తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్లపై మరోసారి నిప్పులు చెరిగారు. ఒక వైపు రూపాయి విలువ పడిపోతుంటే లక్ష ముప్పై వేల కోట్లతో ఆహార భద్రత బిల్లు తీసుకువచ్చిన అజ్ఞానులు ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియాగాంధీలని ఆయన ఆరోపించారు. దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ దారుణంగా విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు చేపట్టిన ఆత్మగౌరవ యాత్రలో భాగంగా కృష్ణాజిల్లాలోని పోరంపల్లిలో ఏర్పాటు చేసిన మహిళ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.
సోనియా గాంధీ కనీసం చదువుకోలేదని చంద్రబాబు తెలిపారు. సోనియా ఏదో చిన్న ఉద్యోగం కోసం ఇంగ్లీష్, ఫ్రెంచ్ నేర్చుకుందని ఆయన గుర్తు చేశారు. అలాంటి సోనియా నేడు మన దేశంలో చక్రం తిప్పుతుందని ఆయన ఎద్దేవా చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న హయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ - గవర్నన్స్ ప్రవేశపెట్టాన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే అప్పటి యూఎస్ అధ్యక్షుడు బిల్లు క్లింటన్ ఆంధ్రప్రదేశ్కు వచ్చారన్నారు.