సివిల్ సర్వీసెస్ అధికారుల కేటాయింపులో మార్పులు లేనట్టే...
‘వ్సాంకేతిక అంశాలనే పరిశీలించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ
యక్తిగత’ అభ్యంతరాలను డీపీవోటీనే పరిశీలిస్తుంది
మరింత సమాచారం ఇవ్వాలని రెండు రాష్ట్రాలకు సూచన
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ఆధారంగా ఏర్పడిన రెండు రాష్ట్రాలకు సివిల్ సర్వీసెస్ అధికారుల కేటాయింపుపై కసరత్తు చేస్తున్న ప్రత్యూష్ సిన్హా కమిటీ ముసాయిదా జాబితాపై వచ్చిన అభ్యంతరాలను మంగళవారం పరిశీలించింది. ఆగస్టు 22న రెండు రాష్ట్రాలకు అధికారులను కేటాయిస్తూ ముసాయిదా జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై దాదాపు 100 వరకు అభ్యంతరాలు వచ్చినట్టు కమిటీ వర్గాలు తెలిపాయి. వాటిలో అధికారుల కులం, స్థలం, ఇతరత్రా సాంకేతిక అంశాల్లో పొరపాట్లను, గైడ్‌లైన్స్‌పై అభ్యంతరాలను మాత్రమే మంగళవారం కమిటీ పరిశీలించింది. భార్యాభర్తలు ఒకే రాష్ట్ర కేడర్‌లో ఉండాలని, తమ స్థానికత ఆంధ్రప్రదేశ్ అయినప్పటికీ తెలంగాణకు బదిలీ చేశారని, ఆప్షన్ ఏపీ ఇచ్చినా తెలంగాణకు బదిలీ చేశారని... తదితర వ్యక్తిగత అభ్యంతరాలను కమిటీ పరిశీలించలేదు. ఇవన్నీ కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ శాఖ(డీవోపీటీ) పరిధిలోనివని, వాటిని డీవోపీటీ పరిశీలిస్తుందని ఆయా అధికారులకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 22 నాటి ముసాయిదా జాబితాలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఒకవేళ మార్పులు ఉన్నా అవి స్వల్పంగానే ఉంటాయని కమిటీ వర్గాలు తెలిపాయి.
కాగా, ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగి ప్రస్తుత ఆ రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు పి.వి.రమేశ్, జె.ఎస్.వి.ప్రసాద్, ఐపీఎస్ అధికారి ఎ.ఆర్.అనురాధలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు కమిటీకి లేఖ రాయగా.. కమిటీ రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ఇది సాధ్యం కాదని కమిటీ తేల్చినట్టు సమాచారం. తమను తెలంగాణకు కేటాయించడంపై పి.వి.రమేశ్, జేఎస్వీ ప్రసాద్ ప్రత్యూష్ సిన్హా కమిటీని సంప్రదించగా.. ఆంధ్రప్రదేశ్‌లో ఉండాల్సిన ఇన్‌సైడర్ ఐఏఎస్‌ల సంఖ్య కంటే ఎక్కువగా ఉండడం, తెలంగాణలో తక్కువగా ఉండడంతో రోస్టర్ ప్రకారమే కేటాయించామని, ఇందులో మార్పు ఉండదని కమిటీ తెలిపినట్టు సమాచారం.
కొంతమంది అధికారుల అభ్యంతరాలపై రెండు రాష్ట్రాలను మరింత సమాచారం కోరినట్టు తెలిసింది. ఈ కమిటీ మరోసారి సమావేశమై తుది జాబితాను రూపొందించి డీఓపీటీకి సమర్పించనుంది. ఢిల్లీలో జరిగిన సమావేశానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.
ముసాయిదా జాబితానే ఫైనల్!
Published Wed, Sep 3 2014 3:17 AM | Last Updated on Sat, Jun 2 2018 3:39 PM
Advertisement
Advertisement