సీటెల్: బతుకమ్మ పండుగ వేడుకలను దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సియాటిల్‌లో నిర్వహించిన ఈ వేడుకలకు మహిళలు అందమైన పూలతో బతుకమ్మలను తయారు చేసి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సంబరాలకు సియాటిల్ నలుమూలల నుంచి 4000 మందికిపైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. కార్యక్రమానికి తెలుగు సినీపరిశ్రమకు చెందిన యాంకర్ అనసూయ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన గాయని స్వాతి కూడా యూకే నుంచి ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. వీరిద్దరు తమదైన శైలిలో అక్కడున్న వారితో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు. విదేశాల్లో స్థిరపడ్డా కానీ, తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది.
బోథెల్ వాలంటీర్ల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏడడుగుల బతుకమ్మ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెడ్‌మండ్ జట్టు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధోల్ తాషా సాంస్కృతిక కార్యక్రమాలు హైలెట్‌గా నిలిచాయి. టాటా సియాటిల్ బృందం ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ వంశీరెడ్డి, బోర్డు డైరెక్టర్లు నవీన్ గోలి, ప్రదీప్ మెట్టు, ఆర్‌వీపీ గణేష్, మనోహర్, నిక్షిప్త, అజయ్, ఆర్‌సీ శ్రీకాంత్, శివ అధ్వర్యంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వేడుకలను ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన టాటా సియాటిల్ బృందం సభ్యులను భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని కోరుతూ, కార్యక్రమానికి హాజరైనవారందరూ వారిని ప్రత్యేకంగా అభినందించారు. టాటా సియాటిల్ బృందం ఈ కార్యక్రమాన్ని స్థానిక తెలంగాణ అసోసియేషన్స్ వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ (వాటా), తెలుగు అసోసియేషన్ వాట్స్ (వాషింగ్టన్ తెలుగు అసోసియేషన్) తో కలిసి నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment