పరిపూర్ణ బౌద్ధుడు దొమ్మేటి
ప్రజ్ఞ, శీలం, కరుణ ప్రధాన మార్గాలుగా కుల మతాలకు అతీతంగా నడిచే బౌద్ధ ధర్మం అశోకుని కాలంనుంచి నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ వరకూ ఎందరికో స్ఫూర్తినిచ్చింది. మరెందరికో ఇప్పటికీ ఆచరణాత్మక విధానంగా ఉన్నది. ఆ వరసలో బౌద్ధాన్ని త్రికరణశుద్ధిగా ఆచ రించి ప్రచారం చేసిన ప్రముఖుడు దొమ్మేటి సత్య నారాయణ బోధి ఈ నెల 13న కాకినాడలో పరిని ర్వాణం చెందారు. 70వ దశకంలో పశ్చిమ బెంగాల్‌లో రైల్వే శాఖలో పనిచేస్తూ అక్కడి మార్క్సిస్టు మేధావుల ప్రభావంతో రైల్వే ఉద్యోగుల నాయకు డిగా ఎదిగి ఆయన అనేక పోరాటాలను నిర్వహిం చారు.
1974లో దేశవ్యాప్తంగా జరిగిన రైల్వే సమ్మె లో ప్రముఖ పాత్రవహించి ఆ క్రమంలో ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. జార్జి ఫెర్నాండెజ్‌తో సాన్నిహి త్యం కారణంగా జనతాపార్టీ పాలనలో తిరిగి ఉద్యో గాన్ని పొంది అక్కడే పనిచేస్తూ 1984లో రిటైరయ్యా రు. ఉద్యోగ విరమణానంతరం కాకినాడలో స్థిరప డ్డాక ఆయన ఆలోచనలన్నీ బౌద్ధం చుట్టూ తిరిగా యి. 1988లో బౌద్ధ ధర్మాచరణలో మమేకం కావడా నికి ముందు ఆయన దళిత రచయిత లు, కవులు, మేధావుల ఐక్యవేదికకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.
బోధిగా మారాక సామాజికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటన్నిటినీ అధిగమించడమే కాదు... కుటుంబం మొత్తం బౌద్ధ ధర్మాచరణకు బద్ధులయ్యేలా చేయగలిగారు. దేశవ్యా ప్తంగా ఉన్న బౌద్ధభిక్షువులతో సత్యనారాయణ బోధి నిత్య సంబంధాల్లో ఉంటూ బౌద్ధ ధర్మప్రచారంలో, అందుకు సంబంధించిన సాహిత్య అధ్యయనంలో తలమునకలయ్యారు. సుదీర్ఘకాలం బెంగాల్‌లో ఉం డటంవల్ల కావొచ్చు... హిందీ, ఆంగ్లం, ఒరియా, మరాఠీ, బెంగాలీ భాషల్లో ఆయన సంపూర్ణంగా పట్టు సాధించారు. కలంపట్టి ‘ఈ మతమేమిటి?’, ‘ఆర్య అష్టాంగ మార్గం’, ‘మీ కష్టాలను అధిగమించ డమెలా?’వంటి ఎన్నో స్వతంత్ర రచనలు చేశారు. హిందీలో ఉన్న సచిత్ర ఫూలే జీవిత చరి త్రను తెలుగులోకి అనువదించారు.
ఎ.ఎస్. ధమ్మానంద ఆంగ్ల గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. దేశం లోని దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల్లో బుద్ధిజంపై పత్రాలు సమర్పించారు. ధమ్మపథం ఆధారంగా దూరదర్శన్‌లో 2002లో జాతక కథలపై ప్రసంగాలు చేశారు. 1996 నుంచి పరినిర్వాణం పొందేవరకూ ఆకాశవాణిలో బుద్ధ చింతన పేరిట దాదాపు వంద ప్రసంగాలు చేశారు. బౌద్ధధర్మంపై కరపత్రాలు రూపొందించి భుజా నికి ఎప్పుడూ వేలాడే సంచీలో ఉంచుకుని ఎక్కడికెళ్లినా పంచేవారు. సత్యనారా యణ బోధి జ్ఞానతృష్ణ అపరిమితమైనది. బౌద్ధ ధర్మప్రచారం కోసం దేశవ్యాప్తంగా జరిగిన సెమి నార్లు, సభల్లో పాల్గొనేందుకు ఆయన చేసిన పర్యట నలకు అవధుల్లేవు.
ఈ జిల్లాలోని కోరుకొండలో ఉన్న బౌద్ధారామం విశిష్టతను తెలియజేస్తూ 2007లో రాజమండ్రిలో ఆయన చేసిన ప్రసంగం దేశం నలుమూలలనుంచీ వచ్చిన మేధావులను, పురావస్తు శాస్త్రవేత్తలను ఎంతగానో ఆకట్టుకున్నది. కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో పదిరోజు లుండి అక్కడ పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మహాబోధి విహారాన్ని, దాని ప్రత్యేకతను వెలుగు లోకి తెచ్చిన గొప్ప వ్యక్తి సత్యనారాయణ బోధి. ప్రశాంత చిత్తం, ప్రసన్న వదనం, స్నేహశీలత...తన విశ్వాసాల కోసం దృఢ సంకల్పంతో పనిచేసే గుణం ఆయన సొంతం. సత్యనారాయణ బోధి పెద్ద కుమారుడు సుధాకరరావు చెప్పినట్టు కోటానుకోట్ల విలువచేసే బుద్ధిజాన్ని కుటుంబానికీ, తనచుట్టూ ఉన్న సమా జానికీ పంచి, ఆ ధర్మంలో నడిచేందుకు ఎందరికో స్ఫూర్తినిచ్చిన విశిష్ట వ్యక్తి సత్యనారాయణ బోధి. ఆయనకిదే నా స్మృత్యంజలి.
(నేడు కాకినాడలో సత్యనారాయణ బోధి సంస్మరణ సభ సందర్భంగా)
జి. సుబ్బారావు కొత్తపేట
ఫోన్ 9959335876