నిజంగానే ‘ఊడ్చే’స్తారా?!
కేజ్రీవాల్ పోటీలో పైచేయికి అంచులలోనే తారట్లాడుతున్నారు. సంప్రదాయక పార్టీలు తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సామర్థ్యం ఉన్నదనే విశ్వాసాన్ని కలుగజేస్తున్నాయి. కాబట్టే వారికి అధికంగా మద్దతు లభిస్తోంది. అలా అని ప్రజా మద్దతు రేఖ అలాగే నిలిచి పోయేదేం కాదు. ఏదో ఒక వైపునకు అది మొగ్గక తప్పుదు. ఒక ప్రభుత్వంగా ఆమ్ ఆద్మీ పార్టీ బాగా పనిచేస్తుందో లేదో తెలీదు. కానీ ఢిల్లీకి కావాల్సిన శాసన సభా ప్రతిపక్షం మాత్రం అదే.
రాజధాని నగరమే జాతీయ రాజకీయ రంగస్థలిపై ప్రధాన నర్తకి కావడం అనివార్యం. లం డన్ మేయర్ లేదా ఢిల్లీ శాసన సభ ఎన్నికలకు పెద్ద రాష్ట్ర ఎన్నికలంతటి సంరంభం తప్పదు. లండన్ మేయర్ పదవిలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి విలువ కూడా అధికారం కొలబద్ధతో కొలవగలిగేది కాదు. కాబట్టే పెట్టుబడిదారునిగా బాగా రాణించిన బ్రిటన్ పెట్టుబడిదారుడు బోరిస్ జాన్సన్ తన జాతీయ రాజకీయ రంగ ప్రవేశానికి లండన్‌ను పునాదిగా చేసుకున్నారు. విస్తరించిన పెద్ద మునిసిపాలిటీ లాంటి ఢిల్లీ పీఠం కోసం షీలా దీక్షిత్ నేడు నాలుగోసారి పోటీ పడుతున్నారు. ఏ ప్రజాస్వామిక ప్రమాణాలతో చూసినా ఆమె తమ పార్టీకి ప్రధాని అభ్యర్థి కావలసింది. కానీ ఆమె కాంగ్రెస్ పార్టీ నేత. ఆ పార్టీలో ఆమెకు ఏ బాధ్యతలైనా లభిస్తాయి... నిజంగా లెక్కలోకి వచ్చే ఒక్క ప్రధాని పదవి తప్ప. అందుకే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామో అక్కడికి చేరాం.
అరవింద్ కేజ్రీవాల్ అవినీతిని తుడిచి పెట్టేసే పోరాటాన్ని లక్నోలోనో లేదా ముంబైలోనో చేపట్టివుంటే... ఈ యుద్ధంలో ఆయన ఒక అజ్ఞాత యోధునిగా మిగిలిపోయేవారు. ఢిల్లీలో ఈ పోరాటం చేపట్టారు కాబట్టే మీడియా ఆయన లక్ష్యానికి ఆవశ్యకమైన మంచి ఊపును ఇచ్చింది. కామన్‌వెల్త్ క్రీడలు మొదలుకొని అంతన్నదే లేకుండా కథలు కథలుగా వెల్లువెత్తుతున్న యూపీఏ మంత్రుల అవినీతికి ఢిల్లీ నగరం దిగ్భ్రాంతికి గురైంది. యాదృచ్ఛికంగా ఆ నగర వీధుల్లో పుట్టిన ఉద్యమం నుంచి కేజ్రీవాల్ ఆవిర్భవించారు. ఇతర మహా నగరాల్లాగానే ఢిల్లీ కూడా కిక్కిరిసిన పలు పట్టణ గ్రామాల బృహత్ సముదాయం. అక్కడి పౌరులు పాలక వర్గ ఉన్నత శ్రేణులకు భౌతికంగా అతి సమీపంగా నివసిస్తుంటారు.
ప్రపంచంలోనే అత్యం త విలాసవంతమైన బంగ్లాల ముందు నుంచి బస్సులో ప్రయాణించడానికి మించిన భాగ్యమెరుగని అభాగ్యులు వారు. ప్రజల ఓట్లను సంపాదించుకున్న అదృష్టానికి రాజకీయ నేతలు ఆ వైభోగాలను అనుభవిస్తుంటారు. మంత్రుల కాలం చెల్లిన జీవన శైలి విషయంలో ఢిల్లీకి సాటి రాగల ప్రజాస్వామ దేశ రాజధాని ప్రపంచంలోనే మరొకటి లేదు. అది చూస్తూ బస్సులో ఆఫీసులకు పోయే వారికి కడుపు మంట రగలక మానదు. వారు స్త్రీలే అయినా, పురుషులే అయినా ఏమీ చేయలేని వారి నిస్సహాయత మాత్రం అందుకు కారణం కాదు.
కేజ్రీవాల్ మరో అడుగు మందుకు వేయడానికి యత్నించగల దృఢ సంకల్పాన్ని చూపారు. తిరుగుబాటు నుంచి సంస్థాగత నిర్మాణానికి కష్టభరితమైన పరివర్తనను సాధించ గలిగారు. ఆయనకు ఇప్పుడు తెలిసి వస్తున్నట్టుగా సిద్ధాంతం నుంచి ఆచరణకు జరిగే మార్పు సులువైనదేమీ కాదు.
కేజ్రీవాల్ పుట్టిందే ఆగ్రహంలో. కాబట్టి ఆగ్రహంతో ఉన్నవారి ఓట్లను ఆయన కూడగట్టుకోగలుగుతారు. అయితే ఈ ఓటింగ్‌ను పరిష్కారం చూపే ఓటింగ్‌గా ఆయన మార్చగలరా? అరుపులు ముగిసిపోయి, యుద్ధం జరిగి గెలిచిన తర్వాత ఢిల్లీకి కావలసినది విద్యుత్ కంపెనీలను పారిపోయేట్టు చేయకుండానే చార్జీలను తగ్గించ డం, సుస్థిరమైన వాణిజ్యపరమైన అనుసంధానాలు తెగిపోకుండానే ఉల్లి ధరలను తగ్గించడం. కేజ్రీవాల్ కాస్త తక్కువ కర్కశంగా ఉంటే అది ఆయనకు తోడ్పడేదే. కానీ అది ఆయన నుంచి అతిగా ఆశించడమే అవుతుంది. ఆ కర్కశ స్వరంతోనే ఆయన ఇంత దూరం చేరారు. ఆయనకు అది అలవాటుగా మారిపోయింది.
‘చీపురు’ ఆగ్ర హాన్ని వ్యక్తం చేసే ఆయుధమే తప్ప పరిష్కారం కాదు. ఈసారి గెలిచినా ఓడినా, వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆయన ‘కలం’ గుర్తును ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆయనకు నేడు ఎదురవుతున్న ఇబ్బందుల ఒడిదుడుకులు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రజలు ఆయనను ఉన్నత ప్రమాణాల గీటురాయితోనే చూస్తారు, నిర్ణయిస్తారు. ఇతరుల నుంచి ఆయన అలాంటి ప్రమాణాలను ఆశించడమే బహుశా అందుకు కారణం కావొచ్చు. మూడో స్థానానికి, ఒకటో స్థానానికి మధ్య తేడాను నిర్ణయించేది ముస్లింలే. ముస్లిం లలో తగినంతగా పట్టు లభించడం లేదని కేజ్రీవాల్ పార్టీలో అంతర్గతంగా జరిపిన అభిప్రాయ సేకరణ చెప్పి ఉండాలి. సమీపంలోని ముల్లా దగ్గరికి ఆయన పరుగు పెట్టడానికి ఉన్న హేతుబద్ధమైన వివరణ అదే మరి. సంప్రదాయక ఓటు బ్యాంకు నిర్ణేతల దిశగా గంతు వేసి ఆయన తప్పుచేశారు. అందుకు బదులుగా ఆయన... అవి నీతి కుల, మతాలకు అతీతంగా పౌరులలో ప్రతి ఒక్కరికీ హానిని కలిగిస్తోందంటూ ముస్లిం యవతకే నేరుగా విజ్ఞప్తి చేసి ఉండాల్సింది. అయితే ఆ పని చేయడానికి ఆయనకు ఇంకా సమయం ఉంది.
కేజ్రీవాల్ తరచుగా మధ్య దళారులను విమర్శిస్తుండేవారు. మరి ఆయనకు ఎన్నికల ఒప్పందంలో వారి అవసరం ఎందుకు వచ్చినట్టు?
బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మూడింటిలో టికెట్ల పంపిణీలో గందరగోళం నెలకొంది. ఢిల్లీ ఎన్నికల్లో ఆ మూడు పక్షాలకు ఆవకాశాలు తెరుచుకునే ఉన్నాయని అది సూచిస్తోంది. బీజే పీ, కాంగ్రెస్‌లలో పైనుంచి కింది దాకా అంతా అసంతృప్తితో గుర్రుమంటున్నారు. కాగా ఆమ్ ఆద్మీలో పైనుంచి కింది వరకు విస్తరించిన పలు అంచెల నిర్మాణ వ్యవస్థ లేకపోవడమనే సమస్య కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అది ఏ ఉద్యమంలోనైనా ఉండేదే. ఆదర్శవాదం ప్రేరణతో వచ్చిన క్యాడర్‌లకు, గట్టి మద్దతుదార్లకు ఎన్నికలు పరమ అధ్వానంగానూ, మురికిగానూ ఉంటాయని తెలిసి వస్తోంది. ఆచరణాత్మక ప్రయోజనాల అన్వేషణలో ఆదర్శాలను త్యజించరాదని హేతుబద్ధంగా ఆ యువతకు వివరించడానికి తగినంత సమయం లేకపోవచ్చు.
కేజ్రీవాల్ పోటీలో పైచేయికి అంచులలోనే తారట్లాడుతున్నారు. కానీ సంప్రదాయక పార్టీలు తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సామర్థ్యం ఉన్నదనే విశ్వాసాన్ని ఎక్కువగా కలుగజేస్తున్నాయి. కాబట్టే వారికి అధికంగా మద్దతు లభిస్తోంది. అలా అని ప్రజా మద్దతు రేఖ అలాగే నిలిచి పోయేదేం కాదు. మూడు దిక్కుల్లో ఏదో ఒక వైపునకు అది మొగ్గక తప్పుదు.
విజయం భారీ లాభాలను పట్టుకొచ్చి అందిస్తుంది. వైఫల్యం రాజకీయ మరణ శిక్షను విధిస్తుంది. ప్రత్యేకించి నిలకడగా మనగలిగిన పార్టీ నిర్మాణం, విధేయులు లేని పార్టీకి అది తప్పదు. ఆమ్ ఆద్మీ పార్టీ గాలి బుడగ కంటే ఎక్కువ బలమైనదే. అయితే ఆది ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిస్తే తప్ప దానికి జవసత్వాలు సమకూరవు. ఒక ప్రభుత్వంగా ఆ పార్టీ బాగా పనిచేస్తుందో లేదో తెలీదు. కానీ ఢిల్లీకి కావాల్సిన శాసన సభా ప్రతిపక్షం మాత్రం అదే.