- వి.వి.రమణమూర్తి
కురుసభలో ద్రౌపదిని అ వమాన పరిచినట్టు మహా భారతంలో కనిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్ర మంత్రిమండలిలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సమక్షంలోనే ఒక మహిళా అధికారికి తీరని అవమానం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేయించి కొట్టించారు. రాష్ట్రం నివ్వెరపోయింది. ఇక్కడ చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రజలంతా భావించారు.
కానీ చట్టం ఇక్కడ పనికిరాలేదు. అధికార మదం రాజ్యమేలింది. వనజాక్షి ఉదంతంలో న్యాయం చేయాలని రెవెన్యూ ఉద్యోగులంతా ఆందోళన చేశా రు. మానవ హక్కుల కమిషన్ కూడా తీవ్రంగానే పరిగణించింది. కేసును సుమోటోగా తీసుకుని ఆగ స్టు 13లోగా నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశిం చింది. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కూడా కేసును సుమోటోగా తీసుకుని నాలుగు వారాలలో నివేదిక ఇవ్వాలని ఎస్పీని ఆదేశించింది. విధినిర్వహణలో ఉన్న అధికారుల మీద దాడులు జరిగితే సహించేది లేదని రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి హెచ్చరిం చారు. ఇన్ని రకాల స్పందనలు వచ్చినా, ముఖ్యమం త్రి చంద్రబాబు, సహచర మంత్రుల స్పందన మాత్రం భిన్నం గా ఉంది.
మా ఎమ్మెల్యే ఈ పని చేశాడని వారు అనడం లేదు. పైగా ‘ఆయన మీ మీద నేరుగా దాడి చేయ లేదు. మీరు కూడా కొంత సంయమనం పాటించి ఉండాల్సింది.
అయినా సీనియర్ ఐఏఎస్ అధికారి చేత దర్యాప్తు చేయిస్తాను’- చంద్రబాబు రెవెన్యూ అధికారుల సంఘం నేతల సమక్షంలో వనజాక్షితో అన్నమాటలివి. నేరుగా దాడి చేయలేదు అంటే అను చరుల చేత చేయించారన్న విషయం అర్థమవుతుం ది. భయపెట్టి వనజాక్షిని ఇంతకుమించి ముందుకు వెళ్లనీయకుండా నిలువరించిన ప్రభుత్వం విజయం తనదే అని విర్రవీగవచ్చు. కానీ ప్రజల దగ్గర సర్కా ర్ ఎంత పరపతి పోగొట్టుకున్నదో లెక్కకు అందదు. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నదని తహసీ ల్దార్‌కు సమాచారం అందింది. ఆమె వెళ్లి అడ్డుకు న్నారు. అయితే తహసీల్దార్ తనిఖీ చేసిన ప్రాంతం ఆమె పరిధిలోనిది కాదని కొందరి పెద్దల వాదన. కానీ వనజాక్షి నిజాయితీ కలిగిన ఉద్యోగిని అని పేరు పొందింది.
అయినా ఆత్మాభిమానం దెబ్బతిం టే విధులు ఎలా నిర్వహించగలరు? అధికార పక్ష సభ్యులు ఇక మీసం మెలేస్తూ ఎలాంటి అక్రమాల కైనా పాల్పడవచ్చు. బాబు తీరు ఈ ధోరణికి పచ్చ జెండా ఊపినట్టే ఉంది. ప్రజాస్వామ్యంలో ఎంతటి వారినైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది. అలాంటిది, ఒక తహసీల్దార్, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదా కలిగిన ఆమెకు అక్రమ రవాణాను ప్రశ్నించే హక్కు లేదా? అడ్డుకునే అధికారం లేదా? ఉద్యోగిని జుట్టులాగి, సెల్‌ఫోన్ విసిరేసి, హింసించినా అధి కార పక్షం ఎమ్మెల్యేపైనా, ఆయన అనుచరుల మీద కనీస చర్యలేదు. నిజాయితీగా ఉద్యోగం చేస్తున్న వారిని అవమానించి, ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టే ఇసుక మాఫియాలను భుజాన వేసుకోవడం న్యాయమేనా? ఇసుక అక్రమ రవాణా వాస్తవాన్ని పక్కన పెట్టి, పార్టీ ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి ముఖ్యమంత్రి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే అలాంటి వారి పాలనలో సామాన్యుల పరిస్థితి ఏమిటి?
తహసీల్దార్ వనజాక్షి అధికార పరిధిలో ఆ రం గంపేట లేకపోతే లేకపోయింది. ఇసుక అక్రమ రవా ణా నిజం. మరి ఈ అంశంలో ఎవరి మీదా ఇంత వరకు ఎందుకు చర్య తీసుకోలేదు? ప్రభాకర్ మీద ఇంతకుముందే నేర చరిత్ర ఉంది. 14 కేసులతో పాటు, ఏలూరు పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ కూడా ఉందన్న వార్తలు వచ్చాయి. అలాంటి వ్యక్తికి బాబు విప్ బాధ్యతలు అప్పగించారంటేనే సదరు ఎమ్మెల్యే ప్రజాసేవకు ఆయన ఎంత మంత్ర ముగ్ధులయ్యారో అర్థమవుతుంది. తను స్వయంగా ఇచ్చిన ఐఎఎస్ అధికారి చేత విచారణ వాగ్దానాన్ని కూడా చంద్ర బాబు గోదావరిలో కలిపారు. మంత్రిమండలి సమా వేశంలో అంతా ఆమెదే తప్పని తేల్చి, ప్రజాస్వా మ్యాన్ని అపహాస్యం చేశారు. అంటే అధికార పార్టీ శాసనసభ్యులు ఎలాంటి చర్యలకు పాల్పడినా ఎవ రూ కిక్కురు మనకుండా ‘ముందుకు పోవాలి’. ఇదే న్యాయం.. ఇదే చట్టం.. ఇదే నేటి భారతం కూడా.
వి.వి.రమణమూర్తి
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)
మొబైల్: 93485 50909