అరుదైన వ్యక్తిత్వం... రాజీపడని తత్వం
కాలాన్ని నడిపించే వారి కోసమే కాలాలు ఎదురుచూస్తాయి. కాలం అంచుమీద నడుచు కుంటూ పోవటం అందరూ చేసే పనైతే... కాలం కత్తుల వంతెనపైన నడుస్తూ దాన్ని విముక్తి చేసే వారు కొందరుంటారు. అలాం టివారిలో ఆకుల భూమయ్య ఒకరు. వర్గ పోరు దృష్టి నుంచి ఎగిసిన ఉద్యమాలు ఈ తెలంగాణ నేల మీద నుంచే వచ్చాయి. ఇక్కడ పురుడుపోసుకున్న ఆ ఉద్యమాలు వర్గపోరు దారులను విస్తరించుకుంటూ ముం దుకుసాగాయి. ఆ దారినే సాగిన అనేక ఉద్య మాలు చరిత్రను మలుపుతిప్పటంలో కీలక భూమిక పోషించాయి. ప్రపంచీకరణ నేప థ్యంలో ఇక ఉద్యమాలకూ, పోరాటాలకు స్థానమెక్కడుందని ప్రశ్నిస్తున్న కాలంలో ప్రజా ఉద్యమాలకూ, ప్రజా పోరాటాలకూ పురుడు పోయటం అత్యంత కష్టమైన పని. ఆ కీలకమైన ఉద్యమ నిర్మాణ పనిని భుజానికె త్తుకున్న వ్యక్తి ఆకుల భూమయ్య. ఒక సాధా రణ ఉపాధ్యాయుడుగా పనిచేసే భూమయ్య తానెంచుకున్న తాత్త్విక నేపథ్యం నుంచే అసా ధారణమైన వ్యక్తిగా ఎదిగాడు. 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాలు పంచుకున్న వ్యక్తి... మలిదశ తెలం గాణ రాష్ట్ర సాధన ఉద్యమం మలుపు తిరగ టంలో కీలకపాత్ర పోషించాడు. మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానంలో ఆయన ఎదిగివచ్చాడు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయనకున్న నిబద్ధత, నిమగ్నతల వెనుక రాజకీయ భావజాలం ఏదైనా ఉండవచ్చును. కానీ మలిదశ తెలం గాణ ఉద్యమాన్ని పోరాట మలుపునకు తిప్ప టంలో భూమయ్య చేతులు ఉన్నాయి. ఆయన నమ్ముకున్న వర్గపోరు ఆలోచనతో తెలంగాణ ప్రజలందరికీ సంబంధం ఉండవ చ్చును లేక ఉండక పోవచ్చును. కానీ ప్రజా స్వామిక తెలంగాణను నిర్మించే విషయంలో భూమయ్య చేసిన నినాదానికి తెలంగాణలోని సబ్బండ వర్ణాలు గొంతుకలిపాయి.
వరంగల్ డిక్లరేషన్‌ను ప్రకటిస్తూ 15 ఏళ్ల క్రితమే తెలంగాణ రాష్ట్రం కావాలని, అది ప్రజా తెలంగాణ కావాలని నినదించటం అం దరివల్లా కాదు. ప్రజాస్వామిక తెలంగాణను ఆకాంక్షించటం, అందుకు అవసరమైన కార్యా చరణకు రూపకల్పన చేయడం కష్టమైన పని. ఆ పనికి భూమయ్య సిద్ధపడ్డాడు. తెలంగాణ రాష్ట్రం రావాలని అందరూ అంటున్నారు. కేంద్రం కూడా రాష్ట్ర ప్రకటన చేసింది. కానీ ఆ వచ్చే తెలంగాణ ఎలా ఉండాలన్న విషయం లో మాత్రం స్పష్టత ఉండాల్సి ఉంది. అది ప్రజాస్వామిక తెలంగాణ కావాలని దూర దృష్టితో నినదించినవాడు ఆకుల భూమయ్య. తెలం గాణ రాష్ట్రం వస్తే తిరిగి అందలమెక్కేది ఎవరన్నది ప్రశ్న. రాష్ట్రం వస్తే దళిత, బహు జన, గిరిజన, మైనారిటీలకు దక్కే వాటా ఎంత అన్నది కీలక ప్రశ్న. ఇంతమంది అమరులు చేసిన త్యాగాలు ఎవరి కోసం? ఎందుకోసం? అందుకే సామాజిక తెలంగాణ కావాలన్న నినాదం ముందుకు వచ్చింది.
తెలంగాణ రాష్ట్రం కోసం రెండు మార్గా ల్లో పోరాటం జరిగింది. ప్రజా ఉద్యమాల ద్వారా తెలంగాణ తేవాలన్నది ఒక వాద నైతే... రాజకీయ ప్రక్రియ ద్వారా దాన్ని సాధించగలమన్నది మరో వాదన. భూమ య్య మొదటి దారి ఎంచుకున్నారు. అది క్లిష్టమైనది. కష్టాలతో కూడుకుని ఉన్నది. అయినా, ఆయన ఆ దోవన నడవటం మాను కోలేదు. ఈ దారిలో ఆయన ఎన్నోసార్లు బెదిరింపులు ఎదుర్కొన్నారు. ఇబ్బందులకు లోనయ్యారు. ఎలాంటి కష్టాలు వచ్చినా నిబ్బరంతో అధిగమించారు. తాను నమ్మిన ఆశయాల సాధనకే కట్టుబడ్డారు. ఎన్నికల ప్రక్రియలోకి పిలవకున్నా అందరూ వస్తారు. పోరాట ప్రక్రియలోకి రావడం కష్టమైన విష యం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ముందుకు వచ్చిన తర్వాత ఎంతోమంది పోరాట రంగంలో ఉన్నవాళ్లు క్రమంగా రాజ కీయ ప్రక్రియ రంగంలోకి వెళ్లారు. కొందరు ప్రజా సంఘాల్లో ఉండిపోయారు. తెలంగాణ పునర్నిర్మాణం ఏవిధంగా ఉండాలో, అందు కోసం నిర్దిష్టంగా ఏంచేయాలో భూమయ్యకు అవగాహన ఉన్నది. అందుకే ‘ప్రజాస్వామిక తెలంగాణ’ అన్న పుస్తకాన్ని ముందుకు తీసుకువచ్చి దాన్ని ఆయనే ఆవిష్కరించారు. పుస్తకాన్ని ఆవిష్కరించి మరికొన్ని కొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకునే సమయంలోనే ఆయన రోడ్డు ప్రమాదంలో కన్ను మూశారు. అది విషాదకరమైనది. తెలంగాణ రాష్ట్రం వస్తే అధికారాన్ని ఎలా పంచుకోవాలని ఎవరి లెక్క లు వాళ్లు వేసుకునే సమయంలో ప్రజాస్వా మిక సామాజిక తెలంగాణను ఆకుల భూమ య్య కలగన్నాడు. ఆ కల సాకారం చేసేందుకు మరో పోరాటానికి రంగం సిద్ధం చేసుకునే పనిలో ఆయన మృత్యువాతపడ్డారు. ఆయన మరణం తెలంగాణకు తీరని లోటు. ఆకుల భూమయ్యకు నివాళులు అర్పించటమంటే ప్రజాస్వామిక తెలంగాణను నిర్మించే పనిలో కర్తవ్యోన్ముఖులు కావటమే అవుతుంది.
జూలూరు గౌరీశంకర్, అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక