గురితప్పిన ఎన్నికల ‘ఏకే’!
బైలైన్: కాంగ్రెస్‌కు నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై చిత్తశుద్ది ఉండి ఉంటే మూడేళ్ల క్రితమే ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి ఉండేది. ప్రతికూల స్పందనలను గ్రహించి, ప్రత్యేక రాష్ట్రం నిర్ణయం వల్ల ప్రయోజనాలను చూపించి స్పందించడానికి దానికి ఈ మూడేళ్లకాలం ఉపయోగపడేది. తెలంగాణ ప్రకటనకు అది ఎంచుకున్న సమయాన్ని నిర్ణయించింది ప్రజాప్రయోజనం కాదు, పార్టీకి జరిగే మేలే.
ప్రజా జీవితంలోని హాస్యం తులాదండపు మొనలాంటిది. అందుకే అది రాజకీయవేత్తకు ఆజన్మ నైతిక శత్రువు. అవినీతి కుంభకోణమంత సమర్థంగా ఒక చతురోక్తి రాజకీయ ప్రతిష్టకు భంగం వాటిల్ల చేయలేకపోవచ్చు. కానీ తగ్గించగలుగుతుం ది. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో చతురోక్తులను విసరాలన్న ప్రలోభానికి ఎన్నడూ గురికాకుండా వివేకం కనబరచారు. చమత్కారం తన కున్న బలమైన అంశం కాదని ఆయనకు తెలుసు. ఇటీవలి సరిహద్దు కాల్పుల ఘటనలో ఐదుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమస్యతో ఆయన వ్యవహరించిన తీరుపై వెల్లువెత్తిన వ్యంగ్యోక్తుల శతఘ్ని గుళ్ల జడివానకు ఆయన కొంచెం బిత్తరపోయారు. అలాంటి హాస్యం గుర్తుండిపోతుంది. ‘పాకిస్థాన్‌కు ఏకే-47, ఏకే ఆంటోనీ అనే రెండు ఆయుధాలున్నాయి’ అని ఓటరు గుర్తుంచుకుంటాడు.
ప్రధాని మన్మోహన్‌సింగ్, సోనియాగాంధీలపై వెల్లువెత్తే చతురోక్తులు మరింత కరకైనవనే విషయం ఆంటోనీకి ఏమైనా ఊరట కలిగిస్తుందేమో. మరో సార్వత్రిక ఎన్నికల దిశగా మనం వడివడిగా సాగుతుండగా... హేళనకు గురి కావడమే తనకు ఉన్న అతి పెద్ద సమస్య అని కాంగ్రెస్ గుర్తించాల్సిరావొచ్చు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేదాన్ని ఇప్పుడిక పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం అతి సుదీర్ఘంగా సాగుతున్న నాటకంలోని చరమాంకంలో ఉన్నాం. ఈ ప్రభుత్వపు జీవితకాలం ముగిసిపోయింది. మరణశయ్యపై ఉండి పునరుత్థానం గురించి కలలు కనడం వ్యర్థం. ఈ ఐదేళ్లలో చాలా భాగం ప్రభుత్వ విధానాలు బురద గుంటలో పడి కనబడకుండా పోయాయి. నినాదాలకు తోడ్పడే విధంగా ఇప్పుడు నిర్ణయాలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్‌కు నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై చిత్తశుద్ది ఉండివుంటే మూడేళ్ల క్రితమే ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి ఉండేది. ప్రతికూల స్పందనలను గ్రహించి, ప్రత్యేక రాష్ట్రం నిర్ణయం వల్ల ప్రయోజనాలను చూపించి స్పందించడానికి దానికి ఈ మూడేళ్లకాలం ఉపయోగపడేది. ఇప్పుడు తెలంగాణను ప్రకటించడమంటే ‘కిరాయి’ కోసం చేసిన పనే. ఈ వాతావరణం వల్ల వచ్చిపడే ఓట్లను నొల్లుకోవాలని తీసుకున్న నిర్ణయమే. తెలంగాణ ప్రకటనకు అది ఎంచుకున్న సమయాన్ని నిర్ణయించింది ప్రజా ప్రయోజనం కాదు, పార్టీకి జరిగే మేలే.
కానీ రాజకీయాలంటే సందర్శకుల గదిలో ఆడే ఆట కాదు. ఆ గది ఢిల్లీలోని సుందర, సువిశాలమైన బంగ్లాయే అయినాగానీ రాజకీయాలంటే ఆట కాదు. తెలంగాణ నిర్ణయం ఇంతవరకు సాధించినదల్లా కాంగ్రెస్‌ను రెండు ముక్కలు చేయడమే, ఆంధ్రా వీధుల్లో ఆగ్రహం వెల్లువెత్తేలా చేయడమే, మరిన్ని ప్రత్యేకవాద ఉద్యమాలను ప్రేరేపించడమే. తెలంగాణ వివాదం హైదరాబాద్ వివాదాన్ని సృష్టించింది. హైదరాబాద్ వివాదం కూడా తెలంగాణ వివాదం అంతే దీర్ఘకాలికమైనది. కాంగ్రెస్‌కు అటూ ఇటూ కూడా గెలుపే అనే పరిస్థితి ఏర్పడటానికి బదులు అటూ ఇటూ కూడా ఓటమే అనే పరిస్థితి ఏర్పడింది.
ఆహార భద్రతా చట్టం విషయంలోనూ అదే జరి గింది. దాన్ని అమలు చేస్తే ఆ ప్రాజెక్టులోని లోటుపాట్లు ఎక్కడ భయటపడతాయోనన్న భయం తప్పిస్తే... యూపీఏ తన రెండో దఫా పాలనలోని తొలి ఆరు నెలల్లో ఆ బిల్లును ఆమోదింపజేసుకోకుండా అడ్డగించింది ఏదీ లేదు. కాంగ్రెస్ ప్రచార మాంత్రికులు మాత్రం అది 1971లో ఇందిరాగాంధీ సృష్టించినలాంటి అద్భుతాన్ని సృష్టిస్తుందని ఇంకా నమ్ముతున్నారు. ‘వాళ్లు (ప్రత్యర్థులు) ఇందిరాగాంధీని తొలగించండి అంటున్నారు. నేను పేదరికాన్ని తొలగించండి (గరీబీ హఠావో) అంటున్నాను’ అనే సరళమైన ప్రతిపాదనతో ఇందిరాగాంధీ ఆ ఏడాది బ్రహ్మండమైన విజయం సాధించారు.
ఒక వాగ్దానానికి ఎంత విశ్వసనీయత ఉంటే అది అంతే ప్రభావశీలమైనది అవుతుంది. ఇందిరాగాంధీ కుటుంబ అవినీతిని కూడా పరిగణనలోకి తీసుకున్నా, 1971లో ఆమెను అవినీతి కంపు ఆవరించి లేదు. భారతీయ తరహా సోషలిజంతో ఆమె తమ బాధలను అంతం చేస్తుందని పేదలు విశ్వసించారు. కోరి ముప్పును తెచ్చుకోవాలనుకుంటే తప్ప, ఆనాడు ఎవరూ ఇందిరాగాంధీని చూసిగానీ, కనీసం ఆమె రక్షణ మంత్రిని చూసిగానీ ఎవరూ నవ్వలేదు. 1971 నుంచి కాంగ్రెస్ మూడు దశాబ్దాలపాటూ అధికారం నెరపింది. అది కూడా వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ లేదా ఇందర్ కుమార్ గుజ్రాల్‌ల లాగా హఠాత్తుగా ఊడిపడ్డట్టుగా గాక, నిలకడగానే అధికారంలో ఉంది. నాటి ఇందిరాగాంధీ వాగ్దానం నేటికీ కలే.
ప్రతి ఎన్నిక భవిష్యత్తుకు తెరుచుకునే మరో ద్వారం. గతానికి దొడ్డి తలుపు మాత్రం కాదు. మనకు వారసత్వం గా సంక్రమించిన సమస్యలను మనం పరిష్కరించక తప్ప దు. వాటిలో అతి ముఖ్యమైనది పేదరికమే. ఆ సమస్య పరిష్కారానికి పెద్ద గంతుల ద్వారా సాగే ప్రగతిశీల మార్పునకు దారితీసే ఆర్థిక కార్యక్రమం అవసరం. అంతేగానీ జనాకర్షక పథకాలు పరిష్కారం కాదు. యూపీఏకు మరో ఐదేళ్ల గడువు ఇస్తే అది ఒక నూతన భారతదేశాన్ని సృష్టిస్తుందని 2009లో ఓటర్లు నమ్మారు. కాబట్టే దానికి మంచి గెలుపును కట్టబెట్టారు. ఐదేళ్లు గడిచిపోయాయి. తీరా చూస్తే మనం ఊహించుకున్న నవ భారతం గతం మడతల్లోకి జారిపోగా... అదే పాత భారతదేశం వైపు మనం కళ్లప్పగించి చూస్తున్నాం. ఈ శతాబ్దపు మొదటి దశాబ్దంలో వెల్లివిరిసిన ఆశావాదానికి బదులుగా నిరాశావాదం అనే రుగ్మతతో మధ్యతరగతి కుంగిపోతోంది.
అవినీతి అనే దుష్టశక్తి నేటి రాజకీయ వ్యంగ్యపు చీకటి పార్శ్వం. ఎన్నికల సమస్యగా అవినీతికి ప్రాధాన్యం తగ్గిపోయిందనే సిద్ధాంతాన్ని అధికార వ్యవస్థలోని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. అదో భ్రమ. రాజకీయవేత్తలంతా అవినీతిపరులే కాబట్టి నేటి వారి దొంగతనాన్ని మన్నించేయాలన్న వాదనతో ఓటర్లను వంచించలేరు. న్యాయమూర్తుల బృందం బోనులో ఉన్న ఒక్క వ్యక్తిని మాత్రమే శిక్షించగలుగుతుంది. నేటి ప్రభుత్వం తదుపరి ఎన్నికల న్యాయస్థానంలో విచారణకు నిలుస్తుంది.
చతురోక్తులే ఆ న్యాయస్థానంలోని సాక్ష్యాధారాలు, వాదనలు. ఓటరు ఆ న్యాయస్థానంలో న్యాయవాది, న్యాయమూర్తి కూడా. బోనులో ఉన్న వారికి ఓ శుభవార్త కూడా ఉంది. గరిష్ట శిక్ష ఐదేళ్ల రాజకీయ వనవాసం మాత్రమే. వచ్చే ఐదేళ్లు కూడా గత ఐదేళ్లంత త్వరగానే గడిచిపోతాయి.
- ఎం.జె.అక్బర్
సీనియర్ సంపాదకులు