సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చట్టం ముందు అందరూ సమానమే అని, ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన బుధవారం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు రాజకీయ జీవితమంతా స్టేలు తెచ్చుకోవడంతోనే సరిపోయింది. జిల్లాల పర్యటనల్లో ఆయన తాను చేసిన తప్పులు ఒప్పుకోవాలి. అయిదేళ్లు మోసం చేసినందుకు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
చంద్రబాబు రౌడీ షీటర్లను, మాఫియాను వెనకేసుకు వస్తున్నారు. అరాచక శక్తులను ప్రోత్సహించే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. తప్పులు చేశారు కనుకే కేసులు పెడుతున్నారు. అయిదేళ్ల పాలనలో చంద్రబాబు పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. తనకు తాను కరకట‍్ట బాబా అనుకుంటున్నారేమో...?. ఇక చింతమనేని ప్రభాకర్‌పై 18 కేసులు ఉన్నాయి. ఆయనేమైనా దెందులూరు బాబానా?. చట్టం ముందు అందరూ సమానమే. చింతమనేని దౌర్జన్యాలు చంద్రబాబుకు, యనమల రామకృష్ణుడుకు కనిపించడం లేదా?.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే మతానికి ముడిపెట్టడం సరైనదా?. కేసులకు భయపడి మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకోవడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. రాజకీయ అవసరాల కోసం గతంలో సోనియాగాంధీ కాళ్లు పట్టుకున్నారు. తెలంగాణలో టీడీపీ శకం ముగిసింది. త్వరలో ఏపీలో కూడా టీడీపీ కనుమరుగు అవుతుంది. చంద్రబాబు ఔట్ డేటెడ్ లీడర్, ఇక నారా లోకేష్ అప్‌డేట్ కాని లీడర్. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబుకు కనిపించడం లేదా?. లోకేష్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు నిప్పు అయితే ఆయన తనపై ఉన్న స్టేలను వెనక్కి తీసుకోవాలి. స్టేలను వెనక్కి తీసుకుంటే చంద్రబాబు అంత అవినీతి పరుడు మరొకరు ఉండరు’ అని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment