‘నీళ్లొ’దిలిన కమలం, కాంగ్రెస్
సందర్భం
ఇమామ్
అంబానీ అడుగులకు మడుగులొత్తే బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు వైఎస్ కుటుంబానికీ, వైఎస్సార్‌సీపీకీ ఎన్ని ఆటంకాలు కల్పిస్తున్నాయో మూడేళ్ల చరిత్ర గమనిస్తే అర్థమవుతుంది. వైఎస్ కుటుంబాన్ని వ్యతిరేకించే వారందరూ ఒక్కటై తెలుగు ప్రజలను చీల్చారు.
రాష్ట్ర విభజన రాజకీయాల్లో బీజేపీ, ఆ పార్టీ నేత వెంకయ్య నాయుడు అనుసరిం చిన తీరు వారి విశ్వసనీయతకు గండి కొట్టింది. ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక తెలంగాణ, రాయలసీమ అభివృద్ధి... ఏ పేరుతో ఇక్కడ ఉద్యమం జరిగినా జలవనరుల పం పిణీ అంశం బలంగా ఉండేది. రాయలసీమ సంయుక్త కార్యాచరణ కమిటీ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో రాయలసీమ జిల్లాల సేద్యపునీటి సౌకర్యాల కోసమే కాక, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, జిల్లాలోని కరువు ప్రాంతాలకు ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాల ప్రాజెక్టుల కోసం కూడా ఉద్యమాలు చేసింది. నిరంతర కరువు పీడిత ప్రాంతాలు చిత్తూరు, కడప, కర్నూలు, మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలోని కొంత ప్రాంతం.. దాదాపు 60 తాలూకాలను దుర్భిక్ష ప్రాంతాలుగా గుర్తించి సేద్యపు నీటి సౌకర్యం కల్పించాలని 1986లో బీజేపీ తీర్మానం చేసింది. పోలవరం, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ పథకాలు చేపట్టి కృష్ణా నదిలోకి నీటిని దాదాపు 200 టీఎంసీలు మళ్లించాలనీ, ఆ రకంగా రాయలసీమ, ప్రకాశం జిల్లా ప్రాజెక్టులకు సాధికారత కల్పించాలని నేటి ఆందోళనల నేపథ్యంలో సీమాంధ్ర బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
తెలంగాణ, రాయలసీమలోని ఆరు ప్రాజెక్టులకు సేద్యపునీటి వసతులు కల్పించి ప్రత్యేకించి ప్లానింగ్ కమిషన్ గుర్తిం పును సాధించే చర్యలు అమలు పరిచినపుడే విభజనకు మద్దతిస్తామని అనేక సందర్భాల్లో వెంకయ్యనాయుడు చెప్పారు. 371-డీ అధికరణను సవరించాలని ఒక ముఖ్యమైన డిమాండు చేశారు. కానీ జరిగిందేమిటి? బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుల నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో మిగు లు జలాల మీద, వరద జలాల మీద నీటి వినియోగ హక్కు ప్రశ్నార్థకంగా మారబోతోంది! ఇందుకు విరుగుడుగా గోదావరీ జలాలను కృష్ణాలోకి మళ్లించి ఎగువన కృష్ణా జలాలకు, కరువుపీడిత ప్రాంతాల అవసరాలు తీర్చవచ్చని ఒక గొప్ప ఆశయం తో వైఎస్ తలపెట్టి ప్రారంభించి అమలుపరుస్తున్న పథకాల పూర్తికి చట్టబద్ధత, నిధులు, కాలవ్యవధి నిర్ణయించి అమలు పరిచిన తర్వాత తెలంగాణ విభజనకు మద్దతు ఇచ్చి ఉంటే వెంకయ్య, ఆయన పార్టీ నిజాయితీ ఏమిటో వెల్లడయ్యేవి.
ఇటీవల దేశంలో సంచలనాత్మక ప్రకటనలు వెలువడ్డాయి. గోదావరి, కృష్ణా బేసిన్‌లో చమురు నిక్షేపాల తవ్వకాలలో వెలుగులోకి వచ్చిన అవినీతి ఆరోపణల గురించి ఆమ్‌ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తావించారు. లక్షా రెండువేల కోట్ల రూపాయల మేర అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కేజ్రీవాల్ రిలయన్స్ అధినేత అంబానీ సహా కొందరు కాంగ్రెస్ ప్రముఖలపై కేసులు పెట్టారు. బీజేపీ, కాంగ్రెస్ కంగుతిని కేజ్రీవాల్‌ను పదవీచ్యుతుడిని చేశాయి. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని చమురు నిక్షేపాల వెలికితీత ఒప్పందాలలో అవినీతి, అక్రమాలపై మొట్టమొదటిసారిగా ప్రశ్నించి తమ అధినాయిక సోని యాతో, ప్రధాని మన్మోహన్‌తో తలపడ్డ మహానాయకుడు డాక్టర్ వైఎస్. అంబానీ అడుగులకు మడుగులొత్తే బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు వైఎస్ కుటుంబానికీ, వైఎస్సార్‌సీపీకీ ఎన్ని ఆటంకాలు కల్పిస్తున్నాయో మూడేళ్ల చరిత్ర గమనిస్తే అర్థమవుతుంది. వైఎస్ కుటుంబాన్ని వ్యతిరేకించే వారందరూ ఒక్కటై తెలుగు ప్రజలను చీల్చారు. జగన్‌కు వ్యతిరేకంగా ఇంకా కుట్రలు చేస్తున్నారు.
చేసిన వాగ్దానాలకు బీజేపీ ఎందుకు తిలోదకాలిచ్చింది? 2జీ స్పెక్ట్రం, కోల్గేట్, బోఫోర్స్ వంటి కాంగ్రెస్ అవినీతి అక్రమాలపై పార్లమెంటును నెలల తరబడి దద్దరిల్లజేసిన బీజేపీ తోక ముడవడానికి కారణాలేమిటి? వైఎస్ జీవించి ఉండగా విభజన గురించి సోనియా ఎందుకు మాట్లాడలేదు? ఆయ నతో లభించే అధికారం కోసం సోనియా, మన్మోహన్‌లు ఆ రోజుల్లో మిన్నకుండిపోయారు. ఇప్పుడు అధికారం కోసం కేవ లం ఓట్లు, సీట్ల ఆధారంగా రాష్ట్రాన్ని విభజించి లబ్ధి పొందాలనుకుంటున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ పోరాటాలు చేసిం ది. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా, ఇతర ప్రచార మాధ్యమాలు, రాష్ట్ర కాం గ్రెస్ అనుసరించని వికృత చేష్టలంటూ లేవు. అందరి ధ్యేయ మూ ఒక్కటే. వైఎస్‌ఆర్‌సీపీని, జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయం గా నిలువరించడమే.
(వ్యాసకర్త కదలిక సంపాదకులు, అనంతపురం)