హ్యూస్టన్ : తెలుగు రాష్ట్రాల్లో కొన్ని మీడియా సంస్థలు అనుసరిస్తున్న తీరుకు నిరసనగా హ్యూస్టన్లోని 'రే మిల్లర్ పార్కు (రవింద్రనాథ్ ఠాగూర్ పార్క్)'లో జనసేన కార్యకర్తలు ఫ్లకార్డులతో మౌనంగా తమ నిరసన వ్యక్తం చేశారు. రాజేష్ యాళ్లబండి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కి తమ సంఘీభావం తెలుపుతూ, తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని మీడియా సంస్థలు అనుసరిస్తున్న తీరుకు నిరసనగా 'సైలెంట్ ప్రొటెస్ట్' చేశారు. ఈ కార్యక్రమానికి సాన్ ఆంటోనియో నుంచి ముఖ్య అతిథిగా జనసేన నాయకులు, సోషల్ మీడియా యాక్టివ్ కాంట్రిబ్యూటర్ విష్ణు నాగిరెడ్డి వచ్చారు. ప్రతీ కార్యకర్త ఎల్లో మీడియాని బాయ్ కాట్ చేయాలని విష్ణు నాగిరెడ్డి పిలుపునిచ్చారు. కార్యకర్తలు మరింత బాధ్యతతో జనసేన సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. పవణ్ కళ్యాణ్ సహకారంతో నాలుగేళ్లకిందట అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం, అదే పవణ్ కళ్యాణ్‌ని రాజకీయంగా, మానసికంగానే కాకుండా చివరకు కుటుంబ పరంగా కూడా ఎల్లో మీడియాతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లో మీడియాను సామాజిక మాధ్యమాల్లో కూడా అన్‌ఫాలో కావాలని, ఫేస్ బుక్, యూట్యూబ్‌లలో ఏ విధంగా 'బ్లాక్ / అన్-ఫాలో' కావాలో వివరించారు.
నవసమాజ నిర్మాణంలో ముఖ్య భూమిక వహించవలసిన బాధ్యత మీడియా పై ఉందని వెంకట్ శీలం పేర్కొన్నారు. మీడియా తీరుమారవలసిన సమయమాసన్నమైందన్నారు. మీడియా తప్పుడు ప్రచారాలతో, అభూత కల్పనలతో ప్రజలని, రాజకీయాలని గణనీయంగా ప్రభావితం చేస్తున్నారని కృష్ణ చిరుమామిళ్ల తెలిపారు. పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి పైపైకి అని శ్రీ శ్రీ స్పూర్తిని శశి లింగినేని మరోసారి జనసేన కార్యకర్తలను ఉత్తేజపరిచారు. నవసమాజంకోసం ప్రస్తుత మీడియాలో మార్పు అవసరమన్నారు. మెరుగైన సమాజం కోసం నీతీ, నిబద్ధత, నిజాయితీతో పనన్ కళ్యాణ్ కష్టపడుతున్నారని, వారికి ఎన్‌ఆర్‌ఐలందరూ సహకరిస్తారని వీరా కంబాల చెప్పారు.
ప్రతీ కార్యకర్త జనసేన సిద్ధాంతాలను, స్పెషల్ స్టేటస్ ఆవశ్యకతను పల్లెపల్లెకి, ప్రతీ పౌరుడికీ చేర్చాలని రాజేష్ యాళ్లబండి కోరారు. ఈ కుళ్లు రాజకీయాలని తిప్పికొట్టాలని, 'స్వచ్ఛ మీడియా' కోసం ప్రస్తుత అవసరమైతే ఎల్లోమీడియాను బాన్ చేయాలని కోరారు. అమ్ముడుపోయిన మీడియాలతో రాష్ట్ర ప్రజలు అశాంతికి గురవుతున్నారన్నారు. ప్రస్తుత కలుషిత మీడియా ప్రధాన సమస్యలను ప్రక్కతోవ పట్టించడంలో సఫలీకృతమౌతుందని శేషాద్రి మంచం అన్నారు. అలాంటి చానళ్ళని బ్యాన్ చేయవలసినదిగా జనసేన కార్యకర్తలను కోరారు.
ఈ కార్యక్రమంలో జగన్ రాయవరపు, శేషగిరి రావు యల్లాప్రగడ, కిరణ్ వర్రే, శశి లింగినేని, సందీప్ రామినేని, రాం సింహాద్రి, కిషోర్ అధికారి, రమేష్ వరంగంటి, వెంకట్ బోనం, సుబ్రమణ్యం వంగల, వెంకట్ శీలం, వీరా కంబాల, దుర్గారావ్ నుప్పులేటి, శేషద్రి మంచెం, నాగ్ మేకల, సురేష్ సత్తి, చైతన్య కూచిపూడి, మహేష్ ముద్దాల, కృష్ణ చిరుమామిళ్ళ, రాజేష్ యాళ్లబండి, విష్ణు నాగిరెడ్డి, శ్రీకాంత్, హ్యూస్టన్లోని జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలందరూ, జనసేన పార్టీ నిర్మాణానికి బలోపేతానికీ తమ పూర్తి సహాయసహకారలు అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment