అమరావతి అందరిది!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అంకురార్పణ జరిగింది. శనివారం భూమిపూజ నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ దసరా పర్వదినాన శంకు స్థాపన చేస్తారనీ, అప్పుడే నిర్మాణం ఆరంభం అవుతుందనీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అమరావతికి నామబలం, వాస్తుబలం కలసి వచ్చాయని కూడా చెప్పారు. నిజంగానే అమరావతి అద్భుతమైన పేరు. అయిదుకోట్లకు పైగా ప్రజలకు రాజధాని కాబోతున్న అమరావతి అందంగా, శీఘ్రంగా ఆవిష్కృతం కావాలని తెలుగువారంతా ఆకాంక్షిస్తారు. ఇటువంటి శుభసందర్భంలోనైనా అన్ని పక్షాలవారినీ, అన్ని వాదాలవారినీ కలుపుకొని పోయే ప్రయత్నం జరిగి ఉంటే బాగుండేది. ప్రభుత్వ ప్రతినిధులు, వారి బంధువులు మినహా తక్కిన వర్గాల ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయం.
కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ఆత్మబంధువుగా వచ్చి ఉంటారు. బహుశా భూమిపూజ కార్యక్రమం లాంఛనంగా జరిపి దసరానాడు పెద్ద స్థాయిలో చేయా లని అనుకొని ఉండవచ్చు. కానీ మొదటి నుంచీ రాజధాని నిర్మాణం విష యంలో ముఖ్యమంత్రి ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఎదుట ఉన్న అనేక సవాళ్ళలో రాజధాని నిర్మాణం ఒకటి. రాజధానికి అనువైన స్థలం ఏదో సూచించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్ నాయకత్వంలో అయిదుగురు సభ్యుల కమిటీని కేంద్ర హోంశాఖ నియమించింది. ఈ కమిటీ సభ్యులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ పర్యటించి నివేదిక సమర్పించారు. నివేదికను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వమూ కల్పించుకో లేదు. ఈ కమిటీ పర్యటిస్తున్న సమయంలోనే చంద్రబాబునాయుడు సింగపూర్ మిత్రులతో సమాలోచనలు సాగించారు.
దొనకొండ ప్రాంతంలో రాజధాని నిర్మించడం మంచిదనీ, అది అన్ని ప్రాం తాలకూ అందుబాటులో ఉంటుందనీ శివరామకృష్ణ కమిటీ సూచించింది. తన సూచనలను బుట్టదాఖలు చేయడం పట్ల నిరసన ప్రకటిస్తూ ఇటీవల ‘ది హిం దూ’లో ఒక వ్యాసం ప్రచురించారు. అనంతరం కొద్దిరోజులకే కన్నుమూశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాజధాని నిర్మించాలన్న చంద్రబాబు నాయుడు సంకల్పం వెనుక ఎవరున్నారో, ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో తెలి యదు. కానీ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించిన రాజకీయ పక్షం లేదు. 1953లో ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పుడే చాలామంది కాంగ్రెస్ నాయకులు విజయ వాడ రాజధానిగా ఉండాలని కోరుకున్నారు. కానీ అప్పటికే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ బోతోందనీ, హైదరాబాద్ రాజధాని కాబోతోందనీ భావించినవారు తాత్కాలిక రాజధానిగా కర్నూలులోనే డేరాలలో విడిది చేశారు. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత సొంత రాజధాని నిర్మించుకోవలసి రావడంతో విజయవాడను ఎంచు కోవడం సహజమే. ఇప్పటికే అభివృద్ధి చెందిన విజయవాడ, గుంటూరు పట్ట ణాలు కాకుండా మంగళగిరి ప్రాంతంలో కొత్త రాజధాని నగరాన్ని నిర్మించా లన్న నిర్ణయం ప్రభుత్వానిదే. అఖిలపక్షం ఏర్పాటు చేసి, సమాలోచనలు జరిపి తీసుకున్న నిర్ణయం కాదు. ఎవ్వరూ వ్యతిరేకించనంత మాత్రాన అందరూ ఆమోదించారని భావించనక్కరలేదు.
మతలబు ఏమిటి?
దొనకొండలో వద్దనుకుంటే, కృష్ణా జిల్లాలోనే కావాలనుకుంటే నూజివీడులో ప్రభుత్వ స్థలాలు వందల ఎకరాలలో ఉన్నాయి. మూడు పంటలు పండే సార వంతమైన భూములను సమీకరణ(పూలింగ్)ద్వారానో, సేకరణ (ఎక్విజిషన్) ద్వారానో తీసివేసుకోవడం ఎందుకు? రైతులు గగ్గోలు పెడుతున్నా బలవం తంగా భూములు స్వాధీనం చేసుకోవడం వెనుక మతలబు ఏమిటి?
దీనికి సమాధానం చంద్రబాబునాయుడే చెప్పారు. అననుకూలమైన పరిస్థితులను అనుకూలంగా మార్చుకున్నామనీ, విన్-విన్ (ఉభయతారకం) పద్ధతిలో ఈ వ్యవహారం సాగిస్తున్నామనీ వివరించారు. ఆంధ్రప్రదేశ్ ద్రవ్య లోటు సుమారు రూ. 1,800 కోట్లు. కొత్త రాజధాని నిర్మించాలంటే హీనపక్షంలో 20 వేల కోట్ల రూపాయలు అవసరమని అంచనా. కేంద్ర ప్రభుత్వం ఇంత వరకూ ఇచ్చింది కేవలం రూ.1,500 కోట్లు. కట్టుకుంటూ పోతే తాము ఇచ్చు కుంటూ పోతామంటూ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నారు. ఇట్లా ఇచ్చుకుంటూ వస్తేనే పదిహేను సంవత్సరాల కిందట మొదటి ఎన్‌డీఏ ప్రభు త్వం హయాంలో ఏర్పడిన ఛత్తీస్‌గఢ్‌కు కొత్త రాజధాని నయారాయగఢ్ నిర్మా ణం ఇప్పటికీ అసంపూర్తిగానే ఉంది.
అందుకే కేంద్ర ప్రభుత్వ నిధుల మీద ఆధారపడటం అనవసరమని చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నారు. తెలుగు సమాజానికి బాగా తెలిసిన మేధావి త్రిపురనేని హనుమాన్‌చౌదరి ఒక టీవీ గోష్ఠిలో నాతో చెప్పిన సూత్రం ఏమిటంటే మన దగ్గర డబ్బు లేనప్పుడు 5 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని జీఎంఆర్‌కో, జీవీకేకో ఇచ్చేస్తే రాజధానికి అవసరమైన అసెంబ్లీ, కౌన్సిల్, హైకోర్టు, మంత్రుల, ఎంఎల్‌ఏల క్వార్టర్లూ, ఇతర హంగులన్నీ రెండున్నర వేల ఎకరాలలో నిర్మించి ఇస్తారు. తక్కిన రెండు న్నర వేల ఎకరాలను వారు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వినియోగించుకుంటారు.
ప్రభుత్వం నయాపైసా ఇవ్వక్కరలేదు. నిధులు లేకుండా రాజధాని నిర్మించడం ఎట్లాగో ఆయన వివరంగా చెప్పారు. బహుశా చంద్రబాబునాయు డికి కూడా ఆయన చెప్పి ఉంటారు. ఆయన కాకపోయినా రియల్ ఎస్టేట్ అను భవం కలిగినవారు ముఖ్యమంత్రి సన్నిహితులలో చాలామంది ఉన్నారు. ఎవరు చెప్పినప్పటికీ, ముఖ్యమంత్రి ఈ సూత్రాన్ని బాగా విస్తరించారు. ప్రభు త్వమే ఎందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకూడదని తలపోశారు. అయిదు వేలు కాదు యాభైవేలు కావాలని అన్నారు. రైతులు అమ్మడానికి సిద్ధపడినా కొనడానికి కూడా నిధులు అవసరం కనుక అమ్మడం, కొనడం కాకుండా రైతు లను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వాములను చేయాలన్న ఆలోచనను ఆయన ఏకపక్షంగా అమలు చేయడం ప్రారంభించారు. రైతులు ఇప్పుడు భూములను ప్రభుత్వానికి అప్పగిస్తే అభివృద్ధి చెందిన భూమిలో ఎకరానికి వేయి గజాలూ, వాణిజ్య భూమిలో రెండు వందల గజాలు ప్రభుత్వం సమీప భవిష్యత్తులో ఇస్తుందనీ, ప్రతి రైతూ కోటీశ్వరుడు అవుతాడనీ వివరించారు.
ఈ కలను రైతులకు అమ్మడానికి జీవీకే, జీఎమ్మార్‌ల స్థాయి సరిపోదని భావించి సింగపూర్, జపాన్, చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాల భాగస్వామ్యం ఉండా లని నిర్ణయించారు. సింగపూర్ కంటే అందంగా ‘అమరావతిని నిర్మిస్తానంటూ సింగపూర్ కన్సల్టెంట్లు చెప్పినప్పుడు నా హృదయం సంతోషంతో ఉప్పొం గింది’ అంటూ చంద్రబాబునాయుడు భూమిపూజ అనంతరం అన్నప్పుడు చాలా మందికి విస్మయం కలిగి ఉంటుంది. కన్సల్టెంట్లు కస్టమర్స్‌ని ఆనందింప జేయడానికి ఏమైనా చెబుతారు. అందుకు భారీ ఫీజు కూడా తీసుకుంటారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందినవారు అమెరికాలో, యూరప్‌లో లక్షలాది మంది ఉంటున్నారు. వారిలో చాలా మంది అనేక రంగాలలో ఆగ్రశ్రేణి ప్రవీణు లుగా చలామణి అవుతున్నారు.
అనేక నిర్మాణ సంస్థలలో సలహాదారులుగా ఉన్నారు. జీఎమ్మార్, జీవీకే వంటి తెలుగువారి కంపెనీలు ఢిల్లీలో, ముంబైలో విమానాశ్రయాలు నిర్మించాయి. హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయం ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించింది. అంతర్జాతీయ స్థాయిలో మెప్పించ గలిగిన ప్రావీణ్యం కలిగిన కంపెనీలూ, ఆర్కిటెక్టులూ, ఇంజనీర్లూ ఇంతమంది ఉండగా సింగపూర్‌ను ఆశ్రయించడంలోని ఔచిత్యం ఏమిటో చంద్రబాబు నాయుడు ఇంతవరకూ ప్రజలకు వివరించనేలేదు. ప్రజలకు చెప్పవలసిన బాధ్యత లేదని ఆయన భావిస్తూ ఉండవచ్చు. సింగపూరు ప్రైవేటు కంపెనీ అధికారులను ‘హిజ్ ఎక్సెలెన్సీ’ అంటూ ముఖ్యమంత్రి మన వాళ్ళకు పరి చయం చేస్తున్నారంటూ మీడియా ప్రతినిధులు కథలుగా చెప్పుకుంటున్నారు.
విదేశీ వ్యామోహం
విదేశాలలో పర్యటించడం, విదేశీ కంపెనీల అధినేతలను కలుసుకోవడం, రాష్ట్ర ప్రయోజనాల కోసం విదేశీయులతో సంబంధాలు పెట్టుకోవడం మంచిదే. నరేంద్రమోదీ సైతం గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక దేశా లు సందర్శించి అక్కడి అభివృద్ధి నమూనాలను పరిశీలించేవారు. తనను కూడా ప్రపంచం అంతా తిరిగి అన్ని నగరాలూ చూసి మంచి రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయవలసిందిగా మోదీ తనకు చెప్పారనీ, రాజ ధాని నిర్మాణానికి అయ్యే ఖర్చంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కూడా తిరు పతి సభలో వాగ్దానం చేశారనీ చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. దావోస్‌కు క్రమంతప్పకుండా ప్రతి సంవత్సరం సందర్శిస్తారనీ, ఆర్థిక సంస్కరణలకూ, మార్కెట్ ఎకానమీకీ అనుకూలంగా మాట్లాడతారనీ ‘ఎకనమిస్ట్’ వంటి ప్రతిష్ఠా త్మకమైన పత్రికలు చంద్రబాబునాయుడిని ప్రశంసించిన సందర్భాలు ఉన్నా యి. దావోస్ సమాలోచనలలో పాల్గొనే దేశాధినేతలు ఎవ్వరూ రాజధాని నిర్మా ణం కోసం సింగపూర్ వంటి చిన్న నగరరాజ్యంపైన ఆధారపడరు.
అన్నిటినీ అవుట్ సోర్స్ చేయడం, కన్సల్టెన్సీలను మేపడం చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి అలవాటే. తన విజన్-2020 తయారు చేయడానికి సైతం విదేశీ కన్సల్టెంట్లనే పురమాయించారు. తెలుగువారి ఆత్మగౌరవం, ప్రతిభ పట్ల ఎన్‌టీ రామారావుకు ఆపారమైన విశ్వాసం ఉంటే చంద్రబాబునాయుడికి విదేశీయుల ప్రతిభ పట్ల నమ్మకం అధికం. తాను అనుకున్నది చేయడం, ఎవ్వ రినీ సంప్రతించకపోవడం కూడా చంద్రబాబునాయుడికి కొత్తగా అబ్బిన లక్షణం కాదు. విద్యుత్ రంగ సంస్కరణలు అమలుపరచినప్పుడు కూడా మంత్రివర్గ సహచరులతో సమాలోచనలు జరిపిన దాఖలా లేదు. తాను అను కున్న సంస్కరణలను సంపత్, కుట్టీ వంటి ఉన్నతాధికారుల సహకారంతో అమలు చేయడమే కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ సంస్కరణ అయినా ప్రజలకు వివరించి, వారి సహకారం పొందినప్పుడే జయప్రదంగా అమలు అవుతుందనే మౌలిక సూత్రాన్ని సైతం ఆయన పాటించలేదు.
ఇప్పుడు కూడా మంత్రివర్గంలో అందరితోనూ అన్ని విషయాలూ ముఖ్య మంత్రి మాట్లాడుతున్నారనే అభిప్రాయం ఎవ్వరికీ లేదు. తన చుట్టూ ఉన్న కూటమి, అందులోనూ నారాయణ, సుజనా చౌదరి, కుమారుడు లోకేశ్ వంటి కొద్ది మందితోనే ముఖ్యమంత్రి తన అభిప్రాయాలు పంచుకుంటారు. చంద్రబాబునాయుడు ఏడాది పాలన ఇటువంటి సంఘర్షణాత్మక వాతావ రణంలోనే గడిచింది. ఎన్నికలలో ఇచ్చిన హామీలను, ముఖ్యంగా రైతుల, డ్వాక్రా మహిళల రుణ మాఫీకి సంబంధించిన వాగ్దానాలను అమలు చేయడం లో దారుణంగా విఫలమైనారు. పైగా హామీలన్నీ సమైక్య రాష్ట్రంలో ఉంటామని భావించి ఇచ్చినవేనని అంటున్నారు. అమలు సాధ్యం కాదు కనుక విఫలం కావడం తథ్యం. అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపించడానికి సవర ణలూ, కోతలూ ప్రతిపాదించడంతో రైతులలో, మహిళలలో అసహనం పెరిగి పోతోంది. అయినా సరే తాను సంకల్పించినట్టు రాజధానికి అవసరానికంటే ఎక్కువ భూములను సమీకరించడం లేదా సేకరించడంలోనూ, పట్టిసీమకు నిధులు కేటాయించడంలోనూ పట్టుదలగానే వ్యవహరిస్తున్నారు.
విలక్షణ వ్యక్తిత్వం
చంద్రబాబునాయుడి వ్యక్తిత్వం ప్రత్యేకమైనది. ఆయనది పోటీ మనస్తత్వం. పరాజయాన్ని అంగీకరించరు. కిందపడినా తనదే పైచేయి అంటారు. ఒకరితో పోల్చుకొని వారికంటే తాను అధికుడినని అనుకుంటారు. ప్రజలు కూడా అను కోవాలని కోరుకుంటారు. ఈ పోలిక సంవత్సరానికి ఒకసారో, రెండు సంవత్స రాలకు ఒకసారో అయితే పర్వాలేదు. ప్రతినెలా, ప్రతివారం, ప్రతిరోజూ ఈ పోలిక ఉంటుంది. ప్రతిక్షణం తనదే పైచేయి కావాలనీ, తానే గెలవాలనీ తాప త్రయపడతారు. ఈ తత్త్వం కారణంగా అవసరంలేని సందర్భాలలో, అలవికాని రంగాలలో కూడా పోటీ పడతారు.
తెలంగాణలో ఒక ఎంఎల్‌సీ స్థానం గెలి చినా, ఓడినా తెలుగుదేశం పార్టీకి కానీ ఆంధ్రప్రదేశ్‌లో తన ప్రభుత్వానికి కానీ వచ్చే నష్టం లేదు, లాభం లేదు. కానీ ఇక్కడ ఒక సీటు ఏ విధంగానైనా గెలిచి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కంటే తాను అధికుడిననీ, ఎక్కువ రాజకీయ చాతుర్యం కలిగినవాడిననీ నిరూపించుకోవాలి. అందుకే రేవంత్‌రెడ్డి దుస్సాహసాన్ని అనుమతించడం. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో 15 స్థానాలు గెలుచుకుంది. చివరలో గెంతిన కూకట్‌పల్లి కృష్ణారావుతో సహా మొత్తం అయి దుగురు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో చేరిపోయారు. మిత్రపక్షమైన బీజేపీ సభ్యులను కలుపుకున్నప్పటికీ ఒక అభ్యర్థిని గెలిపించు కునే సంఖ్యా బలం లేదు. అటువంటప్పుడు ఒక అభ్యర్థిని నిలబెట్టడం, అతడిని గెలిపించడం కోసం అగచాట్లు పడటం ఎందుకు? కేవలం ఆధిక్య నిరూపణ కోసమే.
మొన్న జరిగిన శాసనమండలి ఎన్నికలలో గెలుపొందిన టీడీపీ అభ్యర్థు లలో పరిపాలనలో అనుభవం ఉన్నవారు కొందరు ఉన్నారు. ప్రతిభ ఉన్న శాస నసభ్యులకు స్థానం కల్పించి మంత్రివర్గం శక్తిసామర్థ్యాలను పెంపొందించుకో వడానికి ఈ సందర్భాన్ని వినియోగించుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా అనేక సమస్యలు మిగిలిపోయాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. వాటిని పరిష్కరించుకోవాలన్నా, రాష్ట్రంలో అభి వృద్ధి పనులు నిరాటంకంగా సాగాలన్నా ఏకపక్ష ఎజెండాకూ, సంఘర్షణాత్మక వైఖరికీ, అనవసరమైన పోటీతత్త్వానికీ స్వస్తి చెప్పి సామరస్యంగా, సమతు ల్యంగా, సమంజసంగా వ్యవహరిస్తే తెలుగు జాతికి మేలు జరుగుతుంది.
సాక్షి, ఎడిటోరియల్ డైరెక్టర్
- కె.రామచంద్రమూర్తి