సియాటెల్ : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రాజన్న పాత్రలో నటించారు. అమెరికాలోని సియాటెల్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో భాగంగా 70ఎమ్‌ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్వాణ సంస్థలు ‘యాత్ర’ ప్రీమియర్ షో మొదటి టికెట్‌ను వేలం వేశాయి. అందులో మునీశ్వర్ రెడ్డి 6,116 డాలర్లకు(దాదాపు 4.37లక్షలు) మొదటి టికెట్‌ను గెలుచుకున్నారు.
వైఎస్సార్ మీద అభిమానంతో మునీశ్వర్ రెడ్డి యాత్ర టికెట్ బిడ్డింగ్ రూపంలో కొన్నారు. అయితే టికెట్ ధర 12 డాలర్లు మాత్రమే నిర్మాతలు తీసుకుని మిగతా మొత్తాన్ని వైఎస్సార్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు సహాయంగా ఇస్తామని 70 ఎంఎం ఎంటర్‌టైన్మెంట్స్, నిర్వాణ సినిమాస్ వారు తెలిపారు. ప్రీమియర్ షోలు అధికంగా వేసి, టికెట్ రేట్లు పెంచుకుని జేబులు నింపుకుంటున్న నిర్మాతలు ఉన్న ఈ రోజుల్లో, వచ్చిన డబ్బును సామాజిక కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చిన యాత్ర నిర్మాతలు విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డిలను కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసులు అభినందించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న వారందరికీ నిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు. ఫిబ్రవరి 8న యాత్ర ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment