
వాషింగ్టన్: అమెరికాలోని డల్లాస్‌లో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (టీపీఏడీ) ఆధ్వర్యంలో బతుకమ్మ తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రజల సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ వేడుకలను డల్లాస్‌లోని కోపెల్స్ ఆండ్రూ బ్రౌన్ పార్క్‌లో చేశారు. 200 మందికి పైగా తెలుగు మహిళలు ఒకచోట చేరి బతుకమ్మలను పేర్చి బతుకమ్మ ఆడారు. దాదాపు రెండు గంటలపాటు మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ, బొడ్డెమ్మ కొడుతూ ఉత్సాహంగా వేడుకలో పాల్గొన్నారు.
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో శారదా సింగిరెడ్డి, మాధవి సుంకిరెడ్డి, రూప మాచర్ల, ఇందు పంచెరుపూల, దీప్తి, అనురాధ మేకల, మధుమతి వైశ్యరాజు, లక్ష్మీ పోరెడ్డి, ఏ. రోజా, బి. కవిత, జయ తెలుకుంట్ల, తదితరులు పాల్గొని బతుకమ్మ పాటలు పాడారు. టీపీఏడీ అధ్యక్షుడు కరన్ పోరెడ్డి, కార్యదర్శి రమణ లష్కర్, ఫౌండేషన్ చైర్మన్ ఉపేందర్ తెలుగు, బీఓటీ చైర్మన్ అశోక్ కొండాలా, కో చైర్మన్ మనోహర్ కసగాని, వ్యవస్థాపక సభ్యుడు రఘువీర్ బండారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జయప్రదం అయింది.



