డార్జిలింగ్‌ కొండగాలి ఎటు? | Biswant saha writes on gurkhaland | Sakshi
Sakshi News home page

డార్జిలింగ్‌ కొండగాలి ఎటు?

Published Fri, Jul 7 2017 12:13 AM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

డార్జిలింగ్‌ కొండగాలి ఎటు?

డార్జిలింగ్‌ కొండగాలి ఎటు?

విశ్లేషణ
ప్రత్యేక గూర్ఖాలాండ్‌ను ఏర్పాటు చేయాలని కొండప్రాంత ప్రజలు నిర్ద్వంద్వంగా కోరుతున్నారు. కానీ ఏ ఒక్క జాతీయ పార్టీ ఇందుకు అనుకూలంగా లేదు. ఆఖరికి బీజేపీ కూడా ఇదే బాటలో నడుస్తున్నది. 2009 నుంచి 2014 వరకు జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో ఆ పార్టీ ఇచ్చిన ప్రతి ఎన్నికల ప్రణాళికలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించింది. గూర్ఖాలాండ్‌ గురించి తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ వాగ్దానం చేసింది. ఇప్పుడు జిల్లాలోని బీజేపీ శాఖలన్నీ జాతీయ నాయకత్వంపైన కాలు దువ్వుతున్నాయి.

డార్జిలింగ్‌ కొండ ప్రాంతవాసుల స్వయం పాలన ఆకాంక్ష ఈనాటిది కాదు. ఆ ఆకాంక్ష ఒక శతాబ్దానికి మించినది. ఇంకా చెప్పాలంటే స్వయం ప్రతిపత్తితో కూడిన పాలన కావాలంటూ వారు 1907 సంవత్సరానికి ముందు నుంచి కోరుతున్నారు. అసలు ఇలాంటి ఆకాంక్ష నెరవేరడంæగగన కుసుమమే. దానికి తోడు ఇప్పుడు ఆ కొండ ప్రాంతంలో జాతుల సంఖ్య పెరగడంతో సమస్య మరింత క్లిష్టంగా మారింది. ఇందుకు ఒక ఉదాహరణను చూపించవచ్చు. అక్కడ నివసిస్తున్న వారిలో నేపాలీ భాష మాట్లాడేవారు ఉన్నారు. వీరు భారత ‘ప్రధాన’ భూభాగానికి ప్రయాణిస్తూ ఉంటారు.

వీరిని తరచు ‘నేపాల్‌ నుంచి వచ్చిన నేపాలీ భాష మాట్లాడేవారు’ అని పేర్కొనడం జరుగుతోంది. అంటే వారి ఉనికి మీద ఒక ప్రశ్నార్థకాన్ని వేసి ఉంచారన్నమాట. ఇలా బయట నుంచి వచ్చినవారి వలసల వెల్లువ అంశం, ఇతర ప్రమాణాలు అక్కడ నివసిస్తున్నవారిలో స్వయం ఉనికికి సంబంధించిన ఆకాంక్షను పటిష్టం చేశాయి. డార్జిలింగ్‌లో ఉంటున్న ప్రజలు తమను గూర్ఖాలాండ్‌కు చెందిన గూర్ఖాలుగా గుర్తించాలని కోరుకుంటున్నారు.

అందుకే వారంతా గూర్ఖాలాండ్‌ రాష్ట్రాన్ని కోరుతున్నారు. డార్జిలింగ్‌ ప్రాంత చరిత్ర అంటే సిక్కిం, నేపాల్, భూటాన్, బెంగాల్, బ్రిటన్‌లతో సంబంధం ఉన్నది. అసలు డార్జిలింగ్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో వింటే వింతగా అనిపిస్తుంది. డోర్జి అంటే మెరుపులు. లింగ్‌ అంటే ప్రాంతం. అంటే మెరుపుల నేల. పేరుకు తగ్గట్టు ఇప్పుడే నిజంగానే అది ఉరుములు, మెరుపుల నేలగా అలరారుతోంది. ఇప్పుడు ఆ నేల మీదే ఉద్యమం ఉరుముతోంది.

వ్యూహాత్మక కొండప్రాంతం
ఈ కొండప్రాంతం చిరకాలం నుంచి వలసలతో వెల్లువెత్తుతూనే ఉంది. నిజానికి డార్జిలింగ్‌ సిక్కింకు చెందినది. నేపాల్‌కీ, సిక్కింకు మధ్య ఇది తటస్థ రాజ్యంగా కూడా ఉండేది. అయితే తరువాత ఇది గోర్ఖాలీ రాజ్యంలో (నేటి నేపాల్‌) విలీనం కావడానికి అంగీకరించింది. తరువాత బ్రిటిష్‌ ఇండియాలోకి మారింది. మళ్లీ దీనిని సిక్కింకు బదలాయించారు. అది కూడా 1835లో బ్రిటిష్‌ ప్రభుత్వానికి కానుకగా సమర్పించడానికే ఈ మార్పు జరిగింది. కానీ సిక్కిం ఆ పని చేసినందుకు ఆనాడు నేపాల్, భూటాన్‌లు ఆగ్రహించాయి.

ఇలాంటి భూభాగాన్ని విదేశీయులకు ధారాదత్తం చేయడం దారుణమని సిక్కింను తూర్పారబట్టాయి కూడా. 1851 నాటికే ఇక్కడి ఆదాయం యాభైవేల రూపాయలు. ఇది నేపాల్, భూటాన్‌ల మీద ఆధిపత్యం కొనసాగించడానికి అనువైన వ్యూహాత్మక ప్రదేశం. టిబెట్, సిక్కింల గుండా జరిగే వాణిజ్యానికి కూడా ఈ ప్రాంతమే కీలకం. వీటితో పాటు వేసవి విడిదిగా కూడా ఆంగ్లేయులు దీనిని విశేషంగా ఇష్టపడేవారు. బ్రిటిష్‌వారు డార్జిలింగ్‌ వాతావరణాన్ని బట్టి శానెటోరియాల కేంద్రంగా ఉపయోగించుకున్నారు. ఇండియన్‌ మెడికల్‌ సర్వీస్‌కు చెందిన డాక్టర్‌ ఆర్థర్‌ కాంప్‌బెల్‌ ఇక్కడ శానెటోరియాల పని చూసేవారు. 1835 సంవత్సరంలోనే ఆయన పని ఆరంభించారు.

డెబ్బయ్‌కి తక్కువ కాకుండా ఆంగ్లేయుల కుటుంబాలు ఇక్కడకు తరలివచ్చాయి. తరువాత ఇక్కడి తేయాకు ప్రపంచ ప్రసిద్ధిగాంచింది కూడా. ఆ ఘనత కూడా కాంప్‌బెల్‌కే దక్కుతుంది. అతడు అంతకు ముందు చైనాలో పనిచేసేవాడు. అక్కడ నుంచి డార్జిలింగ్‌ కొండలలోకి వస్తూ కూడా తేయాకు విత్తనాలు తెచ్చారు. అదే అక్కడ అపారమైన సంపదగా రూపొందింది. వేల ఎకరాలకు విస్తరించింది. స్వతంత్ర భారతదేశంలో ప్రాంతాల విలీన చట్టం మేరకు 1954లో పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో విలీనం చేశారు. అప్పుడే ఒక జిల్లాగా దీనిని ఏర్పాటు చేశారు.

ఇందులో డార్జిలింగ్‌ పట్టణం, పరిసరాలు, కుర్సియాంగ్‌ కలింపాంగ్, సిలిగురిలోని తెరాయి భూభాగం ఆ జిల్లాలో చేర్చారు. 1950లో టిబెట్‌ మీద చైనా దాడి తరువాత, ఆ ప్రాంతానికి చెందిన వారిలో చాలామంది డార్జిలింగ్‌ జిల్లాకే తరలి వచ్చారు. ఆ తరువాతే ఈ ప్రాంత స్థానికులలో తాము నిర్లక్ష్యానికి గురయ్యామన్న భావన ఆరంభమైంది. అదే తరుచుగా ఆందోళనల రూపంలో బయటపడేది కూడా. ముఖ్యంగా మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమపై ఆధిపత్యం చలాయిస్తున్నారని అక్కడి కొండవాసులు భావించిన ప్రతిసారి ఇలాంటి ఆందోళనలు చోటు చేసుకునేవి.

బాధ్యతా రాహిత్యంతో కొత్త చిచ్చు
1988లో డార్జిలింగ్‌ గూర్ఖా హిల్‌ కౌన్సిల్‌ను (కొండప్రాంత అభివృద్ధి మండలి) ఏర్పాటు చేశారు. దీనితో1986– 1988 మధ్య ఆ ప్రాంతాన్ని కుదిపేసిన అల్లరు, హింస శాంతించాయి. ప్రభుత్వానికీ, గూర్ఖా జాతీయ విమోచన సంస్థకూ, ఆ సంస్థ నేత సుభాష్‌ ఘీషింగ్‌కు మధ్య జరిగిన ఒప్పందం మేరకే ఈ ఏర్పాటు జరిగింది. కానీ ఆ మండలి సత్ఫలితాలను ఇవ్వడంలో విఫలమయింది. ఈ విఫల యత్నం తరువాత మళ్లీ గూర్ఖాలాండ్‌ ప్రాంతీయ పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ పరిపాలక వ్యవస్థను 2011లో ఏర్పాటు చేశారు.

దీనితో ‘గూర్ఖాలాండ్‌’కు అధికారికంగా గుర్తింపు లభించింది. కానీ ముందు ఏర్పాటు చేసిన కొండప్రాంత మండలి మాదిరిగానే ఈ పరిపాలక వ్యవస్థకు కూడా తగినంత స్వయం ప్రతిపత్తి లేదు. ఇక్కడే గమనించవలసిన అంశం ఒకటి ఉంది. ప్రస్తుతం పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సహా, అంతకు ముందు పనిచేసిన ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాభివృద్ధికి ఇచ్చే నిధులకు జవాబుదారీగా ఉండాలని భావించలేదు. అక్కడ ఏర్పాటు చేసిన పరిపాలనా మండలి కూడా ఇదే బాటలో నడిచింది.

భాషతో రగులుకున్న వివాదం
డార్జిలింగ్‌ కొండలలో భాష ఎప్పుడూ వివాదాస్పద అంశమే. కానీ ఆ ప్రాంతంలో నేపాలీలు మైనారిటీలని చిత్రించడానికి ప్రభుత్వాలు జనాభా లెక్కలను ఆయుధంగా చేసుకునేవి. నిజానికి నేపాలీలు అక్కడ మెజారిటీ వర్గమే. 1960 దశకంలో అక్కడ జరిగిన నేపాలీ భాషోద్యమం ఈ సాంస్కృతిక చిత్రానికి అద్దం పడుతుంది. బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, కేంద్రం కూడా జనాభా లెక్కలనే రాజకీయంగా ఉపయోగించుకుని, నేపాలీ మెజారిటీ వర్గాల భాష కాదని వాదించాయి. అలా డార్జిలింగ్‌ పాఠశాలల్లో నేపాలీ మాధ్యమంగా ప్రవేశించకుండా చేయగలిగారు.

దీనికి తోడు పెరిగిన బెంగాలీల ఆధిపత్యం ఆ రెండు వర్గాల (స్థానిక గుర్ఖాలు, బయట నుంచి వచ్చినవారు) మధ్య దూరాన్ని మరింత పెంచింది. ప్రస్తుత ముఖ్యమంత్రి గడచిన రెండేళ్లుగా నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని డార్జిలింగ్‌లోనే నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలను బాయుల్‌ పాటల కచేరీలతో జరుపుతున్నారు. అవి బెంగాలీ జానపద గీతాలే. దీనినే డార్జిలింగ్‌ వాసులు వ్యతిరేకిస్తున్నారని గూర్ఖా జనముక్తి మోర్చా సభ్యుడు స్వరాజ్‌ థాపా చెప్పారు. మరొక విషయం కూడా గమనంలోకి తీసుకోవలసి ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లోని చాలా ప్రాథమిక పాఠశాలలు నేపాలీ భాషను పాఠ్యాంశంగా బోధించడం లేదు. కానీ డార్జిలింగ్‌లోని పాఠశాలల్లో వంగ భాషను ఐచ్ఛికాంశంగా తీసుకునే అవకాశం ఇప్పటికే ఉంది.

మరి, బెంగాలీ భాషను తప్పనిసరి చేస్తున్నట్టు అధికారిక ప్రకటన ఎందుకు విడుదల చేయడం? ఇటీవల అక్కడ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో తృణమూల్‌ కాంగ్రెస్‌ సాధించిన విజయాలను పటిష్టం చేసుకోవడానికేనా? రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఆ ప్రాంతంలో వేగంగా పుంజుకుంటున్న బీజేపీకి అడ్డుకట్ట వేయడమే తృణమూల్‌ కాంగ్రెస్‌ అసలు ఉద్దేశం. అలాగే పశ్చిమ బెంగాల్‌లోనే బీజేపీ చెప్పుకోదగిన శక్తిగా బలపడుతోందని కూడా విశ్లేషకుల అంచనా. హిందూ–హిందీ సిద్ధాంతంలోని హిందీ సామ్రాజ్యవాద ధోరణిని ఎదుర్కొనడానికి మమతా బెనర్జీ వంగ భాషను ఫణంగా పెట్టదలిచారా? అయితే కేరళ, కర్ణాటక రాష్ట్రాల పరిణామాలను చూస్తే ఈ అభిప్రాయం సరికాదని అనిపిస్తుంది. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు మాట్లాడే భాషను పాఠశాలల్లో తప్పనిసరి పాఠ్యాంశాన్ని చేస్తూ ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రకటనలు చేశాయి.

ఈ మొత్తం ఉదంతంలో కొన్ని ఇతర కీలక అంశాలు కూడా కనిపిస్తాయి. ఆందోళనకారులు ప్రతిపాదిస్తున్న గూర్ఖాలాండ్‌ ప్రత్యేక రాష్ట్రంలో డార్జిలింగ్‌ జిల్లా, కలింపాంగ్‌ జిల్లా, సిలిగురి పరిధిలోని ప్రాంతాలు, తెరాయి, అలీపుర్దార్‌ పరిధిలోని దొవర్స్, జల్పాయిగురి జిల్లాలను కలపాలని కోరుతున్నారు. కానీ ఈ ప్రాంత జనాభాల నిష్పత్తులను పరిశీలిస్తే చాలా వైరుధ్యాలు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో గూర్ఖా జనాభా 35 శాతం మాత్రమే. ఇంకా ఆదివాసీలు 20 శాతం, బెంగాలీలు 15 శాతం, రాజ్‌బంగీసిస్‌ 25 శాతం, టోటాలు, మెచ్‌లు, ఇతరులు 5 శాతం ఉన్నారు. ఇంత వైరుధ్యంలో, జాతుల మేళవింపులో ప్రత్యేక గూర్ఖాలాండ్‌ ఏర్పాటును వీరంతా స్వాగతిస్తారని ఆందోళనకారులు ఎలా భావిస్తున్నారు? అలాగే షెర్పాలు, భుటియాలు, లెప్చాలు, ఇతర తెగల వారు కూడా గూర్ఖాలు చెబుతున్న స్వయం పాలనకు మొగ్గు చూపడం లేదు.

జాతీయ పార్టీలు వ్యతిరేకం
గూర్ఖాలాండ్‌ ఏర్పాటుకూ, డార్జిలింగ్‌ను సిక్కింలో విలీనం చేయాలన్న ప్రతి పాదనకూ సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్, సిక్కిం క్రాంతికార్‌ మోర్చా తమ మద్దతు తెలియచేయడంతో వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఈ రెండు ఆకాంక్షలు కూడా ఆ రెండు ప్రాంతాల చరిత్రతో ముడిపడి ఉన్నవే. ఎందుకంటే మొదట చెప్పుకున్నట్టు డార్జిలింగ్‌ ఒకప్పుడు సిక్కింలో అంతర్భాగమే. ఇవాళ డార్జిలింగ్‌ కొండలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ప్రత్యేక గూర్ఖాలాండ్‌ను ఏర్పాటు చేయాలని కొండప్రాంత ప్రజలు నిర్ద్వంద్వంగా కోరుతున్నారు. కానీ ఏ ఒక్క జాతీయ పార్టీ ఇందుకు అనుకూలంగా లేదు.

ఆఖరికి బీజేపీ కూడా ఇదే బాటలో నడుస్తున్నది. 2009 నుంచి 2014 వరకు జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలలో ఆ పార్టీ ఇచ్చిన ప్రతి ఎన్నికల ప్రణాళికలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించింది. గూర్ఖాలాండ్‌ గురించి తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ వాగ్దానం చేసింది. ఇప్పుడు డార్జిలింగ్‌ జిల్లాలో ఉన్న బీజేపీ శాఖలన్నీ జాతీయ నాయకత్వంపైన కాలు దువ్వుతున్నాయి. దీనితో సమస్యకు పరిష్కారం మరింత క్లిష్టంగా మారింది.

నిజానికి అక్కడ కొండప్రాంత ప్రజలు ఈసారి తాడోపేడో తేల్చుకుంటే తప్ప పోరాటం విరమించరాదని భీష్మించాయి. స్వయం పాలన కోసం దశాబ్దాలుగా తాము చేస్తున్న డిమాండ్‌ను ఎలాగైనా సాధించుకోవాలని పోరాట సంస్థలు భావిస్తున్నాయి. అయితే జాతీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు ఈ అంశం నుంచి ఎంత రాజకీయ లబ్ధి పొందవచ్చునో చూస్తున్నాయి. సంఖ్యాబలం మీద ఆధారపడి ఉండే రాజకీయ పార్టీలు అందుకోసం స్థాని కుల ఆకాంక్షలను నీరు కార్చడం అనివార్యంగా కనిపిస్తున్నది.


బిస్వాంత్‌ సాహ
వ్యాసకర్త డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ సంస్థ (కోల్‌కతా) పరిశోధకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement