
ఎస్.కె. సింగ్- ఎం. ఎన్. రాయ్
మొన్నటి భారత గణతంత్ర దినోత్సవానికి చాలా కోణాల నుంచి ప్రాముఖ్యం ఉంది. ఈ పర్యాయం అమెరికా అధ్యక్షుడు (బరాక్ ఒబామా) తొలిసారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒబామా భారత్‌కు బయలుదేరే ముందే ఉగ్రవాద దాడుల గురించీ, పాకిస్తాన్ గడ్డ మీద విలసిల్లుతున్న ఉగ్రవాద శిక్షణ శిబిరాలను గురించీ ఆ దేశ పాలకులను గట్టిగా హెచ్చరించారు. అదే ఉత్సవంలో యుద్ధ సేవాపతకాన్ని అందుకున్న కల్నల్ మునీంద్రనాథ్ రాయ్ మరునాడే జమ్మూ- కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా, త్రాల్ ప్రాంతంలో హిజ్‌బుల్ ముజాహిదీన్ ఉగ్రవా దులు జరిపిన దాడిలో వీర మరణం పొందారు. ఆయనతో పాటు కశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ కానిస్టేబుల్ సంజీవ్ కుమార్ సింగ్ కూడా చనిపోయారు. ఈ ఘటనలన్నీ వరసగా మీడియాలో కీలకమైన శీర్షికలుగా వెలువడి అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఈ ఘటనలకు పతాక సన్నివేశం అన్నట్టు వెలువడిన వార్త ఒకటి భారతీయుల చేత కనుబొమలు ముడి వేయించింది.
ఉగ్రవాదులతో పోరాడుతూ చనిపోయిన రాయ్, సింగ్‌లది త్యాగమైతే, త్రాల్‌లో సైన్యంతో పోరాడుతూ చనిపోయిన ఆ ఇద్దరు హిజ్‌బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులది కూడా అందుకు తీసిపోదని వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా జిలానీ వ్యాఖ్యానించారు. చికిత్స కోసం ఢిల్లీలోని ఒక ఆస్ప త్రిలో ఉన్న జిలానీ, అక్కడి నుంచే ఈ మెయిల్ ద్వారా ఈ ప్రకటన ఇచ్చి అందరినీ విస్తుపోయేటట్టు చేశారు. ఎందుకంటే, కశ్మీర్ ఉగ్రవాదులకు, మతం పేరుతో రెచ్చిపోతున్న మూక లకు పాకిస్తాన్ అండదండలను ఇస్తున్న సంగతి ఎన్నోసార్లు రుజు వైంది. ఆ పాకిస్తాన్ కూడా తాను కశ్మీర్ స్వేచ్ఛ కోసం జరిపే పోరాటాన్ని సమర్థిస్తాననే చెప్పగలిగింది తప్ప, భారత సైన్యంతో బాహాబాహీ తలపడిన ఉగ్రవాదులను మృతవీరులంటూ వీరతాళ్లు ప్రకటించలేదు. ఆ పని జిలానీ చేశారు.
త్రాల్ ప్రాంతంలోని హందూర్ గ్రామంలో హిజ్‌బుల్ ముజాహిదీన్ ఉగ్ర వాదులు దాగి ఉన్నారని తెలిసి కల్నల్ రాయ్, ఆయన బృందం దాడికి వెళ్లారు. అక్కడే రాయ్, సింగ్‌లతో పాటు, ఇద్దరు ఉగ్రవాదులు కూడా చనిపోయారు. కల్నల్ రాయ్ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. ఆ రాష్ర్ట ప్రభుత్వం రాయ్ మృతికి సంతాపం ప్రకటించి, ముప్పయ్ లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటిం చింది. జాతీయ నాయకులు కూడా నివాళి ఘటించారు. సైనిక దళాల అధిపతి దల్బీర్‌సింగ్ సుహాగ్ సహా పలువురు సంతాపం ప్రకటించారు.
అధికార లాంఛనా లతో రాయ్ అంత్యక్రియలు జరిగాయి. రాయ్ కుటుంబ సభ్యులంతా సైన్యంలో పనిచేసినవారే. అదే సమయంలో, చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదుల కుటుంబాలను పరామ ర్శించడానికి జిలానీ ఆదేశం మేరకు ఒక బృందం వెళ్లింది. ఆ ఇద్దరు ఉగ్రవాదులు కశ్మీర్ యువకులే. ఇందులో ఒకరు రాష్ట్ర పోలీసు శాఖలో హెడ్ కానిస్టేబుల్ కుమా రుడు కావడం విశేషం. ఈ ఉగ్రవాది పినతండ్రి కూడా లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించినవాడే. మరొక సమీప బంధువు తుపాకీ కోసం ఒక పోలీసు కానిస్టేబుల్‌ను కత్తితో పొడిచిన కేసులో అరెస్టయినాడు. ఈ సందర్భంగా జిలానీ కశ్మీర్ యువత గురించి చేసిన వ్యాఖ్య కొత్తదే. ఇంతకాలం నిరుద్యో గం, పేదరికం, అవిద్యల వల్లే కశ్మీర్ యువత తుపాకీ పడుతు న్నారనీ, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారనీ వేర్పాటువాదులు, ఉగ్రవాద మద్దతుదారులు చెప్పినమాట నిజం. ఇప్పుడు జిలానీ చెప్పిన మాట ఇందుకు భిన్నంగా ఉంది. ‘కశ్మీర్ యువత హింసా మార్గంలో పయనిస్తున్నదంటే అందుకు కారణం, అది వారి అభిరుచి, లేదా నిరుద్యోగం కాదు. వారు కళాశాలల్లో, విశ్వవిద్యాలయాలలో చదువుకుంటున్నారు. వారికి చారిత్రక పరిస్థితులు తెలుసు. కశ్మీర్ విషాదం గురించి కూడా తెలుసు’ అని జిలానీ కొత్త భాష్యం చెప్పారు. ప్రతి ముజాహిద్ (యోధుడు) త్యాగం వ్యర్థం కాబోదని కూడా ఆయన అన్నారు.
కశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాగల దని అంతా ఎదురుచూస్తున్న తరుణంలో, ఒబామా పర్యటన తరువాత ఉపఖండంలో సమీ కరణలు మార బోతున్న సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో జిలానీ నోటి నుంచి ఈ విధమైన భాష్యం వెలువడడం చాలా ప్రశ్నలకు కారణమయ్యేదే.