్ల నుంచి బల్దియా ఉద్యోగాలకు వలసలు కొనసాగుతున్నాయి.

కార్మికులు చేసే పనులు ఇవే...
మస్కట్‌తో పాటు ఇతర పట్టణాల్లోని మున్సిపాలిటీల్లో మన కార్మికులు గార్డెనింగ్, క్లీనింగ్, విద్యుదీM్దý రణ, రోడ్ల పక్కన ఉన్న చెత్తా చెదారం ఏరివేయడం తదితర పనులను చేసేవారు. అలాగే కార్మికులను వారి నివాసం నుంచి మున్సిపాలిటీల్లోని వివిధ ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాటు చేసిన వాహనాలను నడిపే డ్రైవర్లు కూడా మనవారే ఉన్నారు. నిర్ణీత పనివేళలు ఉండటంతో పాటు నెలకు మన కరెన్సీలో రూ.25వేల నుంచి రూ.40వేల వరకు వేతనం లభించడంతో ఒమాన్‌ బల్దియాల్లో పనులకు డిమాండ్‌ ఏర్పడింది. ఒమాన్‌ ప్రభుత్వంలోని మున్సిపల్‌ వ్యవహారాల శాఖనే నేరుగా రిక్రూట్‌మెంట్‌ చేయడంతో.. కార్మికులు ఉద్యోగం మానివేస్తే గ్రాట్యూటీ కూడా ఎక్కువగా లభించేది. అలాగే ఏడాదికి నెల రోజులు వేతనంతో కూడిన సెలవులు లభించేవి. ఈ సమయంలో కార్మికులు ఇంటికి వచ్చి వారి కుటుంబాలతో గడిపి వెళ్లేవారు. కొందరు కార్మికులు తమ పనివేళలు ముగిసిన తరువాత ఇతర పనులు చేసుకుని ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశం దక్కేది. ఒమాన్‌ బల్దియాల్లో వివిధ పనులు చేసే కార్మికులను ఎన్నో ఏళ్ల నుంచి నేరుగా నియమించుకుంటున్నారు. ఈ విధానానికి స్వస్తి పలికిన అక్కడి ప్రభుత్వం అన్ని పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించి ప్రైవేటీకరణను ముమ్మరం
చేసింది. 

పెరిగిన పనివేళలు
బల్దియాల్లో ప్రభుత్వం ద్వారా నియమించబడిన కార్మికులు రోజుకు 8 గంటల పాటు పనిచేసేవారు. కాంట్రాక్టు ఏజెన్సీలు ఇప్పుడు పనివేళలను పెంచాయి. ఒక్కో కార్మికుడు రోజుకు 12 గంటల పాటు పనిచేయాలని నిబంధన విధించాయి. గతంలో ఒక్కో కార్మికునికి భారత కరెన్సీలో రూ.25వేల నుంచి రూ.40వేల వేతనం లభించగా ఇప్పుడు  రూ.20వేలకు మించి చెల్లించడం లేదు. పని వేళలు పెరగడంతో పాటు వేతనం తగ్గడం వల్ల కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారు.

స్వరాష్ట్రంలో ఉపాధి చూపాలంటున్న కార్మికులు  
ఒమాన్‌ బల్దియాల్లో ఉద్యోగాలను కోల్పోయి ఇంటి బాట పట్టిన తెలంగాణ వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం స్వరాష్ట్రంలోనే ఉపాధి మార్గాలను చూపాలని పలువురు కోరుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి బల్దియా వీసాలపై ఉపాధి పొందిన కార్మికులు ఒమాన్‌ ప్రభుత్వ నిర్ణయంతో ఇంటికి చేరుకుంటుండగా వారికి పునరావాసం కల్పించాలని పలువురు సూచిస్తున్నారు.

మూడు రకాల వీసాలు రద్దు..
మున్సిపాలిటీల్లో మన కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఒమాన్‌ ప్రభుత్వం గతంలో జారీచేసిన మూడు రకాల వీసాలను రద్దుచేస్తున్నారు. సిటీ బల్దియా వీసా, సెవెన్‌ బల్దియా వీసా, దివాన్‌ బల్దియా వీసాలను రద్దుచేస్తున్నారు. సిటీ బల్దియా వీసా అంటే పట్టణం పరిధిలోనే పని చేయడం. సెవెన్‌ బల్దియా అంటే పట్టణ ప్రాంతానికి శివారుల్లో పనిచేయడం. దివాన్‌ బల్దియా వీసాలు ఉన్నవారు రాజు, మంత్రుల నివాసాల వద్ద పనిచేసేవారు. ఈ మూడు రకాల వీసాలను రద్దు చేసి.. అన్ని పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించడంతో కార్మికులకు ఉపాధి దక్కకుండా పోతోంది.

ఎనిమిదేళ్లు పనిచేశాను..
మస్కట్‌ బల్దియాలో ఎనిమిదేళ్ల పాటు పనిచేశాను. గార్డెనింగ్‌ పనులను కాంట్రాక్టు ఏజెన్సీకి అప్పగించడంతో మా వీసాలను రద్దుచేశారు. ఇప్పుడు ఇంటికి చేరుకున్నాం. ఉపాధి కోసం మరో గల్ఫ్‌ దేశానికి వెళ్లడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఒమాన్‌లో బల్దియా ప్రైవేటీకరణ కంటే ముందుగానే పరిస్థితి బాగుంది. కాంట్రాక్టు ఏజెన్సీలకు పనులు అప్పగించిన తరువాత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది.– డి.శ్రీకాంత్, మెండోరా,భీమ్‌గల్‌ మండలం (నిజామాబాద్‌ జిల్లా)

ఉపాధి కోల్పోవడంబాధగా ఉంది..
ఒమాన్‌ బల్దియాలో పనిచేస్తున్న మాకు ఒక్కసారిగా ఉపాధి కోల్పోవడం బాధగా ఉంది. ఎనిమిది సంవత్సరాలు బల్దియాలో పనిచేశాను. ఇప్పుడు వీసా రద్దుచేసి ఇంటికిపంపించారు. ఇక్కడ ఉపాధి లేకనే గల్ఫ్‌కు వెళ్లాను. మళ్లీ ఇప్పుడు ఏం పని చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం మాకు ప్రత్యామ్నాయ మార్గం చూపాలి.– రాజేష్, వేంపేట్, మెట్‌పల్లిమండలం(జగిత్యాల జిల్లా)

ప్రభుత్వాలు స్పందించాలి..
ఒమాన్‌లో బల్దియాలో పనిచేసిన కార్మికులు వందల సంఖ్యలో ఇంటికి చేరుకుంటున్నారు. ప్రధానంగా తెలంగాణ కార్మికులే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వ స్పందించి ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. రాజు ఖబూస్‌ బిన్‌ అల్‌ సయీద్‌ మరణించడంతో కొత్త రాజు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ దేశంలో ప్రైవేటీకరణ ఊపందుకుంది.– జి.కృష్ణ, తిప్పాపూర్, వేములవాడమండలం(రాజన్న సిరిసిల్ల జిల్లా)

ఏం చేయాలోఅర్థంకావడం లేదు..
స్థానికంగా పని లేకపోవడంతోనే మేము గల్ఫ్‌ దేశానికి వలస వెళ్లాం. అక్కడ కూడా ప్రైవేటీకరణ వల్ల ఉపాధి కోల్పోయి ఇంటికి చేరుకున్నాం. ఇక్కడ ఏమి చేయాలో అర్థంకావడం లేదు. ప్రభుత్వం స్పందించి మా పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ఏదైనా ఉపాధి చూపాలి. లేకుంటే మరో గల్ఫ్‌ దేశానికి వెళ్లక తప్పని పరిస్థితి.– ప్రశాంత్, మెండోరా, భీమ్‌గల్‌ మండలం (నిజామాబాద్‌ జిల్లా)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement