పంట పొలాల్లో అనకొండలు | chandrababu eye on farm lands in ap capital region | Sakshi
Sakshi News home page

పంట పొలాల్లో అనకొండలు

Published Mon, Dec 1 2014 4:10 AM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

పంట పొలాల్లో అనకొండలు - Sakshi

పంట పొలాల్లో అనకొండలు

తినుబండారాల దిగుమతి తప్ప వడ్లగింజ పండించటం ఎరగని సింగపూర్ లాంటి కొత్త రాజధానిని నిర్మిస్తానని గంతులేస్తున్న చంద్రబాబు పలుకులు లేత సొరకాయలైతే బాధపడక్కర్లేదు కానీ నిజమైతేనే దిగులు చెందాలి. ఎందుకంటే ఏపీ ‘రాజధాని’ నేలమీదికి అప్పుడే అనకొండ పాములు దిగి విషజ్వాలల్ని చిమ్ముతున్నాయి.
 
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ నుండి తెలివితేటలు కూడా అరువు తెచ్చుకున్నట్లున్నాడు. గట్టిగా మన ఒక జిల్లా అంత జనాభా లేని సింగపూ ర్‌లోని ఎత్తై భవం తులు చూపి, దేశదేశాల ద్రవ్య జూదరుల నల్లధన కేంద్రాన్ని తన టెక్నికలర్ కలల రాజ్యంగా ప్రకట నలు గుప్పిస్తున్నాడు. 2010లో ప్రపంచంలో సంప న్నులు అధికంగా ఉన్న దేశంగా నమోదైన సింగ పూర్‌లో నూటికి 20 మంది అతి నికృష్ట జీవితాలు గడుపుతూ గత 10 ఏళ్లలో ఎలాంటి మెరుగుదలకూ నోచుకోకుండా ఉన్నారన్న వాస్తవాన్ని కప్పిపుచ్చుతున్నారు. సింగపూర్ అందాలకు తమ రక్తాన్ని, చెమటను చిందించింది ఈ నిరుపేదలే!

భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో దిక్కులేక కడు పు చేతబట్టుకుని తమ రెక్కలను అమ్మకాలకు పెట్టుకుంటూ సింగపూర్‌లో సమస్త చాకిర్లు చేస్తూ కూడా, పగళ్లు బజారులో తమ మురికి దేహాలతో కనిపించటానికి ఇలాంటి వారికి అవకాశం లేదు. ఎలాంటి కార్మిక హక్కులకు నోచుకోకుండా, తప్ప నిస్థితిలో ఆందోళన చేస్తే క్రూర అణచివేతలకూ, తుపాకి కాల్పులకూ బలైపోయేది కూడా వీరే! మొత్తం తినుబండారాలను దిగుమతి చేసుకో వటమే తప్ప వడ్లగింజ పండించటం ఎరగని సింగపూర్ లాంటి కొత్త రాజధానిని నిర్మిస్తానని ఆకాశానికి నిచ్చెనలేస్తున్న చంద్రబాబు పలుకులు లేత సొరకాయలైతే మనం పెద్దగా బాధపడ క్కర్లేదు కానీ నిజమైతేనే నిజంగా దిగులు చెందా లి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ‘రాజధాని’ నేలమీది కి అప్పుడే అనకొండ పాములు దిగి వాటి విష జ్వాలల్ని చిమ్మటం మొదలుపెట్టేశాయి. పంట పొలాల మీద ఆధారపడి తమ వ్యవసాయ పనుల నైపుణ్యంతో జీవిస్తున్న కూలీలు, కౌలు రైతులకు వెట్టిచాకిరీ బతుకులు కళ్లలో కదలాడుతున్నాయి.

కన్నవారినీ, పెరిగిన ఊరునీ, అనుబంధం పెంచు కున్న పంట పొలాల్నీ, పశువుల్నీ వీడి వలసలు పోయి కూలీలుగా, రిక్షావారిగా, గృహ నిర్మాణ కార్మికులుగా, వెట్టిచాకిరీలు చేస్తూ మురికి గుంటల పక్కన దోమల నడుమ జానాబెత్తెడు గుడిసెల్లో తలదాచుకోవాల్సిన దుస్థితి వారికి గోచరిస్తోంది. పేద మధ్యతరగతి రైతులకు అనిశ్చి తమై కానరాని భవిష్యత్తు ఒక వైపు, తక్షణం భూములను అమ్మి సొమ్ము చేసుకో అనే ఆశల పల్లకీ మరోవైపు కనిపి స్తున్నాయి. సంపన్న రైతులు సహా ఎవరికీ కాలు నిలవదు. కునుకుపట్టదు. ఆశ చావదు. భయం వీడదు. ప్రశాంతమైన చెరువులో చంద్రశిల విరిగి పడ్డట్టు అంతా కలకలం, కల్లోలం. కలహాలూ కంగాళీ!!

అమరావతి సీమ రైతాంగాన్ని చంద్రబాబు సూటిగా ఇలా ప్రశ్నిస్తున్నాడు. ‘నేను రేపు సృష్టించ బోయే మబ్బులు, అవి ఎల్లుండి కురిపించబోయే కాసుల వర్షం మీకు కావాలా? మా కార్పొరేట్ మిత్రులు నేడు ఇవ్వచూపే ఎకరాకు కోటిపైన ధన రాశి కావాలా? కోరుకోండి’ అని శకుని పాచికలు విసురుతున్నాడు. ఇలాంటి జూదంలో ఎప్పుడూ పేద మధ్యతరగతి ప్రజలు, మట్టిని నమ్మినవారూ ఓడిపో తారని వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఎర్రని ఏగానీ ఇవ్వనివాడు రేపు ఏదో చేస్తానంటే నమ్మా లా? రెతుల ఆవేదన ఇది. ఆందోళన ఇది!

గత నెల రోజులలో కొత్తరాజధాని ప్రాంత మైన తుళ్లూరు చుట్టుపక్కల తాడికొండ, మంగ ళగిరి పరిధిలో సుమారుగా 3,000 కోట్లు రూపాయల భూముల బేరసారాలు జరిగితే రెండు వందల కోట్ల రూపాయలలోపు కొనుగోళ్లు అమ్మ కాలుగా మాత్రమే రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదయ్యాయి. తెల్లధనానికి తోడు సుమారు 15 రెట్లు నల్లధనం చేతులు మారింది. అంటే మార్కెట్లోకి ప్రవేశించింది. అది కుటుంబాల్లో పెంచే కలహాలను పరిష్కరించటానికి పోలీసుల కు, కోర్టులకూ పని పెరుగుతుంది. ప్రైవేటు సెటిల్మెంట్ గ్యాంగులైన మాఫియాల అవసరం పెరుగుతుంది. గృహహింసలు పెరుగుతాయి. విచ్చలవిడి తాగుళ్లు పెరుగుతాయి. వ్యభిచారం, విలాసాలూ, దుబారాలు పెరుగుతాయి. తెలియని వ్యాపారాల్లో పొందే చేదు అనుభవాలు మిగులు తాయి దోసిట్లో పోసిన నీరు కారిపోయినట్లుగా, క్రమంగా నూటికి 99 మంది రైతుల చేతుల్లో నుండి సొమ్ములు జారిపోయి కార్పొరేట్ శక్తుల ఆస్తిపాస్తులుగా అమరుతాయి.

హైదరాబాద్ ఔటరురింగురోడ్డు నిర్మాణ సందర్భపు అను భవం మాత్రమే కాదు, అనేక చోట్ల సెజ్జుల పేరిట రైతులను భూముల నుండి బేదఖల్ చేసిన అన్ని అనుభవాలూ ఇవే. ఇప్పటికీ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లోని సచివాలయం కేవలం  22 ఎకరాల్లోనూ, హైకోర్టు 12 ఎకరాల్లోనూ, అసెంబ్లీ - శాసన  మండలి కలిసి ఎనిమిదిన్నర ఎకరాల్లో మాత్రమే నిర్మాణమై ఉన్నాయి. మొత్తం కలిపినా 50 ఎకరాలు లేదు. సింగపూర్ నల్లధన స్వాములకు చక్రవర్తులైన అమెరికా దేశపు రాజధానీ భవనాలు 500 ఎకరాలలో ఉండగా ఇక్కడ 30వేల ఎకరాలు కావాలనటం హాస్యాస్పదం. అన్నన్ని వేల ఎకరాల నుండి రైతుల్ని బేదఖల్ చేయటాన్ని రాష్ట్ర ప్రజలు, రైతాంగం అనుమతించకూడదు.  రాష్ట్ర సీఎంగా చంద్రబాబు తొలి సంతకం చేసిన రైతుల రుణ మాఫీ అజాపజా కనబడటంలేదు.

కానీ మట్టిని మాణిక్యాలుగా మార్చే రైతు నోట మట్టి కొడుతు న్నారు.‘అప్పుతెచ్చి లేపిన మిద్దెలో కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది’ అన్నా డు ‘వందేమాతరం’ గేయంలో చెరబండరాజు. వాస్తుదోషం లేకుంటే చాలు ఎంత అప్పయినా ముప్పురాదు అంటున్నాడు చంద్రబాబు. ఇప్పటికే సేకరించదలుచుకున్న 30వేల ఎకరాల్లో ప్రభుత్వ, బంజరు భూములే చాలా ఉంటాయి. వాటిలో 500 ఎకరాలు రాజధానికి సరిపోతుందని నిపుణు లే పేర్కొన్నారు. అంతకు మించి ఎక్కువ తీసుకుం టే ప్రజల్ని కొల్లగొట్టి నల్లధన యోధులకు మెక్క బెట్టే అతి తెలివైన పథకమే. కొడవటిగంటి కుటుంబరావుగారు రాసిన ‘స్వార్థబుద్ధి’ అనే కథ లో యువరాజు తన ముసలి మంత్రితో ‘‘ప్రజలకు అవసరమైన పనులు చేయటానికి తెలివితేటలు అవసరం లేదు. ప్రజలకేం కావాలో తెలిస్తే చాలు. ప్రజల్ని మోసం చేయటానికే ఎక్కువ తెలివితేటలు కావాలి’’ అంటాడు. కొ.కు. చెప్పిన ఈ మోసకా రితనాన్ని మనం చావు తెలివితేటలంటే తప్పా?
 
‘ప్రజాసాహితి’ సంపాదకులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement