పాత జిత్తులు ఇక చెల్లవు | Chandrababu naidu will no care of them reservations for two years | Sakshi
Sakshi News home page

పాత జిత్తులు ఇక చెల్లవు

Published Fri, Mar 25 2016 12:28 AM | Last Updated on Mon, Jul 30 2018 6:29 PM

పాత జిత్తులు ఇక చెల్లవు - Sakshi

పాత జిత్తులు ఇక చెల్లవు

ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని కాపులు మరచిపోతారనో లేక వచ్చే ఎన్నికలకు ఏడాది ముందు ప్రకటిస్తే మళ్లీ కాపులు తమకే ఓటు వేస్తారనో చంద్రబాబు వారి రిజర్వేషన్ల సంగతిని గత రెండేళ్లుగా పట్టించుకోలేదు. కాపులకు, బీసీ కులాలకు మధ్య ఘర్షణను రేకెత్తించడం వల్ల స్వల్పకాలికమైన కొంత లబ్ధి కలుగుతుందేమో. కానీ, దీర్ఘకాలంలో జనాభాలో 22% ఉన్న కాపులు గెలవలేకపోవచ్చు కానీ ఎవరినైనా ఓడించగలరు. కాబట్టి పాత జిత్తులు, వ్యూహాలు ఇక పారవని గుర్తించడం మంచిది.
 
 కాపులను వెనుకబడిన తరగతుల్లో చేర్చాలంటూ ఇటీవల బద్ధలైన ఉద్యమ వెల్లువ కొత్తదేమీ కాదు. పలు దశాబ్దాలుగా అలాంటి ఉద్యమాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. కాపులు వ్యవసాయంపై ఆధారపడినవారు. కుటుంబ విభజన క్రమంలో కాపు రైతుల కమతాలు చిన్నవైపోయి, పేదవారయ్యారు. కమ్మ, రెడ్డి, రాజు, వెలమ వంటి ఇతర వ్యవసాయ కులాల వారితో కూడిన నూతన కాంట్రాక్టర్లు, వ్యాపార వర్గాల పాలక వర్గంలో కాపులు భాగంగా లేరు. పైగా వారిలో కులపరమైన పొందిక లేదు. దీంతో వ్యాపారాలను లేదా వ్యాపార నైపుణ్యాలను పెంపొందింపజేసుకోడానికి తగినన్నినిధులు కూడా వారికి లేవు. పైగా రాజకీయాలంటేనే సంపదను, కాంట్రాక్టులను చేజిక్కించుకునే మహదావకాశంగా మారాయి.  
 
 కాపులు మాత్రం రెండో శ్రేణివారుగానే లేదా పెద్ద నేతల అనుచరులుగానే మిగిలిపోయారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడు కాపులు, కమ్మవారికి వ్యతిరేకంగా పనిచేస్తారని భావించారు. కానీ ఎన్టీఆర్ తెలివిగా యర్రం నారాయణ స్వామి వంటి కాపు నేతలు పలువురుని కాంగ్రెస్‌లోంచి తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇక కాంగ్రెస్ ప్రాంతీయ కులాలతో జాగ్రత్తగా వ్యవహరించలేక పోయింది. దీంతో కాపులు తమను ఏ పార్టీ పట్టించుకుంటే దానివైపే ఎన్నికల్లో మొగ్గు చూపుతూ వచ్చారు. చిరంజీవి పార్టీని ఏర్పాటు చేసినప్పుడు వారంతా ఆయన పార్టీ వెంటే నిలిచారు. 2014లో టీడీపీ జాగ్రత్తగా కాపు నేతలను ఆహ్వానించి వారికి కొన్ని టికెట్లు ఇచ్చింది. దీనికి తోడు అది బీజేపీ, మోదీలతో కలవడంతో కాపులలో అధిక సంఖ్యాకులు టీడీపీ-బీజేపీ కూటమి వైపు మొగ్గారు. పైగా చంద్రబాబు నాయుడు సైతం కాపులను బీసీలలో చేరుస్తామనే అంశాన్ని మొట్టమొదటిసారిగా టీడీపీ ఎన్నికల ప్రణాళికలో చేర్చారు.
 
 గోదావరుల నుంచి ఉత్తరాంధ్ర వరకు అసంతృప్తి
 విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌లో కాపులు అతి పెద్ద కుల సామాజిక వర్గం (జనాభాలో 22% పైగా). అయినా నేటి ప్రభుత్వ అధికారం మాత్రం జనాభాలోని అతి చిన్న భాగం చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. అధికారం తిరిగి తమ చేజారిపోయిందని వారు భావించారు. మరోవంక ఇటు పశ్చిమ గోదావరి నుంచి అటు శ్రీకాకుళం వరకు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సైతం అసంతృప్తిని రేకెత్తించే పలు అంశాలు పేరుకుపోతూ వచ్చాయి.
 
 చాలా ఇతర కులాలలాగే కాపులు కూడా ఒకే ఒక్క కులం ప్రభుత్వాన్ని శాసిస్తోందని భావించడం వీటిలో ప్రధానమైనది. పేరుకు చంద్రబాబు కొందరు కాపులను మంత్రులను చేసినా, ఉప ముఖ్యమంత్రి పదవిని సైతం కట్టబెట్టినా వారిలో ఆ భావన చెదరలేదు. ఇకపోతే, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి పరుస్తుండగా ఇతర ప్రాంతాలకు ఏమీ దక్కకపోవడం మరింత ఆగ్రహాన్ని రేకెత్తించసాగింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భూమి విలువ ఎకరా కోట్లలో పలుకుతుంటే మిగతా వారికి లభించింది ఏమీ లేదు. ప్రధానంగా గుంటూరు, కృష్ణా జిల్లాల కోసం గోదావరి జలాలను తరలించడం కోసం పట్టిసీమ ప్రాజెక్టుపై వేల కోట్ల రూపాయలు  ఎలా ఖర్చు చేస్తున్నారో మిగతా ప్రజలు చూశారు.
 
 గోదావరి జిల్లాల అత్యంత విలువైన సహజ వనరైన నీటిని తరలించుకుపోతూ ఆ జిల్లాల కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టింది లేదు. ఒకవంక గుంటూరు జిల్లా రైతుల భూములకు కోట్లు లభిస్తుండగా, పైడిపాక, పోలవరం, అంగలూరు, దేవీపట్నం మండలాలలోని అత్యంత సారవంతమైన భూములకు సైతం ఎకరాకు లక్ష రూపాయలకు మించి లభించడం లేదు. కేంద్ర ప్రాజెక్టయిన పోలవరం నిర్వాసితులకు, నష్టపోయినవారికి 2013 భూసేకరణ చట్టం వర్తించకుండా అడ్డుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాడటాన్ని ప్రజలు గమనించారు.  పోలవరం రిజర్వాయరు వల్ల గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో 5 లక్షల మంది ప్రజలు నష్టపోతున్నారు.  
 
 ప్రభుత్వం ముందున్న సవాళ్లు
 ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని కాపులు మరచిపోతారనో లేక వచ్చే ఎన్నికలకు ఏడాది ముందు ప్రకటిస్తే మళ్లీ కాపులు తమకే ఓటు వేస్తారనో చంద్రబాబు వారి రిజర్వేషన్ల సంగతిని గత రెండేళ్లుగా పట్టించుకోలేదు. ఇది ఆయన ఎదుర్కొనే మొదటి అడ్డంకి. ఆయన ప్రభుత్వం హడావుడిగా కాపులకు బీసీ హోదాను ఇవ్వడం తక్షణమే ప్రతిపాదనలు అందించాలంటూ ఒక కమిషన్‌ను నియమించింది.  2014 మార్చిలో కాంగ్రెస్ ప్రభుత్వం జాట్లకు కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఆయనకు ఇచ్చిన తీర్పు మరో ప్రధాన సమస్యగా అడ్డు నిలుస్తుంది. ‘‘పాత ఫార్ములా ప్రకారం ఇక మరిన్ని కుల రిజర్వేషన్లు లేవు’’ అని ఆ తీర్పు స్పష్టం చేసింది. జాట్లతోపాటూ, ముస్లింలకు, మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చిన రిజర్వేషన్లను కూడా రద్దు చేసేసింది.  2015 మార్చి 17 నాటి ఆ తీర్పును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఏం చేస్తారు? కాంగ్రెస్ జాట్లకు రిజర్వేషన్లిచ్చాక, సుప్రీం కోర్టు వాటిని రద్దు చేసినట్టే కాపుల విషయంలోనూ జరిగాక ‘‘ఏం చేయమంటారు? సుప్రీం కోర్టు మీకు బీసీ రిజర్వేషన్లు కల్పించడానికి అంగీకరించడం లేదు’’ అని అమాయకంగా అంటారా?
 కాపులకు అమరావతి ప్రాంత అభివృద్ధిలో ఎలాంటి ఆసక్తి లేదు. కాబట్టి ఉభయ గోదావరులు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కాపులు సహా ఇతర కులాలకు ఆగ్రహం కలగకుండా చూడటానికి ఆయన చేయాల్సినవి కొన్ని ఉన్నాయి.
 
 1. కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న నేతలను కొందరు కాపు మంత్రులు, ఎంఎల్‌ఏలు, ఎంపీల చేత దూషింపజేసే పనిని వెంటనే కట్టిపెట్టాలి. 2. కృష్ణా, గుంటూరు జిల్లాల మంత్రులు (ఆధిపత్య కులాలకు చెందినవారు) గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఇతర నేతలందరినీ దూషిస్తున్నారు. ఏ విలువా లేని ఈ మంత్రుల తీరు ఫలితంగా కులాల మధ్య సంఘర్షణ రేగుతోంది. ఇతర కులాలను తిట్టిపోయడం కోసం వారిలా పర్యటనలు చేపట్టకుండా చేయాలి. 3. టీడీపీకి చెందిన కాపు, తదితర ఆధిపత్యేతర కులాల ఎమ్మెల్యేలు, ఎంపీలలో అత్యధికులు వ్యాపార వేత్తలే. అలాంటి వారైతేనే రాజకీయంగా వారి ప్రతిష్ట పెరగకుండా ఉంటుందని వారికి సీట్లిచ్చారు.
 
 టీడీపీ-బీజేపీ గాలి వల్ల, ధన బలం వల్ల్ల ఎలాంటి ప్రజాపునాది లేని అలాంటి వారు చాలా మందే గెలిచారు. వారు తమకు అందుబాటులో ఉండే బాపతు కాదని ప్రజలకు బాగా తెలుసు. సదరు ప్రజా ప్రతినిధులపై వారిలో అసంతృప్తి, ద్వేషం పెరగడం ఖాయం. 4. మూడు జిల్లాలకు, కాంట్రాక్టర్లకు మేలు చేస్తూ, తమ నీటిని దొంగిలించే ప్రాజెక్టులను చేపట్టింది వారి మంచి కోసమేననే వంచనాత్మక ప్రచారాన్ని కట్టిపెట్టడం మంచిది. ప్రజలు తెలివైనవారు. వారికంతా తెలుసు. ఈ ప్రచారం ద్వారా వారిని అవమానించినట్టవుతుంది.
 
 ఉత్తుత్తి మాటలు, పదవులు చాలిక
 ఇటీవల ఓ కాపు మంత్రి,  ముద్రగడ పద్మనాభాన్ని, కాపుల ఆందోళనను నేరుగా విమర్శిస్తూ చంద్రబాబు ఒక కాపును ఉప ముఖ్యమంత్రిని చేశారని ఘనంగా చెప్పారు. ఎవరైనా ఉప ముఖ్యమంత్రి కావచ్చు. కానీ ఎవరైనా  నాయకుడు కాలేరు. ముద్రగడ పద్మనాభం నాయకుడు. అందరూ ఉపముఖ్యమంత్రులు లేదా మంత్రులు, నాయకులు కారు. కాపుల జనాభా 3% మాత్రమే అయితే చంద్రబాబు ఒక కాపును ఉప ముఖ్యమంత్రిని చేసే వారా? ఏపీలో ఆధిపత్య కులాలు అల్ప సంఖ్యాకులు కావడం రాష్ట్ర విభజన పర్యవసానం. కాపులు, ఇతర బీసీ కులాల సంఖ్యాబలం పెరిగింది. కాపు లకు, బీసీ కులాలకు మధ్య ఘర్షణను రేకెత్తించడం వల్ల స్వల్పకాలికమైన కొంత లబ్ధి కలుగుతుందేమో.
 
 కానీ దీర్ఘకాలంలో జనాభాలో 22% ఉన్న కాపు లు గెలవలేకపోవచ్చు కానీ ఎవరినైనా ఓడించగలరు. ఉత్తరప్రదేశ్‌లో మాయా వతి, బ్రాహ్మణ మద్దతుతో (15%) అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల తర్వాత వారే ఆమెను ఓడించారు. అక్కడ బ్రాహ్మణుల మద్దతులేనిదే ఎవరూ ముఖ్య మంత్రి కాలేరు. అలాగే ఏపీలో ఒక కులానికి వ్యతిరేకంగా మరో కులాన్ని పోరాడేలా చేసే ఆ పాత ఆటలు ఇక సాగవు. కాబట్టి చంద్రబాబు సుప్రీం కోర్టు తీర్పును అధిగమించి కాపులకు రిజర్వేషన్లను కల్పించే మార్గాన్ని అన్వేషించడం కోసం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తుల సలహాలను తీసుకోవాలి.
 
జాట్లు సహా పలు సామాజిక వర్గాలను కొత్తగా బీసీలలో చేర్చ డాన్ని రద్దు చేసిన తీర్పే ‘‘రిజర్వేషన్లను కల్పించడానికి ప్రభుత్వం కొత్త బృం దాలను అన్వేషించాలి’’ అని కూడా చెప్పింది. అంటే ప్రభుత్వం భారీ సంఖ్య లో ఉన్న కాపు వ్యవసాయ కూలీలను, రిక్షాలు లాగేవారిని, విద్య, ఆస్తులు వగైరా లేనివారిని గుర్తించి రిజర్వేషన్ల కోసం సూచించాల్సి ఉంటుంది.  కావు రిజర్వేషన్లపై బీజేపీ మౌనం ఆసక్తికరం. అదే మౌనాన్ని వారు కొనసాగిస్తే వారు 2004 నాటి తమ 2% ఓట్లకు తిరిగి రాక తప్పదు. 22%గా ఉన్న కాపులు ఏపీలో భారీ జనాభా. వారికి అమరావతి, సింగపూర్, స్విట్జర్లాండ్ లలో ఆసక్తి లేదు. గుంటూరు, కృష్ణా జిల్లాల కోసం తమ జిల్లాలకు లేకుండా గోదావరి నీళ్లను తోడేసుకుంటున్నారనే భావనే వారిలో ద్వేషానికి కారణమవు తోంది. కాబట్టి పాత జిత్తులు, వ్యూహాలు ఇక పారవని గుర్తించడం మంచిది.
- వ్యాసకర్త రాజకీయ విశ్లేకులు  drpullarao@yahoo.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement