కాంగ్రెస్ భూస్థాపితమే లక్ష్యం: చంద్రబాబునాయుడు
సాక్షి, గుంటూరు: తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టిన కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో, రాష్ట్రంలోనూ భూస్థాపిత ం చేస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించేదాకా నిద్రపోనని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ దొంగలు పడ్డారని, లక్షల కోట్లరూపాయలు ఇటలీకి తరలిపోతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు ‘ఆత్మగౌరవ యాత్ర’ గురువారం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని మోతడక గ్రామం నుంచి ప్రారంభమయ్యింది. అంతకుముందు తాను బసచేసిన చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో గురుపూజోత్సవంలో పాల్గొన్న చంద్రబాబు కాసేపు అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. నిడుముక్కల, తాడికొండ అడ్డరోడ్డు, రావెలలో ప్రసంగించారు. రాష్ట్ర విభజన జరిగితే తాము ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలంటూ విద్యార్థులు ఆయన్ను నిలదీశారు.
తమ భవిష్యత్ ఏంటంటూ ప్రశ్నించారు. సాగునీరు, ఉద్యోగాలు, చదువు, ఆదాయం వంటి సమస్యల్ని పరిష్కరించకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించనని చంద్రబాబు అన్నారు. టీడీపీ విజన్ 2020ని కాంగ్రెస్ నేతలు విజన్ 420గా మార్చారని విమర్శించారు. తాను ఆడపిల్లలకు 33 శాతం రిజర్వేషన్‌తో కాలేజీల్లో సీట్లు ఇప్పించి చదివించి ఉద్యోగాలు ఇప్పించానన్నారు. ఆడపిల్లను కట్నం అడగని సామాజిక మార్పును తానే తెచ్చినట్లు చెప్పుకున్నారు. రైతుల్ని రుణాల రికవరీ పేరుతో ఒత్తిడి చేస్తే ఊరుకునే ప్రసక్తేలేదన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి వంటి అసమర్థ పరిపాలకుడిని ఇంతకుముందు చూడలేదన్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స ఓ ఉత్సవ విగ్రహమని ఎద్దేవా చేశారు. తమ చేతగానితనంతో వీళ్లు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. బొగ్గు ఫైళ్ల మాయాన్ని ప్రస్తావిస్తూ ఫైళ్లను దాచలేని అసమర్థ ప్రధాని మన్మోహన్ విదేశీ దొంగలకు తాళాలిచ్చే తోలుబొమ్మగా మారారని విమర్శించారు.
యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ తన కొడుకు రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, సాక్షి పత్రికపై తన అక్కసు వెళ్లగక్కారు. బాబు యాత్రలో ఆద్యంతం వ్యక్తిగత భద్రతా సిబ్బంది, సాయుధ పోలీసు బలగాల హడావుడి ఎక్కువగా ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమాలను పట్టించుకోకుండా, పూర్తిగా రైతులు పొలంపనుల్లో బిజీగా ఉన్న ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని యాత్ర కొనసాగుతోంది. మోతడక నుంచి నిడుముక్కల, తాడికొండ అడ్డరోడ్డు, పొన్నెకల్లు, బేజాత్పురం, పాములపాడు, రావెల, మందపాడు, బండారుపల్లి, గరికపాడు మీదుగా తాడికొండకు చేరుకున్న చంద్రబాబు అక్కడ రాత్రి బసకు ఆగారు.