కాలిఫోర్నియా : ఎక్కడ ఉన్నా తెలుగు వారంత ఒకటే అనేలా, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా శాక్రమెంటో తెలుగు సంఘం(ట్యాగ్స్) ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ట్యాగ్స్ 14వ వార్షికోత్సవ వేడుకలను కూడా సంక్రాంతి సంబరాలతో పాటే జరుపుకున్నారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలో సుమారు వెయ్యిమందికి పైగా తెలుగువారు పాల్గొన్నారు.
లింగా శ్రీనివాస్ రూపొందించిన ‘తెలుగు విజయం’ జానపద నృత్యం , శ్రీదేవి మాగంటి బృందం ప్రదర్శించిన బుర్రకథ, కోలాటం, 300 మంది కళకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారి డప్పు వాయింపు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు శాక్రమెంటో జిల్లా అధికారి సూఫ్రాస్ట్, ఫాల్సం మేయర్ స్టీవ్ మిక్లోస్, ప్రముఖ వైద్యుడు హనిమిరెడ్డి లక్కిరెడ్డి, ఆపాప ఫౌండేషన్ సంస్థాపక అధ్యక్షుడు సీసీ యిన్, సిలికాన్ ఆంధ్ర చైర్మన్ ఆనంద్ కూచిభోట్ల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ట్యాగ్స్ కార్యవర్గ సభ్యులు వీరిని ఘనంగా సన్మానించడంతో పాటు జ్ఞాపికలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆనంద్ కూచిభోట్ల మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి, సాహిత్యం, కవిత్వం, సంప్రదాయాలను భావి తరాలకు అందిచాలన్నారు. కృష్ణా జిల్లా కూచిపూడి చుట్టుపక్కల ఉన్న 150 గ్రామాలకు వైద్య సేవలు అందిచ్చేందుకు సకల సౌకర్యాలతో నిర్మితమవుతున్న సంజీవని ఆస్పత్రికి సహకారం అందించడానికి దాతలు ముందుకురావాలని కోరారు. ఆస్పత్రి ద్వారా ఆరోగ్యంతో పాటు 500పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్టు తెలిపారు.
హనిమిరెడ్డి లక్కిరెడ్డి మాట్లాడుతూ.. తాను విద్యాసంస్థలకు భూ విరాళాలు ఇచ్చానని, ఇప్పటివరకు సంపాందించింది తన కుటుంబానికైతే.. ఇకపై సంపాందించేదంతా సమాజశ్రేయస్సుకే ఖర్చు చేస్తానన్నారు. ట్యాగ్స్ చైర్మన్ వెంకట్ నాగం, ప్రెసిడెంట్ మనోహర్ చేతుల మీదుగా తెలుగు సంస్కృతి వ్యాప్తికి కృషి చేస్తున్న ఆనంద్ కూచిభోట్లకు జీవిత సాఫల్య పురస్కారం ప్రధానం చేసి, ఘనంగా సన్మానించారు. పాల్సం,రోసివిల్లి, నాటోమాస్ కేంద్రాలలోని సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు పద్యాలు, కథలు, పాటలతో ఆకట్టుకున్నారు.
వీఎంబ్రేస్ సంస్థకు చెందిన దివ్యాంగులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనను వీక్షకులు కరతాల ధ్వనులతో ప్రోత్సాహించారు. జనవరి 14న కూడా ట్యాగ్స్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని ఇదే వేదికపై నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని ఫ్రీమాంట్ సిద్ధి వినాయకునిక ఆలయం నుంచి వచ్చిన పూజరులు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ట్యాగ్స్ రేణిగుంటలోని అభయ క్షేత్రం, హైదరాబాద్‌లోని విజిష్ణ ఫౌండేషన్, బ్యాక్ టూ ద రూట్స్‌కి విరాళాలు అందజేస్తుందని ట్యాగ్స్ సభ్యులు తెలిపారు. విరాళాలు అందజేయదలచినవారు మెయిల్(sactags@gmail.com) ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ట్యాగ్స్ కార్యవర్గ సభ్యులు మనోహర్ మందడి, మోహన్ కాట్రగడ్డ, సందీప్ గుడుపెల్లి, శ్రీదేవి మాగంటి, కీర్తి సురం, సురేంద్రనాథ్ కొప్పారపు, శ్రీరామ్ అకిన, మమతాదాసి, నాగేశ్వరరావు దొండపాటి,నాగేంద్రనాథ్ పగడాల, శ్రీనివాస రావు యనపర్తి, ప్రసాద్ కేతిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, అశ్విన్ తిరునాహరి, మల్లిక్ సజ్జనగాండ్ల, స్వర్ణ కంభంపాటి, వాసు కుడుపూడి, సుధాకర్ వట్టి,రాంబాబు బావిరిశెట్టి, అనిల్ మండవ, వెంకట్ నాగం, డా సంజయ్ యడ్లపల్లి పాల్గోన్నారు.
Comments
Please login to add a commentAdd a comment