
కశ్మీర్ ప్యాకేజీ!
బిహార్ ఎన్నికలపై దేశమంతా దృష్టి నిలిపిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ-కశ్మీర్ కు రూ. 80,000 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు.
బిహార్ ఎన్నికల తుది దశ పోలింగ్...అదే రోజు ఎగ్జిట్ పోల్స్ హడావుడి...దానిపై చర్చోపచర్చలు... ఆ తర్వాత ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపు సందడిపై దేశమంతా దృష్టి నిలిపిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ-కశ్మీర్ పర్యటన ముగిసింది. శ్రీనగర్‌లో ఆయన ఒక బహిరంగ సభలో కూడా మాట్లాడారు. ఆ సందర్భంగా రాష్ట్రానికి రూ. 80,000 కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు.
‘ఇది ఇక్కడతో ముగిసేది కాదు...ప్రారంభం మాత్రమే’నని కూడా చెప్పి ఉత్సాహ పరచడానికి ప్రయత్నించారు. జమ్మూ-కశ్మీర్ చాలా తక్కువ వ్యవధిలోనే రెండుసార్లు వరద తాకిడికి లోనై అనేక ఇబ్బందుల్ని చవిచూసింది. నిరుడు సెప్టెంబర్‌లో, మొన్న ఏప్రిల్‌లో కుండపోతగా వర్షాలు, ఆపై నదులు, సరస్సులు ఉప్పొంగి శ్రీనగర్‌సహా పట్టణాలు, గ్రామాలు మునిగిపోయాయి. మొదటి వరదల్లో 200 మంది మృత్యు వాతపడ్డారు. రెండోసారి ఆ స్థాయిలో ప్రాణ నష్టం లేకపోవచ్చుగానీ లక్షలమంది ప్రజలు సర్వం కోల్పోయి చెప్పనలవికాని అగచాట్లు పడ్డారు. ఈ నేపథ్యంలోమోదీ పర్యటనపై ఆ రాష్ట్ర ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు.
జమ్మూ-కశ్మీర్ రాష్ట్రం నిత్యం సమస్యలతో సతమతమయ్యే ప్రాంతం. సరిహద్దు రాష్ట్రం కావడంవల్లా, పాకిస్తాన్ వైపునుంచి తరచుగా చొరబాట్లు ఉండటంవల్లా ఉద్రిక్తతలు అధికం. ఉపాధి కల్పనలో, మౌలిక సదుపాయాల్లో ఎంతో వెనకబడి ఉండటం యువతలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నది. పుష్కలంగా వనరులున్నా వాటిని వినియోగించుకోవడంలో నిస్సహాయంగా మిగలడంవల్ల ఆర్థికాభివృద్ధికి ఆ రాష్ట్రం ఆమడ దూరంలో ఉంటున్నది. పరస్పర విరుద్ధ అభిప్రాయాలున్న పీడీపీ, బీజేపీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పర్చినప్పుడు ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని అందరూ ఆశించారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు మెరుగైన పరిష్కారాన్ని అన్వేషించడం సాధ్యమవుతుందని భావించారు. జమ్మూలో అధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ... కశ్మీర్‌లో జనామోదం పొందిన పీడీపీలు సమష్టిగా రెండు ప్రాంతాల అభివృద్ధికీ కృషి చేస్తాయని విశ్వసించారు.
కానీ, ఆచరణలో అది సాధ్యమవుతున్న సూచనలు కనబడటం లేదు. వివిధ అంశాల్లో ఇద్దరూ భిన్న ధ్రువాలుగా వ్యవహరించడం, అందువల్ల తరచు పొరపొచ్చాలు ఏర్పడటం మామూలైంది. కశ్మీర్ వరదల్లో సర్వం కోల్పోయిన ప్రజల్ని ఆదుకోవడంలో కూడా ఇలాంటివి ఆటంకంగా మారాయా...లేక ప్రభుత్వ యంత్రాంగంలో సహజంగా ఉండే అలసత్వం కారణంగా ఆలస్యమైందా అన్నది ఎవరికీ తెలియదుగానీ సామాన్య పౌరులైతే ఈనాటికి కూడా సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో నరేంద్ర మోదీ ఆర్భాటంగా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. అంతేకాదు...దీన్ని త్వరగా వ్యయపరిచి మరింత సాయాన్ని అడిగే బాధ్యతను ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్‌పైనే ఉంచారు.
మోదీ ప్రకటించిన సాయం ఈ నేపథ్యంలో కశ్మీర్ ప్రజలకు మోదం కలిగించాలి. కానీ దాదాపు అందరూ పెదవి విరుస్తున్నారు. అందుకు కారణాలు న్నాయి. వరదల అనంతరం రాష్ట్రానికి సంభవించిన నష్టాన్ని ఏకరువు పెడుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ. 44,500 కోట్లు అర్థిస్తూ కేంద్రానికి అప్పట్లోనే ప్రతిపాదనలు పంపింది. దీన్ని ప్రత్యేక సాయంగా అందించాలని కోరింది. బాధిత కుటుంబాల సహాయ, పునరావాసాలకు ఈ సొమ్మును వినియోగించాల్సిన అవసరం ఉన్నదని వివరించింది. కానీ ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దిష్టమైన సమాధానం లభించలేదు. ఇప్పుడు మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలో కూడా అందుకు సంబంధించి ఎంత కేటాయించారో లేదు.
పైగా ఆ ప్యాకేజీ నిండా దాదాపు పూర్తి కావచ్చిన ప్రాజెక్టులూ, ఇంకా పనులు కొనసాగుతున్న ప్రాజెక్టులూ... ఉపాధి కల్పన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ సంస్థలు చేపట్టిన ప్రాజెక్టులూ గుదిగుచ్చి దాన్ని పెంచి చూపారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగేళ్లనాడు కేటాయించిన నిధుల్ని చూపడంవల్ల తమకు ఒరిగేదేమిటని కూడా అక్కడివారు ప్రశ్నిస్తున్నారు. మొన్న ఆగస్టులో బిహార్ ఎన్నికలు ప్రకటించడానికి ముందు ఆ రాష్ట్రానికి ప్రకటించిన లక్షా 65 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ విషయంలోనూ ఇలాంటి విమర్శలే తలెత్తిన సంగతిని ఇక్కడ ప్రస్తావించు కోవాలి. వరదల వల్ల కశ్మీర్‌కు కలిగిన నష్టం సామాన్యమైనది కాదు.
లక్షల ఇళ్లు కూలి పోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. కమ్యూనికేషన్ల సదుపాయాలు దెబ్బతిన్నాయి. సామాన్య జనం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వరదల సమయంలో మోదీ స్వయంగా ఆ ప్రాంతంలో పర్యటించి అక్కడి పరిస్థితిని చూశారు. అది జాతీయ విపత్తు అని కూడా ప్రకటించారు. అలాంటపుడు వరద సాయం అందించడంలో ఇంత జాప్యం చోటుచేసుకోవడం మాత్రమే కాదు...ఎప్పుడో ప్రకటించిన ప్రాజెక్టులన్నిటినీ చేర్చి భారీ మొత్తంలో సాయం అందిస్తున్నట్టు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
మోదీ జరిపిన పర్యటనకూ, గత ప్రధానులు జరిపిన పర్యటనలకూ మౌలికంగా తేడా ఉంది. వాజపేయి, పీవీ, మన్మోహన్ సింగ్‌లు వెళ్లినప్పుడల్లా జమ్మూ-కశ్మీర్ సమస్యకు రాజకీయ పరిష్కారం సాధించడానికి కృషి చేస్తామన్న హామీ ఇచ్చేవారు. అవి సాకారమయ్యాయా, లేదా అన్న సంగతలా ఉంచి కశ్మీర్ ప్రజలకు వాటివల్ల ఎంతో కొంత ఆశ పుట్టేది. ఏదో జరుగుతుందన్న భరోసా కలిగేది. మోదీ మాత్రం అందుకు భిన్నంగా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం....కేంద్రంనుంచి రాష్ట్రానికి అన్నివిధాలా సాయం అందుతుందన్న హామీ ఇవ్వడం తప్ప రాజకీయ పరిష్కారం గురించి మాట్లాడలేదు.
అయితే వాజపేయి కశ్మీర్ వెళ్లినప్పుడు ఇచ్చిన ‘ప్రజాస్వామ్యం-కశ్మీరీ ఆకాంక్షలు-మానవతావాదం’ అన్న నినాదాన్ని మోదీ గుర్తుచేశారు. నిజానికి ఈ అంశాల్లో ప్రత్యేక శ్రద్ధపెట్టి పరిష్కారానికి కృషి చేయగలిగితే అక్కడి ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం సులభమవుతుంది. జమ్మూ- కశ్మీర్ రూపురేఖలే మారిపోతాయి. గతంతో పోలిస్తే కశ్మీర్‌లో మిలిటెన్సీ తగ్గుముఖం పట్టింది. స్వల్పంగానైనా పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇలాంటి సమయంలో అక్కడి ప్రజలకు మరింత చేరువకావడం ఎలాగన్న అంశంపై దృష్టి సారించాలి. వారికి గతంలో లభించిన హామీలేమిటో, వాటిలో తక్షణం అమలు చేయదగ్గవి ఏమేమి ఉన్నాయో చూడాలి. రాగలకాలంలోనైనా ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ దృష్టి సారించాలి.