బెస్ట్ సెల్లర్లకు పుట్టినిల్లు అమెరికా
బెస్ట్ సెల్లర్లకు పుట్టినిల్లు అమెరికా. పారిశ్రామిక విప్లవం తర్వాత ఫ్యాక్టరీ వుత్పత్తులను అతితక్కువ(షెల్ఫ్ టైమ్)లో అత్యధికంగా అమ్ముకోవడం ఒక కీలక వ్యాపార వ్యూహంగా మారింది. తొలిదశలో, ఇంగ్లండ్‌లో పెన్నీ నావెల్స్, అమెరికాలో సీసైడ్ రొమాన్సులు పుస్తక వ్యాపారంలో కీలక పాత్ర పోషించాయి. ఈ బెస్ట్ సెల్లింగ్, బ్లాక్ బస్టర్ నవలలకు పాపులర్ నవలలని ముద్దుపేరు. డికెన్స్, మార్క్ ట్వేన్ లాంటి వాళ్ల రచనలు బహుశా ప్రాచుర్యం పొందినవే. కానీ అవి బెస్ట్ సెల్లర్లు కావు. అవి వందేళ్లలో అమ్ముడుపోయినన్ని ప్రతులు ఈ పుస్తకాలు కొద్ది వారాల్లోనో, నెలల్లోనో అమ్ముడుపోయి, కొత్త బెస్ట్‌సెల్లర్లకు పుస్తకాల షాపుల్లో స్థానం కల్పిస్తాయి.
ఒక పుస్తకం బెస్ట్ కావడంలో రచనాసామర్థ్యం కన్నా మార్కెటింగ్ వ్యూహం, పబ్లిసిటీ ఎక్కువ ముఖ్యం. బెస్ట్ సెల్లర్ ఒక వ్యాపార వస్తువు. ఒక కమాడిటీ. సక్సెస్‌ఫుల్ కమర్షియల్ నావెలిస్ట్ ఆర్థర్ హేలీ (1920-2004) గురించి ఆయన భార్య షీలా యిలా చెప్పింది:
‘‘ఆర్థర్‌కు పుస్తకవ్యాపారం గురించి బాగా తెలుసు. ఏ కథావస్తువు ఎప్పుడు రాస్తే బాగా అమ్ముడుపోతుందో మొదట అధ్యయనం చేస్తాడు. కొన్నిసార్లు సర్వే చేస్తాడు. మొదట పబ్లిషర్లతో సమావేశమై కథావస్తువు నిర్ణయిస్తాడు. సినాప్సిస్ తర్వాత మళ్లీ పబ్లిషర్లు, మార్కెటింగ్ మేనేజర్లతో మీటింగులు. వాళ్ల సలహాలు, సూచనల మేరకు మార్పులు చేస్తాడు’’.
(ఆర్థర్ హేలీ రచనలు ‘రన్‌వే జీరో-ఎయిట్’, ‘హోటల్’, ‘ఎయిర్‌పోర్ట్’. ఆయన పుస్తకాలు సుమారు 17 కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి.)
ముక్తవరం పార్థసారథి,
9177618708