దేశానికి పట్టిన శని కాంగ్రెస్: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: దేశానికి పట్టిన పెద్ద శని కాంగ్రెస్ పార్టీ అని, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, ఇతర కేంద్రమంత్రులు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేతిలో కీలుబొమ్మలుగా మారారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం రెండు విడతలుగా అధికారంలో కొనసాగుతున్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. గతంలో ఎన్‌డీఏ హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వల్ల కలిగిన లబ్ధిని ఈ ప్రభుత్వం ఉపయోగించుకుందని వ్యాఖ్యానించారు. టీడీపీపై కక్షతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. చంద్రబాబు గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎప్పటిలాగానే ‘సాక్షి’ ప్రతినిధులకు ఈ సమావేశానికి ఆహ్వానం లేకపోవటంతో.. ఆయన ఏం చెప్పారనే సమాచారాన్ని వివిధ మార్గాల నుంచి సేకరించి వార్తగా ఇవ్వటం జరిగింది.
చిల్లర వ ర్తక రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత నష్టపోతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థపై ప్రపంచంలో ఎవరికీ నమ్మకం లేకుండా పోయిందని విమర్శించారు. బొగ్గు కుంభకోణంలో పాత్రధారులు తాము ఎక్కడ శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భ యంతోనే ఫైళ్లన్నింటినీ తగలబెట్టారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆహారభద్రత బిల్లు వల్ల సామాన్యులకు ఎలాంటి ఉపయోగం లేదని.. ఎన్నికలకు ముందు ఇటువంటి పథకాలను కేవలం ఓట్ల కోసమే ప్రారంభిస్తారని బాబు వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి దిగజారిపోయిందని.. ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో అందోళనలు జరుగుతున్నాయని.. తాను అధికారంలో ఉన్న సమయంలో ప్రజలు రోడ్లపైకి వచ్చిన సందర్భాలు లేవని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బతీసేందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చిందని.. కాంగ్రెస్‌తో వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. విభజనకు టీడీపీయే కారణమని వైఎస్సార్ సీపీ నేతలు చెప్పటాన్ని ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు గుంటూరు జిల్లా నుంచి తెలుగు ఆత్మగౌరవ యాత్రను ప్రారంభించనున్నట్లు చెప్పారు.
బాబూ... ఈ ప్రశ్నలకు బదులివ్వగలరా?
ఈ విలేకరుల సమావేశానికి సాక్షి ప్రతినిధిని అనుమతించలేదు. ఒకవేళ అనుమతించి ఉంటే ఈ కింది ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేది. చిల్లర వర్తక రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నష్టపోతుందని చెప్తున్న మీరు.. ఈ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ సందర్భంగా మీ పార్టీ ఎంపీలు గైర్హాజరు అయ్యేలా చేసి బిల్లు ఆమోదానికి ఎందుకు సహకరించారు?
మీరు సీఎంగా ఉన్న సమయంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయలేదని చెప్పటం పచ్చి అవాస్తవం కాదా?
విద్యుత్ చార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా దీర్ఘకాలిక ఉద్యమం జరిగింది మీ హయాంలోనే కదా? ఉద్యమంలో భాగంగా కాంగ్రెస్, వామపక్షాలు ఉమ్మడిగా నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమంపై కాల్పులు జరిపి ముగ్గురిని బలిగొన్నది మీ ప్రభుత్వం కాదా?
గిట్టుబాటు ధర కోసం ఆందోళనకు దిగిన రైతులపై పశ్చిమగోదావరి జిల్లా కాల్దరిలో కాల్పులు జరిపింది మీ ప్రభుత్వం అవునా, కాదా?
తమ సమస్యలను పరిష్కరించాలని ఇందిరాపార్క్ వద్ద ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, వర్కర్లను గుర్రాలతో తొక్కించి, లాఠీలతో గొడ్లను బాదినట్లు చితక బాదింది ఎవరి హయాంలో?
ఉప్పు పండించే రైతులపై ప్రకాశం జిల్లా చినగంజాంలో కాల్పులు జరిపినపుడు అధికారంలో ఉంది ఎవరు?
కరెంటు బిల్లులు చెల్లించలేదని రైతాంగాన్ని అరెస్టు చేయటంతో పాటు కాళ్లకు బేడీలు వేసి పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించింది మీ హయాంలో కాదా?
2001లో ఆర్‌టీసీ కార్మికులు 24 రోజుల పాటు సమ్మెచేసి రవాణా స్తంభించిపోయినప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్‌ఈబీ)ని సంస్కరణల పేరుతో ట్రాన్స్‌కో, జెన్‌కోలుగా విభజించాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా 1997 ఆగస్టు నుంచి 1998 వరకు ఏడాది కాలం పాటు విద్యుత్ శాఖలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినపుడు అధికారంలో ఉన్నది ఎవరు? అప్పుడు 1104 యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఎన్నడూ లేని విధంగా ఐదు రోజుల పాటు సమ్మెకు కూడా వెళ్లారు కదా. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు?