Sacramento
-
అమెరికాలో జడ్జిగా నియమితులైన తెలుగు మహిళ జయ బాడిగ
న్యూయార్క్: భారతీయ సంతతి అమెరికా పౌరురాలు, తెలుగుబిడ్డ జయ బాడిగ అక్కడి శాక్రామెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన జయ ఆ తర్వాత కుటుంబంతో అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే న్యాయ విద్య చదివి న్యాయవాద వృత్తి జీవితం మొదలెట్టారు. ఇటీవల జడ్జిగా ఎంపికైన జయను కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ శాక్రామెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా తాజాగా నియమించారు. ఇదే కోర్టులో గత రెండేళ్లుగా జయ కమిషనర్‌గా సేవలందిస్తుండటం విశేషం. డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలైన జయ 2020లో కాలిఫోరి్నయా ఆరోగ్య పరిరక్షణ సేవల విభాగంలో అటారీ్నగా పనిచేశారు. 2018లో కాలిఫోరి్నయా గవర్నర్ కార్యాలయంలో అత్యవసర సేవల విభాగంలో సేవలందించారు. శాంటాక్లారా విశ్వవిద్యాలయంలో లా చదివారు. బోస్టన్ విశ్వవిద్యాలయంలోని ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్స్ విభాగంలో ఎంఏ చేశారు. కుటుంబ కేసులు, తగాదాలను పరిష్కరించడంలో జయ పది సంవత్సరాల అనుభవం గడించారు. -
కాలిఫోర్నియాలో అంతుచిక్కని వెలుగురేఖ!
కాలిఫోర్నియా: ఆకాశంలో ఎవరికీ అంతుచిక్కని వెలుగు రేఖ ఒకటి అమెరికా కాలిఫోర్నియోలోని శాక్రమెంటోలో కనిపించింది. సెయింట్ పాట్రిక్ డే వేడుకల్లో ఉన్న వారంతా నీలాకాశంలో కనిపించిన ఆ వెలుగుని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. వెంటనే తమ చేతుల్లో ఉన్న సెల్‌ఫోన్ కెమెరాల్లో దానిని బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కేవలం 40 సెకండ్ల పాటు మాత్రమే కనిపించి ఆ వెలుగురేఖ అదృశ్యమైపోయింది. ‘‘ఇప్పటివరకు ఇలాంటి దృశ్యాన్ని మేము చూడలేదు. ఆకాశంలో ఏదో మండుతున్నట్టుగా ఒక వెలుగు కొన్ని సెకండ్లు కనిపించి మాయమైపోయింది. ఇది ఎందుకు కనిపించిందో ఎవరైనా చెప్పగలరా’’ అంటూ దానిని వీడియో తీసిన హెర్నాండెజ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ వీడియోను చూసిన హార్వార్డ్–స్మిత్సోనియాన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన జోనాథాన్ మెక్‌డొవెల్ అంతరిక్షంలో మండించే శిథిలాల్లో ఒక చిన్న తునక కావడానికి 99.9% ఆస్కారం ఉందని బదులిచ్చారు. జపాన్‌కు చెందిన రిటైర్ అయిన కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇటీవల మంటల్లో దగ్ధం చేశారని, దాని తాలూకు చిన్న తునక అలా కనిపించి ఉంటుందని అంచనా వేశారు. -
శాక్రమెంటోలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
నటోమాస్ గ్రూప్ ఆధ్వర్యంలో తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించేలా బతుకమ్మ పండుగను శాక్రమెంటోలో ఘనంగా నిర్వహించారు. తెలుగుతనం ఉట్టిపడే విధంగా సంప్రదాయ దుస్తులలో దాదాపు 1000 మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వేదపండితులు గౌరమ్మకు పూజలు నిర్వహించారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ రాగయుక్తంగా మహిళలు ఆడుతూ, పాడుతూ చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమం సొంతఊరిలోని పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ జానపద గాయకుడు డాక్టర్ శ్రీనివాస్ లింగా తనదైన బాణీలతో శ్రోతలను అలరించారు. స్థానికంగా ఉన్న చిన్నారుల నృత్యవిన్యాసాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించాయి. ఈ బతుకమ్మ వేడుకలకు ప్రధాన కర్త అయిన వెంకట్ మేచినేని మాట్లాడుతూ.. తమ తోటి స్నేహితులు, ఆప్తుల అండదండలతో ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. ఈ కార్యక్రం ద్వారా ఎంతో ఆనందాన్ని, అనుభూతులను, మధురస్మృతులను పొందామని, అందరు సుఖ సంతోషాలతో జీవించాలని అందుకు దేవతల అనుగ్రహము ఉంటుందని నమ్ముతూ, ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగేందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
ట్యాగ్స్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
కాలిఫోర్నియా : ఎక్కడ ఉన్నా తెలుగు వారంత ఒకటే అనేలా, తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా శాక్రమెంటో తెలుగు సంఘం(ట్యాగ్స్) ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ట్యాగ్స్ 14వ వార్షికోత్సవ వేడుకలను కూడా సంక్రాంతి సంబరాలతో పాటే జరుపుకున్నారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలో సుమారు వెయ్యిమందికి పైగా తెలుగువారు పాల్గొన్నారు. లింగా శ్రీనివాస్ రూపొందించిన ‘తెలుగు విజయం’ జానపద నృత్యం , శ్రీదేవి మాగంటి బృందం ప్రదర్శించిన బుర్రకథ, కోలాటం, 300 మంది కళకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారి డప్పు వాయింపు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు శాక్రమెంటో జిల్లా అధికారి సూఫ్రాస్ట్, ఫాల్సం మేయర్ స్టీవ్ మిక్లోస్, ప్రముఖ వైద్యుడు హనిమిరెడ్డి లక్కిరెడ్డి, ఆపాప ఫౌండేషన్ సంస్థాపక అధ్యక్షుడు సీసీ యిన్, సిలికాన్ ఆంధ్ర చైర్మన్ ఆనంద్ కూచిభోట్ల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ట్యాగ్స్ కార్యవర్గ సభ్యులు వీరిని ఘనంగా సన్మానించడంతో పాటు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆనంద్ కూచిభోట్ల మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి, సాహిత్యం, కవిత్వం, సంప్రదాయాలను భావి తరాలకు అందిచాలన్నారు. కృష్ణా జిల్లా కూచిపూడి చుట్టుపక్కల ఉన్న 150 గ్రామాలకు వైద్య సేవలు అందిచ్చేందుకు సకల సౌకర్యాలతో నిర్మితమవుతున్న సంజీవని ఆస్పత్రికి సహకారం అందించడానికి దాతలు ముందుకురావాలని కోరారు. ఆస్పత్రి ద్వారా ఆరోగ్యంతో పాటు 500పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్టు తెలిపారు. హనిమిరెడ్డి లక్కిరెడ్డి మాట్లాడుతూ.. తాను విద్యాసంస్థలకు భూ విరాళాలు ఇచ్చానని, ఇప్పటివరకు సంపాందించింది తన కుటుంబానికైతే.. ఇకపై సంపాందించేదంతా సమాజశ్రేయస్సుకే ఖర్చు చేస్తానన్నారు. ట్యాగ్స్ చైర్మన్ వెంకట్ నాగం, ప్రెసిడెంట్ మనోహర్ చేతుల మీదుగా తెలుగు సంస్కృతి వ్యాప్తికి కృషి చేస్తున్న ఆనంద్ కూచిభోట్లకు జీవిత సాఫల్య పురస్కారం ప్రధానం చేసి, ఘనంగా సన్మానించారు. పాల్సం,రోసివిల్లి, నాటోమాస్ కేంద్రాలలోని సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు పద్యాలు, కథలు, పాటలతో ఆకట్టుకున్నారు. వీఎంబ్రేస్ సంస్థకు చెందిన దివ్యాంగులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనను వీక్షకులు కరతాల ధ్వనులతో ప్రోత్సాహించారు. జనవరి 14న కూడా ట్యాగ్స్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని ఇదే వేదికపై నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని ఫ్రీమాంట్ సిద్ధి వినాయకునిక ఆలయం నుంచి వచ్చిన పూజరులు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ట్యాగ్స్ రేణిగుంటలోని అభయ క్షేత్రం, హైదరాబాద్‌లోని విజిష్ణ ఫౌండేషన్, బ్యాక్ టూ ద రూట్స్‌కి విరాళాలు అందజేస్తుందని ట్యాగ్స్ సభ్యులు తెలిపారు. విరాళాలు అందజేయదలచినవారు మెయిల్(sactags@gmail.com) ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్యాగ్స్ కార్యవర్గ సభ్యులు మనోహర్ మందడి, మోహన్ కాట్రగడ్డ, సందీప్ గుడుపెల్లి, శ్రీదేవి మాగంటి, కీర్తి సురం, సురేంద్రనాథ్ కొప్పారపు, శ్రీరామ్ అకిన, మమతాదాసి, నాగేశ్వరరావు దొండపాటి,నాగేంద్రనాథ్ పగడాల, శ్రీనివాస రావు యనపర్తి, ప్రసాద్ కేతిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, అశ్విన్ తిరునాహరి, మల్లిక్ సజ్జనగాండ్ల, స్వర్ణ కంభంపాటి, వాసు కుడుపూడి, సుధాకర్ వట్టి,రాంబాబు బావిరిశెట్టి, అనిల్ మండవ, వెంకట్ నాగం, డా సంజయ్ యడ్లపల్లి పాల్గోన్నారు. -
కాలిఫోర్నియాలో 10 మందికి కత్తిపోట్లు
శాక్రమెంటో: కాలిఫోర్నియాలో ఓ పార్టీకి చెందిన వారు మరో పార్టీకి చెందిన వారిపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో 10 మంది గాయపడగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాలిఫోర్నియా పెట్రోలింగ్ అధికారి జార్జి గ్రెనడా వివరాలను మీడియాకు వెల్లడించారు. దాదాపు 30 మంది ట్రెడిషనలిస్ట్ పార్టీకి చెందిన వారు ర్యాలీ నిర్వహిస్తుండగా, వీరికి మరో పార్టీకి చెందిన 400 మంది ఎదురయ్యారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో కొందరు ముసుగు ధరించిన యువకులు కత్తులు, కర్తలతో హల్చల్ చేస్తూ దొరికిన వారిని దొరికినట్లు పొడిచారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని.. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు. కాగా ఈ ఘటనలో ఒక మహిళ సహా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడినట్లు సాక్రామెంటో అగ్నిమాపక శాఖ అధికారి క్రిస్ హార్వే చెప్పారు. వీరంతా 19 ఏళ్ల నుంచి 58 ఏళ్ల వయసు మధ్య వారని చెప్పారు. -
కాలిఫోర్నియాలో పోస్ట్‌మాస్టర్‌గా భారత సంతతి మహిళ
న్యూయార్క్ : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాక్రమెంటో నగరంలో పోస్ట్‌మాస్టర్‌గా భారత సంతతికి చెందిన జగ్దీప్ గ్రేవాల్ నియమితులయ్యారు. గత 166 ఏళ్లలో ఇక్కడ పోస్ట్‌మాస్టర్‌గా నియమితులైన తొలి మహిళ జగ్దీప్ గ్రేవాల్ కావడం విశేషం. 537 సిటీ మార్గాలు, 94 రూరల్ ప్రాంతాల్లో విధుల నిర్వహించే 1,004 మంది ఉద్యోగులకు ఆమె నేతృత్వం వహిస్తారు. భారత్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో గ్రేవాల్ బ్యాచిలర్ డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. 1988లో విండో క్లర్క్‌గా తపాలా శాఖలో కెరీర్ ప్రారంభించారు. ఐదేళ్లలోనే మేనేజర్ స్థాయికి ఎదిగారు. తపాల సేవలకు ఆదరణ తగ్గిన ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో తోటి ఉద్యోగులతో కలిసి మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తానని ఆమె తెలిపారు. కాగా యూఎస్ తపాల శాఖ తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటోంది. గతేడాది 586 మిలియన్ డాలర్ల నికర నష్టాలను చవిచూసింది. -
ఉత్తర కాలిఫోర్నియాలో స్వల్ప భూకంపం
కాలిఫోర్నియా: అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూప్రకంపన తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం 1.17 గంటల ప్రాంతంలో(స్థానిక కాలమానం ప్రకారం) మెన్డోసినో కౌంటీలోని దక్షిణ కొవెలో ఈ భూకంపం సంభవించినట్టు వెల్లడించింది. పశ్చిమ సాంక్రమెంటోకు 120 కిలోమీటర్ల దూరంలో భూకంపన కేంద్రాన్ని గుర్తించారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.